మహాముని చూపిన పరిష్కారం!
close
Updated : 09/07/2021 06:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహాముని చూపిన పరిష్కారం!

పూర్వం రాజశేఖరుడు సింహపురాన్ని పరిపాలించే వాడు. సుఖశాంతులతో ప్రజలు జీవించసాగారు. కానీ రాజ్యానికి వారసులు లేరనే బెంగ రాజును కుంగదీయసాగింది. ఆ సమయంలో జ్ఞానేశ్వరుడనే మహాముని మహత్తు గురించి తెలిసింది. మంత్రి సలహా మేరకు.. రాజదంపతులు మహామునిని దర్శించుకుని తమ ఆవేదనను విన్నవించుకున్నారు. మహాముని వారితో యజ్ఞం చేయించాడు. యజ్ఞప్రసాదంగా రెండు మామిడి పండ్లను ఇచ్చి దీవించాడు.

అదే సంవత్సరం మహారాణి కవలపిల్లలకు జన్మనిచ్చింది. వారికి సూర్యశేఖరుడు, చంద్రశేఖరుడు అని పేర్లు పెట్టారు. పిల్లలిద్దరికీ విద్యార్జన సమయం వచ్చేసరికి రాజశేఖరుడు వారిని జ్ఞానేశ్వర మహాముని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. రాజు కోరిక మేరకు వారికి విద్యాబుద్ధులు, విలువిద్య నేర్పి, కత్తియుద్ధంలోనూ ప్రావీణ్యులను చేసి తిరిగి వారి రాజ్యానికి పంపించాడు మహాముని.

రాజశేఖరుడు కుమారులిద్దరికి రాజ్యార్హత పరీక్షలు నిర్వహించాడు. ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచారు. అప్పుడు మంత్రి సలహా మేరకు రాజశేఖరుడు రాజ్యాన్ని సిరిపురం, హరిపురం అనే రెండుగా విడగొట్టాడు. సిరిపురానికి సూర్యశేఖరుణ్ని, హరిపురానికి చంద్రశేఖరుణ్ని పట్టాభిషిక్తుల్ని చేశాడు.

క్రమేణా.. సూర్యశేఖరుడి పాలనలో సిరిపురంలోని ప్రజలు అశాంతికి గురవుతూ తమలో తాము కక్షలు పెంచుకుంటూ పోట్లాడుకోసాగారు. వారి తగవులు తీర్చడానికి సభాసమయం వెచ్చించాల్సి వచ్చేంది. తీరా చూస్తే వారి గొడవలకు పెద్ద కారణమంటూ ఉండేది కాదు.  మరోపక్క ప్రజలు రోగాల బారిన పడుతుండడం వల్ల మరింత బాధ కలిగేది.

ఇలాంటి సమస్యలు చంద్రశేఖరుడి హరిపురం రాజ్యంలో లేవు. అక్కడ ప్రజలు ఆరోగ్యంగా, స్నేహపూర్వకంగా జీవిస్తున్నారు. ఈ రహస్యమేంటో తెలియక సూర్యశేఖరుడు ఒక రోజు మంత్రిని పిలిపించి తన బాధనంతా చెప్పుకొన్నాడు. మంత్రి బాగా ఆలోచించి మహాముని జ్ఞానేశ్వరుడు దీనికి పరిష్కారం చెప్పగలరని విన్నవించాడు. తాను వెళ్లి మహామునిని తీసుకు వస్తానన్నాడు.

మంత్రి, ఓ వారం రోజుల తర్వాత మహాముని జ్ఞానశేఖరుణ్ని తీసుకుని వచ్చాడు. సూర్యశేఖరుడు రాజమర్యాదలతో సభాస్థలికి ఆహ్వానం పలికాడు. సభ యావత్తు నిలబడి మహామునికి జేజేలు పలికింది. అనంతరం తన మనసులోని బాధను తెలియజేస్తూ.. దానికి పరిష్కార మార్గం సూచించాలని మహామునిని వేడుకున్నాడు.

‘నేను వస్తూ వస్తూ.. హరిపురం పరిసరాలు, చంద్రశేఖర రాజును, కొంతమంది ప్రజలనూ పరామర్శించి వచ్చాను. సిరిపురం పొలిమేరకు చేరుకోగానే.. నాకు సమస్య పూర్తిగా అర్థమైంది’ అన్నాడు జ్ఞానేశ్వరుడు.
కాసేపు ఆగి మళ్లీ.. ‘మనం గుడిలోకి వెళితే అక్కడి వాతావరణం వల్ల మన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. దేవాలయంలోని పరిమళాల ప్రభావంతో మనల్ని మనం మరిచిపోతాం. ఆవేశం అంకురించదు. అలాంటి వాతావరణం వాడ, వాడలా మనం సృష్టించుకుంటే ప్రజల్లో కోపతాపాలు ఉద్భవించవు. సహృదయంతో జీవనం కొనసాగిస్తారు. రోగాలు దరిచేరవు. హరిపురం వీధుల్లో నాకు గుడి వాతావరణమే కనబడింది. వీధుల వెంట చెట్లు, ఏ ఇంటి ముందు చూసినా పరిమళాలు వెదజల్లే పూలమొక్కలే ఉన్నాయి. మురికికాలువలు మచ్చుకైనా కానరాలేదు. అలా చంద్రశేఖరుడు తన రాజ్యాన్ని తీర్చిదిద్దాడు. ప్రజల ఆరోగ్యం, సుఖశాంతులు పర్యావరణ పరిరక్షణ మీదనే ఆధారపడి ఉన్నాయి. సిరిపురం కూడా అలా మారితేనే మీ సమస్య తీరుతుంది’ అని మహాముని వివరించాడు. 

అందరూ నిలబడి ‘మహాముని సూచనలు శిరసావహిస్తాం’ అని ప్రమాణం చేశారు. కొద్దికాలంలోనే ప్రజల సహకారంతో సిరిపురం కూడా హరిపురంలానే మారిపోయింది.

- చెన్నూరి సుదర్శన్‌మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని