ఊపిరితిత్తుల్లో వైరస్‌తోనే కరోనా మరణాలు
close
Updated : 14/09/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊపిరితిత్తుల్లో వైరస్‌తోనే కరోనా మరణాలు

కొవిడ్‌-19 కొందరికి ఎందుకు ప్రాణాంతకంగా పరిణమిస్తోంది? మొదట్నుంచీ ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న ఇది. ఎట్టకేలకు దీని గుట్టును శాస్త్రవేత్తలు ఛేదించగలిగారు. కరోనా మరణాలకు కొవిడ్‌తో పాటు న్యుమోనియా వంటి ఇన్‌ఫెక్షన్లు ఉండటం, రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించటం కారణమవుతున్నాయని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే ఊపిరితిత్తుల్లో కొవిడ్‌ కారక సార్స్‌-కొవీ-2 పెద్ద మొత్తంలో ఉండటమే ప్రధాన కారణమని తాజాగా గుర్తించారు. తీవ్ర కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరి, కృత్రిమ శ్వాస అవసరమైనవారి ఊపిరితిత్తుల నుంచి తీసిన బ్యాక్టీరియా, ఫంగస్‌ నమూనాల విశ్లేషణ ద్వారా దీన్ని పసిగట్టారు. జబ్బు నుంచి కోలుకున్నవారితో పోలిస్తే చనిపోయినవారి ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్‌ 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు తేలటం గమనార్హం. ఇలా పెద్దఎత్తున దాడిచేసే వైరస్‌ను శరీరం తట్టుకోలేక పోవటమే మరణాలకు చాలావరకు కారణమవుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ ఇమ్రాన్‌ సులేమాన్‌ చెబుతున్నారు. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ అనంతరం తలెత్తే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ కొవిడ్‌ మరణాలకు కారణమవుతున్నట్టు తేలలేదని, దీనికి కారణం పెద్ద మొత్తంలో యాంటీబయోటిక్స్‌ ఇవ్వటం కావొచ్చని భావిస్తున్నారు. తీవ్ర కొవిడ్‌తో బాధపడుతున్నవారికి రెమ్‌డెసివిర్‌ వంటి యాంటీవైరల్‌ మందులు ఇవ్వకూడదని వైద్య సంస్థలు గట్టిగా సూచిస్తున్నాయి. కానీ నిజానికివి వీరికి బాగా ఉపయోగపడగలవని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. సాధారణంగా మనం ఏదైనా వైరస్‌ ప్రభావానికి గురైనప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ దాన్ని ఎదుర్కొనే శక్తిని సంతరించుకుంటుంది (అడాప్టివ్‌ ఇమ్యూనిటీ). ఇది సరిగా పనిచేయకపోవటం వల్లనే కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతోందని, దీన్ని గుర్తించగలిగితే సహజ రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేసేలా సమర్థమైన, కొత్త చికిత్సలను రూపొందించటానికి అవకాశముంటుందని పరిశోధకులు ఆశిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని