తొమ్మిదూళ్లకు వెలుగులు ఈ అమ్మాయి కలలు!
close
Published : 01/05/2021 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొమ్మిదూళ్లకు వెలుగులు ఈ అమ్మాయి కలలు!

కుర్మాఘర్‌... నెలసరి వేళ ప్రత్యేకంగా ఆశ్రయం ఇచ్చే ఇల్లు! స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వీటిని ఆధునికీకరించి అందుబాటులోకి తీసుకొచ్చింది 19 ఏళ్ల భాగ్యశ్రీ. అదొక్కటే కాదు.. దట్టమైన అడవులు మధ్య, బయట ప్రపంచానికి తెలియని తమ గ్రామాలకు ఎన్నో సదుపాయాలని వరంగా అందించి ‘మా మంచి సర్పంచ్‌’ అనిపించుకుంటోంది...
మూడేళ్ల క్రితం చత్తీస్‌గఢ్‌లోని గడ్చిరోలీ జిల్లాలో సర్పంచి ఎన్నికలు జరపాలని నిర్ణయించినప్పుడు... అది నక్సల్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో ఒక్కరూ ముందుకు రాలేదు. కానీ.. వాళ్లంతా 19 ఏళ్ల భాగ్యశ్రీని కలిశారు. కారణం ఆ గ్రామంలో అందరికీ తల్లోనాలుకలా ఉంటుందా అమ్మాయి. ‘ఆమె సర్పంచిగా వస్తే గ్రామానికి మేలు జరుగుతుందని ఊరుమ్మడి నిర్ణయం తీసుకున్నారు. భాగ్యశ్రీ కూడా ఆ గ్రామ ప్రజల నమ్మకాన్ని వమ్ముకానివ్వలేదు. స్థానిక మహిళలెదుర్కొంటున్న సమస్యలతోపాటు, అక్కడి ప్రజల అవసరాలను పరిష్కరించడానికి ఇదే సరైన మార్గం అనుకుంది. అలా రెండేళ్లక్రితం గడ్చిరోలీ జిల్లా కోటి గ్రామ పంచాయతీకి సర్పంచిగా ఎంపికైంది. ఆ రాష్ట్రంలో 19 ఏళ్ల వయసులో సర్పంచి పదవిని చేపట్టిన తొలి మహిళగానూ నిలిచింది.

బాల్యం నుంచే...
భాగ్యశ్రీ తండ్రి జిల్లాపరిషత్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఆమెకు ఇద్దరు తోబుట్టువులు. ఊహ తెలిసినప్పట్నుంచీ గ్రామ సమస్యలకు ఓ దారి చూపించాలని తాపత్రయపడేది. తోటి పిల్లలకు పాఠాలు చెప్పేది. పెద్దయ్యాక గ్రామానికి ఏదో చేయాలని కలలు కనేది. కాలేజీకొచ్చాక దాచుకున్న నగదుతో శానిటరీ ప్యాడ్స్‌ను కొనిగ్రామంలో యువతులకు పంచిపెట్టేది. మహిళలు చదువుతోపాటు శారీరక సామర్థ్యం, ఆరోగ్యం వంటి అంశాలకూ ప్రాధాన్యత ఇవ్వాలని భావించే భాగ్యశ్రీ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో డిగ్రీ చేసింది. క్రీడలపట్ల ఆసక్తితో ఫుట్‌బాల్‌ క్రీడలో శిక్షణ తీసుకుంది. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే సమయానికి గ్రామ సర్పంచిగా బాధ్యతలు తీసుకుంది. అలా ఆమె దృష్టికి వచ్చిన మొదటి సమస్య కుర్మాఘర్‌లు. ‘నెలసరి సమయంలో ఇంట్లో ఉంటే ఆ కుటుంబానికి కీడు జరుగుతుందనేది ఇక్కడ మహిళల నమ్మకం. దాంతో నెలసరి వచ్చిన వెంటనే మహిళలు గ్రామశివారులో ఉండే ‘కుర్మాఘర్‌’లకు చేరుకుంటారు. అయిదు రోజులపాటు వాళ్లు అక్కడే ఉంటారు. మా గ్రామానికి ఇలాంటివి మూడు ఇళ్లున్నాయి. అయితే అవి సరైన నిర్మాణం లేక పాతబడ్డాయి. దాంతో అక్కడికి పాములు, క్రిమికీటకాలు ప్రవేశించేవి. ఒక్కసారిగా అక్కడకు వెళ్లొద్దు అంటే వాళ్లు వినరు. ముందుగా నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రత గురించి ఇంటింటికీ తిరిగి చెప్పేదాన్ని. ఆ తర్వాత మరిన్ని కుర్మాఘర్‌లను నిర్మించాం. ఇక్కడ భద్రతతోపాటు అన్ని సౌకర్యాలూ ఉంటాయి. అయిదురోజులూ నిర్భయంగా ఉండొచ్చు. ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో వైద్య సదుపాయాలు తక్కువ. అందుకే నెలసరిలో శుభ్రత పాటించకపోతే వచ్చే అనారోగ్యాలు, రొమ్ము క్యాన్సర్‌ వంటివాటి గురించి వీడియోల ద్వారా అవగాహన కలిగిస్తున్నా. ఒకవేళ అనారోగ్య సంకేతాలుంటే నన్ను సంప్రదించమని చెబుతున్నా. వారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి చికిత్స అందేలా చేస్తున్నా. గతంలో తాగునీటి కోసం చాలాదూరం నుంచి నదీజలాలను బిందెల్లో మోసుకొచ్చేవారు. ఇప్పుడు వారికి ఆ కష్టం లేకుండా బావులు తవ్వించా. ప్రభుత్వం అందించే నిధుల్లో కొంతశాతాన్ని శానిటరీ న్యాప్‌కిన్లకు వినియోగించి ఉచితంగా అందిస్తున్నా. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, అలాగే సమాజం బాగుంటుందని నమ్ముతాను. నా పరిధిలోని తొమ్మిది గ్రామాలకూ రోజూ బైకు మీద తిరుగుతా. వారంవారం సభ ఏర్పాటు చేసి వారి సమస్యలను చర్చిస్తా. తాగునీరు, విద్యుత్తు, వైద్య సౌకర్యంతోపాటు అందరికీ విద్య అందేలా చేస్తున్నా’ అని చెబుతోంది భాగ్యశ్రీ.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని