చిక్కులు తీరేలా చిన్నారి ఉపాయం!
close
Updated : 27/08/2021 06:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిక్కులు తీరేలా చిన్నారి ఉపాయం!

చదివేది ఎనిమిదో తరగతి. కానీ ఆలోచనలో మాత్రం అదుర్స్‌! ఇంత చిన్న వయసులోనే ‘ఒత్తిడిని జయించడం’పై చిన్నస్థాయి పరిశోధనే చేసింది. ఓ ‘యాప్‌’నకు ఆలోచన ఇచ్చింది. అది ఏకంగా హెచ్‌సీఎల్‌కే నచ్చింది. ఈ చిన్నారికి చక్కని బహుమతిని తెచ్చింది. ఇంతకీ ఎవరా బుడత..? ఏంటా ఆలోచన? తెలుసుకుందామా!

ప్రతి పదిమందిలో ఒకరు ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతుంటారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో బాధితుల సంఖ్య మరింత పెరిగింది. ఆందోళన, ఒత్తిడే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడిదంతా ఎందుకంటే హెచ్‌సీఎల్‌ జిగ్‌సా ఆధ్వర్యంలో జరిగిన పోటీలో చెన్నైకు చెందిన ఎన్‌.నిఖిత పాల్గొంది. ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఉపయోగపడేలా ఓ యాప్‌ ఎలా రూపొందించాలో చెప్పింది. ఎంచక్కా బహుమతి గెలుచుకుంది.

మూడంచెల్లో..  

ఒత్తిడి, ఆందోళనను జయించడం కోసం ఈ చిన్నారి మూడంచెల విధానం ఎంచుకుంది. మొదటిది మనం ఆ యాప్‌ను ఓపెన్‌ చేయగానే అది మన ఫొటో తీసుకుంటుంది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) సాయంతో అది దాన్ని విశ్లేషిస్తుంది. మన మొహంలో వచ్చిన మార్పులు. విచారం, ఆనందం, విస్మయం ఇలాంటివాటిని పసిగడుతుంది. ఏమైనా తేడా ఉంటే మనల్ని హెచ్చరిస్తుంది. మనం మరీ ప్రమాదకర స్థితిలో ఉంటే నిపుణుల సాయం తీసుకోమని అప్రమత్తం చేస్తుంది.

పక్కా ప్రణాళికతో..

ఇక రెండో అంచెలో ఈ యాప్‌ మనకోసం ప్రణాళికను ఇస్తుంది. దాన్ని మనం అనుసరిస్తే సరిపోతుంది. సగం ఒత్తిడి హుష్‌కాకి అవుతుంది. మనం రాబోయే వారం రోజుల్లో చేయాల్సిన పనులు ఇందులో అప్‌లోడ్‌ చేస్తే చాలు. అది మనల్ని అవసరమున్నప్పుడు అప్రమత్తం చేస్తుంటుంది. దీని వల్ల పనుల విషయంలో అనవసర ఒత్తిడి ఉండదు.  

అప్రమత్తం చేస్తుంది..

మూడో అంచె ఏంటంటే.. ఆన్‌లైన్‌క్లాస్‌లు, వర్క్‌ఫ్రం హోం హడావిడిలో పడి చాలా మంది సమయాన్నే పట్టించుకోరు. గంటల తరబడి కుర్చీలకే అంకితమైపోతారు. ఇది శారీరక, మానసిక అనారోగ్యానికి దారి తీస్తుంది. అందుకే ఈ యాప్‌ మనల్ని అప్రమత్తం చేస్తుంది. కాసేపు లేచి నిలుచోమని, అలా ఓ రెండు నిమిషాలు నడవమని, కుర్చీలో కూర్చున్న భంగిమ మార్చుకోమని మనకు సూచనలు ఇస్తుంది. ప్రస్తుతం నిఖిత ఈ యాప్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇంత చక్కటి ఆలోచన ఇచ్చినందుకు హెచ్‌సీఎల్‌ జిగ్‌సా వాళ్లు ఈ చిన్నారికి ట్రోఫీతో పాటు, ల్యాప్‌టాప్‌నూ బహుమతిగా ఇచ్చారు. నిఖిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని మనమూ మనసారా కోరుకుందామా!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని