ప్రాణం అనుకున్నా.. ప్రాణమే తీస్తోంది
close
Updated : 27/02/2021 05:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణం అనుకున్నా.. ప్రాణమే తీస్తోంది

నాకు పదిహేనేళ్లప్పుడు మొదటిసారి మహి (పేరు మార్చాం)ని చూశా. చదువు, అందం.. రెండింట్లోనూ టాప్‌ తను. ఎన్ని కష్టాలున్నా నేను ఏదైనా సాధించగలను అనేది. ఆ ఆత్మవిశ్వాసానికే ఫిదా అయిపోయా.
స్కూలు దాటి కాలేజీకొచ్చాం. మనసులు కాస్త దగ్గరయ్యాయి. మేం మాట్లాడుకుంది తక్కువే. కానీ ప్రతిక్షణం ధ్యాసంతా మహిపైనే. రోజులు గడిచేకొద్దీ తనపై ఇష్టం కొండలా పెరిగిపోయేది. కానీ దాన్ని వ్యక్తపరిచే ధైర్యం నాకెక్కడిది. మరోవైపు నాపై తన ఫీలింగ్‌ ఏంటో తెలియదు. ఏళ్లుగా సాగుతోంది నా మూగ ప్రేమ.
ఇంట్లోవాళ్లు తనకి సడెన్‌గా పెళ్లి ఫిక్స్‌ చేశారనే వార్త తెలిసింది. నా గుండె పగిలిపోయింది. కడసారి చూడాలని పెళ్లికెళ్లా. నన్ను చూసింది. ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటోంది. నాలాగే. నాకర్థమైంది. తన మనసులో నా స్థానమేంటో. తిరిగొచ్చేశా. ఆరోజు నుంచి రోజూ నరకమే.
మూడేళ్లు గడిచాయి. ఓరోజు తననుంచి ఫోన్‌. ‘లైఫ్‌ మొత్తం నా తోడుంటావా?’ అనడిగింది. కలా? నిజమా? నాకర్థం కాలేదు. తను ఎందుకు నా అండ కోరుతుందని అడగలేదు. ప్రాణం పోయినా నీ చేయి వదలనని మాటిచ్చా. మా బంధం స్వచ్ఛం. ఈ సమాజం గురించి మేం ఆలోచించదలచుకోలేదు.
దిల్లీ, కోల్‌కతాల్లో నాకు ఉద్యోగాలొచ్చాయి. ‘నన్నొదిలి అంత దూరం వెళ్తావా?’ అంది బేలగా. నేనక్కడికి వెళ్లడం అంటే నన్ను నేను వదిలేసుకోవడమే అనిపించింది.
వయసు ముదిరిపోతోంది. ఇంట్లో ఒత్తిడి ఎక్కువైంది. తనూ వంత పాడింది. ‘నువ్వు పెళ్లి చేసుకుంటేనేం.. నేను నీకు దూరమైపోనుగా?’ అంది. అందరి బలవంతంతో వేరొక అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశా. కానీ మనసొకరితో, తనువొకరితో పంచుకోవడం నావల్ల కాలేదు. భార్యని దూరం పెట్టా. వివాదం విడాకుల దాకా వెళ్లింది. అయినా బాధ పడలేదు. నా జీవితం తనే అనే భరోసాతో.
ఒక్కోసారి మనం ఊహించనివి జరుగుతుంటాయి. మన ఉనికే వ్యర్థం అనేంత బాధిస్తాయి. నా జీవితం, సర్వస్వం అనుకున్న మహి వేరొకరితో సన్నిహితంగా ఉంటోంది అని తెలిసింది. ముందు నమ్మలేదు. నిజమని తెలిశాక కన్నీరు ఆగలేదు. ‘నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావ్‌’ అని హెచ్చరించా. అప్పటిదాకా ప్రేమ కురిపించిన అమ్మాయి ఒక్కసారిగా విరుచుకుపడింది. ‘నీతో మాటలు అనవసరం. అయినా నాతో నీకేంటి సంబంధం’ అంది. ఆ మాట నా గుండెను రెండు ముక్కలు చేసింది. తనకోసం ఎంత చేశా! ఎన్ని వదులుకున్నా? ఇదా ఫలితం. ఆ మాటలు, ఆ చేష్టలకు నరాలు చిట్లిపోయి ఆసుపత్రి పాలయ్యా. కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం అన్నీ పోయి రోడ్డున పడ్డా.
తనడిగితే ప్రాణమైనా ఇచ్చేద్దాం అన్నంతగా ప్రేమ పెంచుకున్నా. ‘నా జీవితాంతం తోడుంటావా?’ అని ఆమె అడిగాకే నా సొంతమనుకున్నా. నువ్వు తప్ప నాకెవరు లేరు అన్న నోటితోనే ‘నువ్వు నాకెమవుతావ్‌?’ అనడం తట్టుకోలేకపోతున్నా. తనపై నా ఇష్టంలో ఎలాంటి కల్తీ లేదు. అది ఇప్పటికైనా తను తెలుసుకుంటుందని ఆశిస్తున్నా.

- అనురాగ్మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని