ఆమె నవ్వే గెలిపించింది!
close
Published : 14/02/2021 00:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆమె నవ్వే గెలిపించింది!

ఆర్ట్స్‌ కాలేజీలో తొలిరోజు... సీనియర్ల చేతిలో జూనియర్లకు ర్యాగింగ్‌ మొదలయ్యింది. ‘ఇదిగో ఈ మందార పూలు తీసుకో... చెవిలో పెట్టుకో! కాలేజీ అంతా తిరగాలి’  అంటూ జూనియర్‌ కుర్రాడికి హుకుం జారీచేసింది సీనియర్‌ అమ్మాయి.. ‘తిరుగుతా కానీ.. అదిగో ఆ అమ్మాయి నా వెంట ఉంటే’ అన్నాడు దూరంగా ఉన్న ఓ అమ్మాయిని చూపిస్తూ... ఆ రోజు షాన్‌ఇబ్రహీంబాద్‌షా చెవిలో మందారపూలు  పెట్టుకుని శ్రుతితో కలిసి ఆ ఛాలెంజ్‌ని గెలిచాడు. కొన్నేళ్ల తర్వాత వారిద్దరికీ విధి మరో సవాల్‌ విసిరింది.  జీవితంలో ఎదురైన అతిపెద్ద కష్టాన్ని వారు ఎదుర్కొన్న తీరు స్ఫూర్తిదాయకమైంది. అరుదైన ప్రేమ కథ ఇది..

త్రిసూరులోని లోని ఆర్ట్స్‌ కాలేజీలో మొదటిరోజు తొలిచూపులోనే మొదలయ్యింది షాన్‌ఇబ్రహీంబాద్‌షా... శ్రుతిల ప్రేమ. షాన్‌కి తమని దగ్గర చేసిన మందారాలన్నా... శ్రుతి తుమ్మెదరెక్కల్లాంటి నల్లని జుట్టంన్న చెప్పలేనంత ప్రేమ.  మతాలు వేరు కాబట్టి తమ ప్రేమను ఇంట్లో అంత త్వరగా అంగీకరిస్తారని అనుకోలేదు వాళ్లు. తమని తాము నిరూపించుకుంటే తల్లిదండ్రులు తప్పకుండా అంగీకరిస్తారని అనుకున్నారు. అందుకే షాన్‌ చదువు అయిపోగానే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. శ్రుతి పీజీలో చేరింది. ఆర్మీలో షాన్‌కి ఉద్యోగం వచ్చింది. ఈ విషయం ఇంట్లో చెప్పినా పెద్దవాళ్ల నుంచి తాము కోరుకున్న సమాధానం రాలేదు. శిక్షణ పూర్తిచేసుకుని ఉద్యోగంలో చేరినా అదే పరిస్థితి. ఇక లాభం లేదనుకుని షాన్‌ శ్రుతి పెళ్లి చేసుకున్నారు. వాళ్లకు అసలు కష్టాలు పెళ్లి తర్వాత ప్రారంభమయ్యాయి. అది తల్లిదండ్రులవల్ల అనుకుంటే పొరపాటు. క్యాన్సర్‌ రూపంలో ఆ సమస్య ఎదురైంది. శ్రుతికి మెడదగ్గర వాపు మొదలయ్యింది. డాక్టర్‌కి చూపిస్తే టీబీ అయిఉంటుందిలే అన్నాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది అది క్యాన్సర్‌ అని. ఈ విషయం తెలిసి ఇరువైపుల పెద్దలూ పరుగున వచ్చారు. ముదిరిన క్యాన్సర్‌ని నయం చేయడం కోసం లక్షలు ఖర్చుపెట్టారు. షాన్‌ తన దగ్గర ఉన్నదంతా ఖర్చుపెట్టాడు. కేవలం డబ్బేకాదు... తనకి మానసికంగా అండగా ఉండటం చాలా అవసరం అని అతనికి అర్థమైంది. అప్పుడతనికి తనూ, శ్రుతి ఇద్దరం చిత్రకారులమన్న సంగతి గుర్తుకొచ్చింది. శ్రుతిని బతికించుకోవడం కోసం తిరిగి బొమ్మలు గీసి వాటిని అమ్మకానికి పెట్టాడు. శ్రుతితో ఉన్న తన బొమ్మను ఏడాది క్రితం గీసినట్టుగానే అందంగా గీశాడు. కాకపోతే ఓ చిన్నమార్పుతో. ఈ సారి తను గీసిన బొమ్మలో ఆ రోజు అందమైన మందారాలని తనలో తురుముకున్న అందమైన తుమ్మెద రెక్కల్లాంటి జుట్టులేదు. ఉత్తబోడిగుండుతో ఉంది. పక్కనున్న తన బొమ్మకూ అంతే. జుట్టులేకుండా గీశాడు. మా ప్రేమపెళ్లికి కులం, మతం అడ్డుగా మారినట్టే విధి కూడా అడ్డుచెప్పింది. ‘కీమోథెరపీలకు శ్రుతి జుట్టుంతా రాలడం మొదలుపెట్టింది. నాకు తోచినంత ధైర్యం చెప్పాను. నీకు తోడుగా నేనెప్పుడూ ఉంటాను అని చెప్పేందుకు నా జుట్టునీ తొలగించుకున్నాను. మా ఇంట్లోని రెక్కలు విచ్చుకుని సందడి చేసే మందార తోటను చూసినప్పుడల్లా తన నవ్వే నాకు గుర్తుకొస్తుంది. ఆ నవ్వు నన్ను ఎన్ని కష్టాల్లోంచైనా బయటపడేస్తుంది. ఎప్పటికీ నాకు ఆ నవ్వు దూరం కాకూడదనకున్నా’ అనే షాన్‌ఇబ్రహీం సంకల్పం గొప్పదే. శ్రుతి క్యాన్సర్‌పై పోరాడి గెలిచింది. షాన్‌నూ  గెలిపించింది. ఇప్పుడు అమ్మగా మారిన శ్రుతి క్యాన్సర్‌ని కూడా పూర్తిగా జయించింది. కేరళలో వీరి ప్రేమకథ ఎందరికో స్ఫూర్తిగా మారింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని