యాప్‌.. యాప్‌.. హుర్రే..!!
close
Published : 19/03/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాప్‌.. యాప్‌.. హుర్రే..!!

కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో మనమంతా ఇంట్లోనే ఉండిపోయాం కదా! కానీ.. డాక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు మాత్రం పని చేస్తూనే ఉన్నారు. కొవిడ్‌ బాధితులకు వైద్యం అందిస్తూ.. అందరి కంటే ఎక్కువగా డాక్టర్లు ఎంతో ఒత్తిడికి గురయ్యారు. ఇటువంటి సమయంలో వారిని ఉత్సాహపరిచేందుకు ఓ కుర్రాడు యాప్‌ తయారు చేశాడు. అతడి గురించి తెలుసుకుందాం పదండి..!!

బెంగళూరుకు చెందిన ఆయుష్‌కు సాంకేతికతపై పట్టు ఉంది. లాక్‌డౌన్‌తో విద్యాలయాలు మూతపడటంతో ఇంట్లోనే ఉండిపోయాడు. ఆ సమయంలో ప్రమాదకర పరిస్థితుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది పని చేస్తున్న విషయాన్ని గమనించాడు. తన ఖాళీ సమయాన్ని వారి కోసం ఉపయోగించాలని అనుకున్నాడు.
సరదా అంశాలు, పోటీలతో..
ప్రాణాలకు తెగించి మరీ కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తూ కష్టపడుతున్న వాళ్ల కోసం ‘ఆశ్వాస్‌’ అనే యాప్‌ను తయారు చేశాడు ఆయుష్‌. దాదాపు 80 నగరాలకు చెందిన 3600 మంది వైద్యులు, వారి కుటుంబ సభ్యులను ఆ యాప్‌ వేదిక మీదకు తీసుకొచ్చాడు. అంత్యాక్షరి, క్విజ్‌, స్కావెంజర్‌ హంట్‌, సంగీతం తదితర పోటీలను నిర్వహించడం మొదలుపెట్టాడు. తర్వాత మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులనూ ఇందులో భాగస్వాములను చేశాడు. దాదాపు 19 మెడికల్‌ కళాశాలలకు చెందిన ప్రతినిధులు యాప్‌ వేదికగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. కొత్తగా స్టాండప్‌ కామెడీని సైతం అందుబాటులోకి తీసుకొచ్చాడు.
విరాళాలు సేకరించి మరీ..
కొవిడ్‌ సమయంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విరాళాల రూపంలో సేకరించిన రూ.6 లక్షలతో పాటు 2400 పీపీఈ కిట్లను ఆయుష్‌ వైద్య సిబ్బందికి అందజేశాడు. ఇప్పుడు మహారాష్ట్రలో కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడక్కడ లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. అంటే, డాక్టర్లు మళ్లీ ప్రత్యేక విధులు చేపట్టాల్సి ఉంది. దాంతో వారి కోసం యాప్‌లో మరికొన్ని కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టే ఆలోచనలో ఆయుష్‌ ఉన్నాడు. ఇప్పుడు తనకు పరీక్షలు కూడా ఉండటంతో వాలంటీర్ల సాయం కోరుతున్నాడట.
పోషకాహార లోపం తెలుసుకునేందుకు..
చిన్నారుల్లో పోషకాహార లోపం తెలుసుకునేందుకు గతేడాది ఆయుష్‌ ఓ యాప్‌ తీసుకొచ్చాడు. దాని సహాయంతో పిల్లలు తమ వయసుకు తగిన ఎత్తు, బరువుతో పాటు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. అందరికీ అర్థమయ్యేలా యాప్‌లో ఇంగ్లిష్‌ మాత్రమే కాకుండా ఇతర భాషలనూ అందుబాటులోకి తీసుకొచ్చాడు. తన యాప్‌ సహాయంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తల పని సులువవుతుందని పదిహేడేళ్ల ఆయుష్‌ చెబుతున్నాడు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని