Crime News: బ్లేడుతో గొంతు కోసి.. ఆపై ఉరేసుకొని!
close
Updated : 30/07/2021 06:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: బ్లేడుతో గొంతు కోసి.. ఆపై ఉరేసుకొని!

● ప్రియురాలిని హతమార్చి ఆత్మహత్య?

● మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో దారుణం

మాదాపూర్‌, బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: అది అయిదు నక్షత్రాల హోటల్‌.. ఓ ప్రేమ జంట బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అందులో ఓ గదిని ఒక రోజుకు అద్దెకు తీసుకుంది. గురువారం మధ్యాహ్నంతో ఆ గడువు ముగిసింది. ఖాళీ చేసే సమయం అయిందంటూ సిబ్బంది సూచించారు. మరో రోజు ఉంటామంటూ చెప్పి తలుపు వేసుకున్నారు. సాయంత్రమైనా బయటకు రాకపోవడంతో అనుమానమొచ్చి హోటల్‌ సిబ్బంది మారు తాళంతో తలుపు తెరిచారు. అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి కంగుతిని పోలీసులకు సమాచారమిచ్చారు. మాదాపూర్‌ ఠాణా పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది.

వికారాబాద్‌ జిల్లా కోస్గి మండలం హకీంపేట్‌ గ్రామానికి చెందిన గుడిసె రాములు(25), బొంరాస్‌పేట మండలంలోని లగచర్ల గ్రామానికి చెందిన ఈశ్వరయ్యగౌడ్‌, బాలమణి దంపతుల కుమార్తె సంతోషి(25) కలిసి ఒకే పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు. అప్పుడే వారి మధ్య ప్రేమ చిగురించింది. వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. ఇంటర్‌ వరకు చదువుకున్న ఆమె హైదరాబాద్‌లో ఉంటూ ఎస్సై, కానిస్టేబుల్‌ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతుండగా, నగరంలోనే రాములు కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి వచ్చి మాదాపూర్‌లోని లెమన్‌ట్రీ హోటల్‌లో అద్దెకు దిగారు. గురువారం సాయంత్రం అనుమానంతో హోటల్‌ సిబ్బంది గది తలుపులు తెరిచే సరికి సంతోషి.. ఒంటిపై టవల్‌తో బాత్రూంలోని టబ్‌లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉంది. గొంతుపై బ్లేడ్‌తో కోసినట్లు కనిపించింది. రాములు టీ-షర్ట్‌పై రక్తపు మరకలు కనిపించాయి. ముందుగా ఆమెను చంపిన అతను తరవాత ఆమె చున్నీతోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్లు అక్కడి పరిస్థితిని నిర్ధారించారు. తాము ఖాళీ చేయాలని చెప్పిన సమయంలోనే ఇద్దరు గొడవ పడుతూ కనిపించారని హోటల్‌ సిబ్బంది పోలీసులకు వివరించారు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం తర్వాతే జరిగి ఉంటుందనే నిర్ధారణకొచ్చారు. అతనెందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది..? ప్రియురాలిని హత్య చేసి ఆ తర్వాత భయంతోనే బలవన్మరణం చేసుకున్నాడా..? తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలియడంతో వారి స్వస్థలాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని