కరోనాకూ వెరవని దుర్గలు!
close
Published : 25/04/2021 02:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాకూ వెరవని దుర్గలు!

ప్రపంచవ్యాప్తంగా ఎటుచూసినా కరోనా రెండో విజృంభణ. వేల మందిని పొట్టనపెట్టుకుంటున్న ఈ వైరస్‌ నుంచి ప్రజలను కాపాడే బాధ్యతల్లో కొందరు మహిళలు అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు. సేవకు, ధైర్యానికి ప్రతిరూపాలుగా నిలుస్తున్నారు. దేశమంతా జేజేలు పలుకుతున్న వారి స్ఫూర్తి గాథలను మనమూ చూద్దాం...

ఇప్పుడే కదా చేయాల్సింది
- డాక్టర్‌ ప్రగ్యా ఘడే...

నడి వేసవి. జాతీయ రహదారిలో స్కూటీ మీద వేగంగా వెళ్తోంది ఓ మహిళ. సమయానికి ఓ చోటుకు చేరుకోవాలనేది ఆమె తాపత్రయం. తను వెళ్తోంది విహారయాత్రకో, పుట్టింటికో కాదు. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలనే లక్ష్యం ఆమెను అంత దూరం స్కూటీ మీద ప్రయాణించేలా చేసింది. ఆమె పేరే... డాక్టర్‌ ప్రగ్యా ఘడే. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నాగ్‌పుర్‌లోని కొవిడ్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తోందీవిడ. గత వారం స్వగ్రామం బాలాఘట్‌కు వచ్చింది. కానీ ఆ తర్వాత పెరుగుతున్న కొవిడ్‌ బాధితుల సంఖ్యను చూసి తిరిగి విధుల్లో చేరాలనుకుంది. పరిస్థితులు విషమిస్తున్నాయని తెలిసి క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే స్కూటీ మీదే ప్రయాణం మొదలుపెట్టింది. రిస్క్‌ అని అందరూ వారించినా తగ్గలేదు. ఏడు గంటలు ఏకధాటిగా ప్రయాణించింది. మధ్యలో ఆహారం కోసం కూడా ఆగలేదు. మండుతున్న ఎండనూ లెక్క చేయకుండా కొవిడ్‌ సెంటర్‌కు చేరుకున్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ‘మా కేంద్రంలో రోగులు పెరుగుతున్నారని తెలియగానే నా మనసాగలేదు. లాక్‌డౌన్‌ వల్ల రవాణా సౌకర్యాలు  లేవు. నా స్కూటీ గుర్తొచ్చింది. అమ్మానాన్న ఒప్పుకోలేదు. ఈ సమయంలోనే ప్రజలకు నా అవసరం ఉందని వాళ్లకు నచ్చచెప్పాను. ఇక్కడికి వచ్చాక ఉదయం ఆరుగంటలు నాగ్‌పుర్‌లోని ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్నా. తర్వాత మరో ఆరు గంటలు మరి కొన్ని ఆసుపత్రులకు వెళుతున్నా. 12, 13 గంటలపాటు పీపీఈ కిట్‌ ధరించే ఉంటా. అయినా కష్టంగా లేదు. ఇది నాకు చాలా సంతృప్తినిస్తోంది’ అంటోంది డాక్టర్‌ ప్రగ్యా.


అంతిమ ఆత్మీయురాల్ని
- అన్నేమోరిస్‌

కరోనా సోకి చనిపోతున్న వారికి అంత్యక్రియలు క్లిష్టంగా మారాయన్నది తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మృతులకు గౌరవప్రదమైన వీడ్కోలు చెబుతోంది కర్నాటకకు చెందిన 43 ఏళ్ల అన్నేమోరిస్‌. హోసూరు రోడ్‌లోని క్రిస్టియన్‌ శ్మశానవాటికలో రోజంతా స్వచ్ఛంద సేవలు అందిస్తోందీమె. జంతు ప్రేమికురాలైన అన్నేమోరిస్‌ వీధి శునకాలకు ఆశ్రయమిచ్చి, సంరక్షిస్తుంది. కరోనా వల్ల శ్మశానాల్లో పెరిగిన రద్దీని గుర్తించింది. రెండు నెలల నుంచి ఇక్కడ మృతుల బంధువులకు చేయూతనందిస్తోంది. మృతదేహాలను శ్మశానం వరకు అంబులెన్స్‌లో తీసుకొచ్చినా, లోనికి తేవడానికి ఎవరూ లేని పరిస్థితి అని బాధపడుతుంది. ‘భౌతిక కాయాల్ని మోయడానికీ నాకేమీ ఇబ్బంది లేదు. మృతుల బంధువులకు పేపర్‌వర్క్‌ చేసిపెట్టడం, ఖననానికి స్థలాన్ని చూపడం చేస్తుంటా. ఇంతకు ముందు ఎవరైనా మరణిస్తే, బంధువులందరూ వచ్చేవారు. ఇప్పుడు చాలా నిబంధనలు వచ్చాయి. చివరి ప్రయాణంలో అనాథలా మట్టిలో కలిసిపోకుండా వారికి ఆత్మీయురాలిగా నిలవడం నా బాధ్యత అనుకుంటున్నా. ఖననం పూర్తయ్యి, సమాధిపై పూలు జల్లి, వారి పేరుతో ఉన్న బోర్డును ఉంచే వరకూ చూసుకుంటా. ఉదయం ఏడుగంటలకు వస్తా. చీకటి పడే వరకూ మృతదేహాలను తీసుకొస్తూనే ఉంటారు. మొత్తం పని అయ్యాకే ఇంటికి వెళ్తా. రోజుకి పదికి పైగానే అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఒక్కోరోజు ఇంకా ఎక్కువేే ఉంటాయి. గతేడాది నాకు కరోనా వచ్చింది. ఈ ఏడాది రెండోసారి  దాని బారిన పడ్డా. అయినా ఈ సేవ ఆపను’ అంటోంది అన్నేమోరిస్‌.


కాపాడే బాధ్యత మాది
- డీఎస్పీ శిల్పాసాహూ...

నడినెత్తిన ఎండ, చుట్టూ కాలుష్యం, మరో పక్క కరోనా. పైగా తను అయిదునెలల గర్భిణి. ఇవేవీ తనను ఆపలేకపోయాయి. నడిరోడ్డులో ఉదయం నుంచి సాయంత్రవరకు నిల్చొని డీఎస్పీగా విధులను నిర్వర్తిస్తోంది. అందరూ తమ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ప్రజల్లో అవగాహనెలా వస్తుంది, వైరస్‌ను మనమెలా జయించగలం అనే శిల్పా సాహూ చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దంతేవాడ జిల్లా డిప్యూటీ సూపరింటిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌. దంతేవాడ ప్రధాన రహదారుల్లో చేతకర్రపట్టుకుని ఈమె నిలబడి ఉంటే ప్రయాణికులందరూ అప్రమత్తం అవ్వాల్సిందే. ఇళ్లకు వెళ్లండి, మాస్కులు పెట్టుకోండి... కొవిడ్‌ నియమాలు పాటించండి అంటూ ఖంగుమనే ఆమె స్వరానికి అందరూ బద్ధులుగా ఉండాల్సిందే. ‘మేం విధులు నిర్వర్తిస్తేనే  ప్రజలంతా క్షేమంగా ఉంటారు. పోలీస్‌గా ప్రజారక్షణే మా ధ్యేయమని ప్రమాణం చేస్తాం. మా ప్రాణాలను పణంగా పెట్టి అయినా ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మాది. నేను గర్భవతినని ఇంట్లో కూర్చుంటే బాధ్యతలను విస్మరించినట్లే. అందరికీ జీవితం విలువైందే. ఎవరికి వారే వ్యక్తిగత బాధ్యతను  నిర్వర్తించాలి. అప్పుడే ఈ వైరస్‌ను  జయించగలం. వారం నుంచి ఇక్కడ లాక్‌డౌన్‌. ప్రజల్లో ఎంత త్వరగా అవగాహన వస్తుందో, అంత త్వరగా ఈ ముప్పు నుంచి బయటపడగలం’ అనే శిల్పా విధుల్లో కనబరుస్తున్న  నిబద్ధతకు పై అధికారులు సైతం అభినందిస్తున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమెను ఆదర్శమహిళగా కొనియాడారు. గతంలో ఈమె దంతేశ్వరి ఫైటర్స్‌ పేరుతో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన మహిళా కమాండోల బృందానికి నేతృత్వం వహించారు.


సేవలోనే భగవంతుడు
- సిస్టర్‌ నైసీ ఐజెన్‌

అదో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌. రోజూ కనీసం వంద మందికి పైగా వైద్యపరీక్షలు జరుగుతుంటాయి. అక్కడికి వచ్చినవారి నుంచి చాలా ఓపిగ్గా నమూనాలను సేకరిస్తోంది ఓ నర్సు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలందిస్తున్న ఆమె గురించి ప్రస్తుతం సోషల్‌మీడియా కొనియాడుతోంది. ఆమే... 29 ఏళ్ల సిస్టర్‌ నైసీ ఐజెన్‌. వాళ్లది గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని అల్తాన్‌ ప్రాంతం. ముస్లిం కుటుంబానికి చెందిన నైజీ ఇప్పుడు నాలుగోనెల గర్భిణి. కరోనా వైరస్‌ తన కడుపులోని బిడ్డపై ప్రభావం చూపిస్తుందేమో అనే భయం లేదు తనకు. కొవిడ్‌ బాధితులకు తన వంతు సాయం అందించడానికి వెనుకడుగు వేయడం లేదు. ‘ప్రస్తుతం నేను విధులు నిర్వర్తిస్తున్న అటల్‌ సంవేదనా కొవిడ్‌ సెంటర్‌లో నెల నుంచి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ సమయంలో నా గర్భంలోని శిశువు గురించి ఆలోచిస్తూనే, రోగులకు సేవలందించడం కూడా నా బాధ్యతగా భావిస్తున్నా. అంతేకాదు, ఈ పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షనూ  చేస్తున్నా. కష్టంలో ఉన్నవారికి సేవలందించడం భగవదారాధనతో సమానం. ఆ నియమాన్నే పాటిస్తున్నా. ‘గర్భంతో ఉన్నావు, రోజంతా పీపీఈ కిట్స్‌ ధరించి పని చేస్తున్నావు, ఓవైపు ఉపవాసం ఉంటూ, ఈ విధులెలా చేపట్టగలుగుతున్నావు’ అని చాలా మంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ సేవలోనే దేవుడిని చూస్తున్నా. రంజాన్‌ పండగ రోజుల్లో ఇలా ఇతరుల కోసం పనిచేసే అదృష్టం నాకు దక్కింది అనుకుంటున్నా. అలాగే నా బిడ్డ క్షేమాన్ని కూడా చూసుకుంటున్నా. గతేడాదీ ఇదే కేంద్రంలో కొవిడ్‌ బాధితులకు సేవలందించా. కుటుంబ సభ్యులు కూడా నా సేవకు అండగా నిలవడం బలాన్నిస్తోందని’ సంతోషిస్తోంది నైసీ.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని