మామధ్య ఏమీ లేదని ఎలా చెప్పాలి?
close
Updated : 28/08/2021 06:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మామధ్య ఏమీ లేదని ఎలా చెప్పాలి?

ఆరునెలల కిందట నాకు పెళ్లైంది. మావారు నన్ను ప్రేమగా చూసుకుంటారు. ఓరోజు ‘నువ్వు ఎవరినైనా ప్రేమించావా?’ అని అడిగారు. అలాంటిదేం లేదన్నా. నిజానికి కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయి ప్రేమంటూ వెంటబడితే సరేనన్నా. సినిమాలకెళ్లాం, సెల్ఫీలు దిగాం. తర్వాత కొన్నాళ్లకి తన పద్ధతి నచ్చక దూరం పెట్టా. నా దృష్టిలో అది ప్రేమే కాదు. దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదనుకున్నా. కానీ మరోరోజు మా ఆయన ‘మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దు’ అంటూ సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు చెప్పుకుందాం అన్నారు. అలా అడుగుతారని ఊహించలేదు. పాస్‌వర్డ్‌లు తీసుకున్న తర్వాత నుంచి ఆయన ముభావంగా కనిపిస్తున్నారు. గతంలో నా క్లాస్‌మేట్‌తో దిగిన సెల్ఫీలు, చాట్‌ చూశారేమో అనిపిస్తోంది. మామధ్య ఏం జరగలేదని ఎలా కన్విన్స్‌ చేయాలి?

- ఆర్‌.ఎస్‌., ఈమెయిల్‌

ప్రతి బంధం నమ్మకం అనే పునాదిపై ఆధారపడి ఉంటుంది. అన్ని బంధాలలో ముఖ్యమైనది వైవాహిక బంధం. మీకు పెళ్లై ఆరునెలలే అవుతోంది అన్నారు.. దాన్ని కాపాడుకోవాల్సిన, దృఢం చేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీదా ఉంటుంది. కాలేజీ వయసులో ఉన్నప్పుడు అబ్బాయి, అమ్మాయి ఒకరిపట్ల మరొకరు ఆకర్షితులవడం సహజం. కానీ అది అత్యధికశాతం ఆకర్షణే. ఆ సమయంలో మీరు ఆ అబ్బాయితో చనువుగా ఉన్నారు. పద్ధతి నచ్చక కొన్నాళ్లకి దూరం పెట్టారు. అప్పుడే అతడి జ్ఞాపకాలను సైతం పూర్తిగా తొలగించి ఉండాల్సింది. అతడితో చనువుగా ఉన్న ఫొటోల్ని  పెళ్లైన తర్వాత కూడా సామాజిక మాధ్యమాల్లోంచి డిలీట్‌ చేయకపోవడం మీరు చేసిన పొరపాటు. ఏదేమైనా మీరు ఎలాంటి తప్పూ చేయలేదు అంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తనతో బంధం చాలా పరిమితమైందని మీవారితో చెప్పండి. దానికన్నా ముందు అసలు మీ భర్త ఎందుకు ముభావంగా ఉంటున్నారో కనుక్కోండి. మీరనుకున్నట్టు అదే విషయం ఔనో, కాదో కూడా చెప్పలేం కదా! ఆయనతో మాట్లాడకుండా ఓ నిర్ణయానికి రావొద్దు. ఒకవేళ ఆ ఫొటోలు చూసిన తర్వాతే ప్రవర్తనలో మార్పు వస్తే అసలు విషయం ఏంటో వివరంగా చెప్పండి. తెలిసీ, తెలియని వయసులో ఆకర్షణతో చేసిన పొరపాటని అర్థం అయ్యేలా వివరించండి. మనమధ్య మనస్పర్థలు రావొద్దనే ఉద్దేశంతోనే ఆ సమయంలో అబద్ధం చెప్పానని ఒప్పుకోండి. ఇకనుంచి ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవని మాట ఇవ్వండి. మీరంటే చాలా ఇష్టం అంటున్నారు కాబట్టి తప్పకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని