35 గ్రామాల మహిళలకు ఉపాధి 
close
Updated : 24/03/2021 01:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

35 గ్రామాల మహిళలకు ఉపాధి 

పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆమె సంప్రదాయ హ్యాండ్‌లూమ్‌లో వినియోగించి పలురకాల ఉత్పత్తులను తయారుచేస్తోంది. ఈ వినూత్న ప్రయోగంలో విజయం సాధించడమే కాకుండా 35 గ్రామాల మహిళలకు శిక్షణను అందించి, దీని ద్వారా ఉపాధినీ కల్పిస్తోంది. ‘ప్లాస్టిక్‌తో  నేయడం ఎలా వీలవుతుంది’ అనే ప్రశ్న ఆమెను చాలామంది వేశారు. దానికి సమాధానంగా ప్లాస్టిక్‌తో హ్యాండ్‌బ్యాగులు, డోర్‌మ్యాట్లు వంటివాటిని తయారుచేసి ప్రదర్శించి మరీ ప్రశంసలు అందుకుంటోంది.
అసోంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన కజిరంగాకు చెందిన 47 ఏళ్ల రూప్‌జ్యోతి స్థానికంగా పేరుకుపోయే ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఎక్కువగా చూసేది. అక్కడికొచ్చేవారంతా ప్లాస్టిక్‌ సీసాలు, సంచులు, ఆహార కాగితాల వంటివన్నీ ఎక్కడపడితే అక్కడ పడేసేవారు. ఆమె ఇంటి పరిసరప్రాంతాలు కూడా చెత్తతో నిండిపోయేవి. పర్యావరణానికి హాని కలిగిస్తున్న వాటిని చూసినప్పుడల్లా ఏదైనా ఉపయోగపడేలా చేయాలని ఆలోచించేదామె.

‘విలేజ్‌ వీవ్స్‌’ పేరుతో...
వెదురుతో గృహోపలంకరణలు తయారుచేసే అలవాటున్న రూప్‌జ్యోతికి ప్లాస్టిక్‌ను వినియోగించి వినూత్నంగా ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనే ఆలోచన వచ్చింది. దాంతో ముందుగా ప్లాస్టిక్‌ను నూలుగా మార్చడం మొదలుపెట్టింది. ఇందుకోసం ప్లాస్టిక్‌ రేపర్స్‌, కవర్లను సేకరించి వాటిని శుభ్రపరిచి ఆరబెట్టింది. ఆ తర్వాత వాటిని సన్నని నూలుగా కత్తిరించి వాటన్నింటినీ పొడవైన దారపు కండెలా చేసింది. దీనికి నూలును జతచేసి రెండింటినీ సమానంగా వినియోగిస్తూ నేయడం మొదలుపెట్టింది. అలా ప్లాస్టిక్‌, నూలును కలిపి నేసినదాంతో హ్యాండ్‌బ్యాగు, డోర్‌మ్యాట్‌లను రూపొందించింది. ప్లాస్టిక్‌, నూలును ఎంచుకునేటప్పుడే పలువర్ణాల కలయికగా వచ్చేలా చేయడంతో రంగురంగుల ఆకర్షణీయమైన మ్యాట్‌ తయారైంది. తన ప్రయోగం విజయవంతం కావడంతో దీని తయారీలో మరికొందరు మహిళలకు శిక్షణ ఇవ్వాలనుకుంది. 2004లో ‘విలేజ్‌ వీవ్స్‌’ పేరుతో ఓ సంస్థను స్థాపించింది. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి తన ఆలోచన, ప్రయోగం గురించి చెప్పేది. తాను తయారుచేసిన ఉత్పత్తులనూ వారికి చూపించేది. అసోంలో దాదాపు మహిళలందరికీ చేనేత పని తెలిసే ఉంటుంది. దీంతో ఇందులో శిక్షణ తీసుకోవడానికి వారంతా ఆసక్తి చూపించేవారు. అలా వారందరికీ నేర్పించి ఉపాధి మార్గంగా మలిచింది. ఇలా ఇప్పటివరకు 35 గ్రామాల్లో దాదాపు రెండువేల మందికి పైగా మహిళలు ఈ ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. వాటిని ఆన్‌లైన్‌సహా పర్యటకులకు విక్రయిస్తున్నారు. అంతేకాదు, పలు ప్రదర్శనల్లో ఉంచి వీటి వెనుక ఉన్న ప్రయోజనం గురించి అందరికీ చెబుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని నిరోధిస్తూ, మరోవైపు వేలమంది మహిళలను వారికాళ్లపై వారు నిలవడానికి చేయూతగా ఉన్న జ్యోతి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలనూ అందుకుంటోంది. అలాగే ఈ ఉత్పత్తుల తయారీ వల్ల కలిగే ప్రయోజనాలను విదేశీయులకు సైతం ఈమె అవగాహన కల్పిస్తోంది. ఈ దిశగా 2012లో ‘కజిరంగ హట్‌’ను ప్రారంభించింది. ఇక్కడికొచ్చినవారందరికీ ఈ నేత విధానాన్ని ప్రదర్శించి, గ్రామమహిళలు రూపొందిస్తున్న ఉత్పత్తులను విక్రయించడానికి చేయూతనూ అందిస్తున్నా అంటోందామె. ‘పర్యటకులందరికీ ఈ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరిస్తా. దీనివెనుక ఉన్న మహిళల గురించి చెబుతా. గతంలో నేతపని చేస్తూ నాలుగు వేల రూపాయలు సంపాదించుకునే మహిళలు ఇప్పుడు సీజన్‌బట్టి ప్రతి ఒక్కరూ నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఆర్జిస్తున్నారు.  ఈ చేనేతవిధానం వల్ల చుట్టుపక్కల ప్లాస్టిక్‌ పేరుకుపోవడం తగ్గింది. అలాగే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా నిలబడ్డాయి. దీన్ని మరింత విస్త్రతమయ్యేలా కృషి చేస్తున్నా’ అని చెబుతోంది రూప్‌జ్యోతి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని