వైద్యుల పాలిట అన్నపూర్ణ
close
Published : 01/06/2021 00:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్యుల పాలిట అన్నపూర్ణ

కరోనా వార్డుల్లో చికిత్స అందిస్తోన్న వైద్యులు, ఇతర సిబ్బంది సేవకు వెలకట్టలేం. కర్ఫ్యూలు, లాక్‌డౌన్ల వల్ల వాళ్లు సరిగా తినలేకపోతున్నారని తానే వండి పంపుతోంది ఆకాంక్ష...

కాంక్ష సడేకర్‌.. ఉత్సాహానికి మారు పేరు. ఆమె కుటుంబం స్కాట్‌లాండ్‌లో స్థిరపడింది. అక్కడే చమురు, పెట్రోలు సంస్థలో పనిచేస్తోంది. కొంత మార్పు కావాలనుకుని గత ఏడాది నవంబరులో స్వస్థలం పుణె వచ్చింది. ఒకరోజు ఆమె ట్విటర్‌ ఖాతా తిరగేస్తోంటే ‘డ్యూటీ నుంచి అలసిపోయి ఇంటికొస్తే తినడానికేమీ లేదు.. అమ్మవాళ్లేమో దూరంగా ఊళ్లో ఉన్నారు. ఇవాళ్టికి ఇన్‌స్టంట్‌ నూడుల్సే’ అంటూ ఒక డాక్టర్‌ ట్వీట్‌ కనిపించింది. ఆ క్షణమే ‘ప్రజారోగ్యం కోసం కరోనాతో పోరాడుతున్న వైద్యులు తిండి లేక బాధపడటమేంటి? వాళ్లకి ఇంటి ఆహారం అందించాలి’ అనుకుంది. ఏప్రిల్‌ 5న ‘పుణెలో డాక్టర్లు, మెడికల్‌ విద్యార్థులు, ఇతర ఆరోగ్య సంరక్షకులకు ఇంటి భోజనం వండి పంపుతా’నంటూ ట్వీట్‌ చేసింది. ఇక అభ్యర్థనల వెల్లువ మొదలైంది. రెండు వారాలయ్యే సరికి వెయ్యిమందికి టిఫిన్లు పంపగలిగింది. ఇది వ్యాపారం కాదు, మానవతా దృక్పథం. వేళకు తినలేకపోతున్న, అరకొరా తిండితో సరిపెట్టుకుంటున్న వైద్య సిబ్బందికి పోషకాహారం అందించాలనుకుంది. క్రమంగా అంబులెన్స్‌ డ్రైవర్లు, విద్యార్థులు, పోలీసు అధికారులు మొదలైనవారు మాకు కూడా పంపమంటూ రిక్వెస్టులు పెట్టారు. ఒక పోలీసాఫీసరు ‘రెడ్‌ లైట్‌ ఏరియాలో స్త్రీలు తిండి లేక అల్లాడుతున్నారు’ అని తెలియజేయడంతో సెక్స్‌ వర్కర్లకు కూడా భోజనం పంపాలనుకుంది. ఆకాంక్షకు సేవాభావం ఎంతగా ఉన్నా.. ఒకేసారి ఇంతమందికి భోజనం తయారుచేయడం చాలా కష్టమనిపించింది.

‘తొందరపడి ట్విటర్‌లో ప్రకటించానా?!’ అనుకుంది. అర్థింపులు నానాటికీ పెరుగుతున్నాయి. వాటితోబాటు తాము కూడా సాయం చేస్తామంటూ ఎందరో ముందుకొచ్చారు. మొదట స్నేహితుల దగ్గరి నుంచి మాత్రమే విరాళాలు తీసుకోవాలనుకుంది. కానీ వద్దనడానికి అవకాశం ఇవ్వకుండా డబ్బు పంపారెందరో. అలాగే ‘రోగులకు సేవచేసే డాక్టర్లు ఆకలితో ఉండటం అన్యాయం. మేమూ సాయం చేస్తాం’ అంటూ చాలామంది అమ్మాయిలు ఆమెతో కలిశారు. ఇప్పుడు వాళ్లు రోజుకు 80 టిఫిన్‌ డబ్బాలు, 350 లంచ్‌ బాక్సులు తయారు చేస్తున్నారు. వచ్చే విరాళాలను, ఖర్చులనూ పారదర్శకంగా అందరికీ అర్థమయ్యేలా చేయాలనుకుంటోంది ఆకాంక్ష.
కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ టిఫిన్‌ సెంటర్లూ, ఫలహార శాలలూ చాలానే పనిచేస్తున్నాయి. కానీ ఈమె ఉచితంగా చేయడమే గాక తీసుకెళ్లి అందించే ఏర్పాటు చేసింది. లొకేషన్‌ దూరంగా ఉంటే ‘డంజో’ ద్వారా పంపిస్తోంది. ‘భోజనం పంపమంటూ నా ఫోన్‌కు నిరంతరం అభ్యర్థనలు వస్తుంటాయి. వారందరికీ వీలైనంత వేగంగా ఆహారం పంపిస్తుంటాను. కొందరు తెలిపే కృతజ్ఞతలు ఎంతో ఆర్ద్రంగా ఉండి మనసుకు హత్తుకుంటాయి. ఎవరికి వారు తమ ఏరియాలో ఇలాంటి సేవాపరులకు.. కనీసం ఒక్కరికైనా వేళకు ఆహారం అందించగలిగితే బాగుండు’ అంటుంది ఆకాంక్ష.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని