Covid Vaccine: బుల్లి భూటాన్‌ భారీ విజయం.. కొవిడ్‌ టీకా పంపిణీలో దూకుడు
close
Updated : 03/08/2021 14:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid Vaccine: బుల్లి భూటాన్‌ భారీ విజయం.. కొవిడ్‌ టీకా పంపిణీలో దూకుడు

భారత్‌కు పొరుగున ఉన్న బుల్లి దేశం భూటాన్‌ కొవిడ్‌ టీకా పంపిణీలో దూకుడు ప్రదర్శిస్తోంది. తమ పౌరులకు వేగంగా వ్యాక్సిన్లు అందిస్తూ.. సామూహిక రోగ నిరోధకత సాధన దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా 12-17 ఏళ్ల మధ్య వయసువారికీ టీకా పంపిణీని ప్రారంభించి.. దక్షిణాసియాలో ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భూటాన్‌ రికార్డుల్లోకి ఎక్కింది.  జనాభాలో అత్యధికులకు కొవిడ్‌ టీకాలు వేసిన దేశంగా ఇజ్రాయెల్‌ పేరుతెచ్చుకుంది. భూటాన్‌ కూడా దానికి తీసిపోని విజయం సాధించింది. మొదటి విడతలో భూటాన్‌కు ఉచితంగా టీకాలు అందించిన భారత్‌ ఆపై తన గడ్డపైనే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో టీకాల సరఫరాను నిలిపివేయాల్సి వచ్చింది. అప్పుడు అమెరికా, ఐరోపా దేశాలు, కొవాక్స్‌ కూటమి ద్వారా అందిన టీకాలతో భూటాన్‌ టీకా కార్యక్రమాన్ని కొనసాగించింది. ఇప్పటికే దేశ జనాభాలో 18 ఏళ్లు పైబడినవారిలో 90 శాతం మందికి టీకాలు వేసింది. 12-17 ఏళ్ల వయోవర్గంలోని 80 వేల మందికీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది. వారిలో 32,000 మందికి మొదటి డోసు వేసింది. దక్షిణాసియాలో బాలలకు కొవిడ్‌ టీకాలు వేసిన తొలి దేశంగా ఖ్యాతికెక్కింది. భూటాన్‌లో బాలలకు మోడెర్నా, ఫైజర్‌ టీకాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశం వద్ద 50,000 మోడెర్నా డోసులు మాత్రమే ఉన్నాయి. అయితే తాను ఆర్డరు పెట్టిన రెండు లక్షల ఫైజర్‌ డోసులు మరికొన్ని నెలల్లో చేతికి అందనున్నాయి. 8 లక్షల జనాభా గల భూటాన్, పిల్లలు, పెద్దలను కలిపి మొత్తం 80 శాతం మందికి టీకాలు వేసి సామూహిక రోగ నిరోధకత సాధించాలని లక్షిస్తోంది. అది త్వరలో నెరవేరనుంది కూడా. భూటాన్‌కు కొవిడ్‌ టీకాల ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా, భారత్‌ తదితర దేశాలు విరాళంగా ఇచ్చిన టీకాలతో విజయవంతంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేస్తోంది.

ఉత్సాహంగా ముందుకొస్తున్న ప్రజలు

అమెరికాతో పాటు అనేక సంపన్న దేశాల్లో కొవిడ్‌ టీకాలు వేయించుకోవడానికి చాలామంది మొరాయిస్తుంటే, భూటాన్‌ ప్రజలు మాత్రం ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. భూటాన్‌ ప్రభుత్వ యంత్రాంగం ప్రతి అంచెలో జనాన్ని చైతన్యపరచడం దీనికి తోడ్పడింది. ప్రస్తుతం భూటాన్‌ వద్ద మూడు లక్షల కొవిషీల్డ్‌ డోసులు ఉన్నాయి. వాటిని తమకు ఇవ్వాలని పొరుగు దేశం నేపాల్‌ కోరుతోంది. తాము ఆర్డరు పెట్టిన టీకాలు చేతికి అందగానే టీకా బాకీ తీర్చేస్తామంటోంది. దిల్లీలోని భూటాన్, నేపాల్‌ రాయబార కార్యాలయాల మధ్య ఈ విషయమై సంప్రదింపులు జరుగుతున్నాయి. నేపాల్‌ జనాభా దాదాపు 3 కోట్లు. అందులో 6 శాతానికి మాత్రమే ఇప్పటివరకు రెండు డోసులు వేశారు. మొదట్లో భారత్‌ అందించిన కొవిషీల్డ్‌ టీకాలతో నేపాల్‌లో 65 ఏళ్లు పైబడిన 14 లక్షల మందికి మొదటి డోసు వేశారు. ఏప్రిల్‌ నుంచి భారత్‌ టీకాల ఎగుమతిని నిషేధించడంతో వారంతా రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. భూటాన్‌ కూడా మొదట్లో కొవిషీల్డ్‌పై ఆధారపడినా తర్వాత మిశ్రమ టీకాలు అందించింది. మొదటి డోసుగా కొవిషీల్డ్‌ ఇచ్చి, మోడెర్నా టీకాలను వాడింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని