మీకు మీరే.. మాకు మేమే..!
close
Published : 14/04/2021 00:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మీకు మీరే.. మాకు మేమే..!

ప్రపంచం మొత్తాన్ని కరోనా చుట్టేస్తోంది. క్వారంటైన్‌, ఐసోలేషన్‌ అనే పదాలు మన జీవితంలో భాగమైపోయాయి. కానీ ఓ గ్రామానికి చెందిన వారు మాత్రం ఎన్నో ఏళ్లుగా ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీళ్లు బయటి వాళ్లను ఎవ్వరినీ తమ దగ్గరకు రానివ్వరు. వీరెవ్వరూ వారి దగ్గరకు వెళ్లరు. ప్రపంచంతో పనే లేదు. వీళ్ల ఊరే వీరికి ప్రపంచం!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలో పార్వతీవ్యాలీలో ఉందీ మలన గ్రామం. ఇది సముద్రమట్టానికి 8,701 అడుగుల ఎత్తులో చుట్టూ కొండల మధ్యలో ఉంది. ఇక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తారు. వీళ్ల గ్రామ దేవత పేరు ‘జంబ్లూ’. ఇరుగుపొరుగు గ్రామాల వారితో పెళ్లి సంబంధాలు కలుపుకోరు. అంతెందుకు వాళ్ల ఊరు కాకుండా పక్క ఊరి వంటలను కూడా వీళ్లు ముట్టుకోరు. బయటి వ్యక్తులను తమ ఊరికి రానివ్వరు. వీళ్లు కూడా బయటి ఊళ్లకు వెళ్లరు. తమ జాతి కలుషితం కాకుండా ఉండటం కోసమే ఇదంతా అని చెబుతుంటారు.
విచిత్ర పేర్లు
వీళ్లు ప్రభుత్వంతో సంబంధం లేకుండా జీవిస్తారు. తమకు నచ్చినట్టుగా కట్టుబాట్లు, నియమాలు పెట్టుకుని వాటినే అనుసరిస్తారు. ఒక్క ప్రభుత్వ పాఠశాలను మాత్రమే వీళ్లు తమ ఊళ్లో అనుమతించారు. ఇక ఏవిధమైన సర్కారు జోక్యాన్నీ అస్సలు సహించరు. ఇక్కడి ప్రజలు కనషీ అనే భాష మాట్లాడతారు. ఈ ఊళ్లోని వాళ్లకు తప్ప ఇక ఎవరికీ ఇది అర్థం కాదు. ఇందులో  సంస్కృత పదాలే ఎక్కువ. టిబెట్‌ భాష ప్రభావం కూడా కనిపిస్తుంది. తమ పిల్లలకు కూడా విభిన్నమైన పేర్లు పెడతారు. ఆదివారం పుడితే అహ్త, సోమవారం జన్మిస్తే సౌనరు, మంగళవారం అయితే మంగల్‌ ఇలా.. వాళ్లు పుట్టిన వారాన్ని బట్టి వాళ్లకు పేర్లుంటాయన్నమాట. అందుకే మలన గ్రామంలో ఒకే పేరున్న వ్యక్తులు చాలా మందే ఉంటారు.

ప్రకృతి అంటే ప్రాణం
వీళ్లు ప్రకృతి ఆరాధకులు. చెట్లను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటారు. పచ్చని చెట్లను నరికితే ఇక్కడ నేరం. ఈ గ్రామంలో గంజాయి ఎక్కువగా పండిస్తారు. ఈ ఆకులతో ‘మలన క్రీం’ తయారు చేస్తారు. దీనికి కూడా మంచి గిరాకీ ఉంది. మొత్తానికి ఇక్కడివారు ‘మీకు మీరే.. మాకు మేమే’ అన్నట్లు బతికేస్తారు. పర్యాటకులు సందర్శించడానికి మాత్రం వీళ్లు షరతులతో కూడిన అనుమతులు ఇస్తారు. ఇవండీ మలన సంగతులు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని