గేట్‌ దాటితే మేటి భవిత
close
Published : 02/01/2017 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గేట్‌ దాటితే మేటి భవిత

గేట్‌ దాటితే మేటి భవిత

ఈ సంవత్సరం కూడా కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) దేశంలోని ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో ఒకటైన ‘గేట్‌’ ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేశాయి. గేట్‌-2017 స్కోరు ద్వారా 45 నుంచి 50 పీఎస్‌యూలు ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. వాటిలో అవకాశం చేజిక్కించుకుంటే భవిష్యత్తు ఉజ్వలమే!

కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని మహారత్న, నవరత్న, మినీ నవరత్న కంపెనీలు ఉపాధి కల్పనలో కార్పొరేట్‌ సంస్థలతో పోటీపడుతున్నాయి. ఆకర్షణీయమైన వేతనాలు, ఉద్యోగ భద్రత, మంచి సౌకర్యాలు, కెరియర్‌ ఎదుగుదలకు అవకాశం కల్పిస్తున్నాయి. ఎలాంటి ఒడిదొడుకులూ లేని స్థిరత్వం గల ఉపాధిని అందించడం ఈ పీఎస్‌యూల ప్రత్యేకత.

ఇలాంటి సంస్థల్లో రూ.9 లక్షలపైబడి వార్షిక వేతనం పొందే మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ/ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగం సంపాదించాలంటే గేట్‌ స్కోరు అత్యంత కీలకం. అందువల్ల అభ్యర్థులు గేట్‌లో మంచి స్కోరు సాధిస్తే సుప్రసిద్ధ పీఎస్‌యూల్లో ఉద్యోగానికి అత్యంత చేరువగా వెళ్ళినట్టే!

తుది ఎంపికకు గేట్‌ స్కోరు 75 శాతం నుంచి 85 శాతం వెయిటేజిని పరిగణనలోకి తీసుకుంటారు. కొన్ని సంస్థల్లో గేట్‌-2017 స్కోరుతో పాటు బృంద చర్చ (గ్రూప్‌ డిస్కషన్‌)/ గ్రూప్‌ టాస్క్‌, ఇంటర్వ్యూ దశల ద్వారా ఎంపిక ఉంటుంది. ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులకు తాము చదువుకున్న ఇంజినీరింగ్‌ రంగంలోనే విధులు నిర్వహించే అవకాశం, ఉద్యోగ సంతృప్తీ దొరుకుతాయి.

బృంద చర్చ
అభ్యర్థి తుది ఎంపికకు వ్యక్తిగత మౌఖిక పరీక్ష (ఇంటర్వ్యూ)తో పాటు బృంద చర్చ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రూప్‌ డిస్కషన్లో సంస్థ తమకు కావాల్సిన నైపుణ్యాలను పరీక్షిస్తుంది. అభ్యర్థులకు ఏదైనా ఒక విషయం, లేదా సన్నివేశాన్ని ఇచ్చి 10 నుంచి 15 నిమిషాలు చర్చించిన తర్వాత విశ్లేషకుల ద్వారా ఒక నివేదిక తయారు చేస్తారు. మెరుగైన ప్రతిభ కనబరిచినవారిని తుది జాబితాకు ఎంపిక చేస్తారు.

బృంద చర్చల్లో భావ వ్యక్తీకరణ నైపుణ్యాలతో పాటు నాయకత్వం, ప్రేరణ, బృంద నిర్మాణం, సృజనాత్మకత మొదలైన సామర్థ్యాలను పరీక్షిస్తారు. అభ్యర్థుల తీరును అంచనా వేస్తారు.

గ్రూప్‌ టాస్క్‌: ఈ విభాగంలో అభ్యర్థులకు ఒక టాస్క్‌ ఇచ్చి దానికి సమాధానాలు కూడా ఇస్తారు. ఇచ్చిన సమాధానాల నుంచి సరైన దాన్ని గుర్తించి, ఆ సమాధానాన్ని సమర్థించడానికి అవసరమైన కారణాలను అభ్యర్థులు వివరించాల్సివుంటుంది.

మౌఖిక పరీక్ష
బృంద చర్చ తర్వాత తుది ఎంపికకు పర్సనల్‌ ఇంటర్వ్యూలో మంచి మార్కులు సంపాదించటం తప్పనిసరి.

ఈ మౌఖిక పరీక్షలో అడిగే ముఖ్య అంశాలు: 1) అభ్యర్థి స్వీయ పరిచయం 2) ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరం ప్రాజెక్టు 3) అభ్యర్థులకు పట్టున్న సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు 4) జనరల్‌ నాలెడ్జ్‌, వర్తమాన వ్యవహారాలు.

అభ్యర్థి తాను చేరబోయే సంస్థకు తన ఇంజినీరింగ్‌ పరిజ్ఞానం ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. వ్యక్తిగత ప్రశ్నలకు నిజాయతీగా జవాబులు చెప్పాలి. ఆ సమాధానాలు అభ్యర్థి శ్రద్ధ, స్వచ్ఛత, పరిపక్వత, పర్యావరణం పట్ల ఉన్న అవగాహనను తెలియజేస్తాయి. ప్రతి ప్రశ్ననూ శ్రద్ధగా విని సంక్షిప్తంగా, సూటిగా సమాధానం చెప్పాలి.

ఇంటర్వ్యూలో మంచి మార్కులు సంపాదించాలంటే... ఒకటి రెండు నమూనా ఇంటర్వ్యూలకు హాజరు కావాలి. గతంలో ఆయా సంస్థల్లో నియామకం పొందిన అభ్యర్థుల నుంచి తగిన సలహాలూ, సూచనలూ రాబట్టవచ్చు. కంపెనీల వెబ్‌సైట్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తే విలువైన సమాచారం పొందవచ్చు.

గేట్‌ స్కోరు తర్వాత...
* మొదటిగా గేట్‌ ర్యాంకు జనరల్‌ కేటగిరిలో 500-1000 లోపు వస్తే ఏదో ఒక సంస్థలో ఇంటర్వ్యూకు పిలుపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఈ ఆరు వారాలూ తగిన కృషి చేసి గేట్‌లో మంచి ర్యాంకు/ స్కోరు సాధించటానికి ప్రయత్నించాలి.

* గేట్‌ రాసిన తర్వాత నిర్లక్ష్యం వహించకుండా బృంద చర్చ/ గ్రూప్‌ టాస్క్‌, మౌఖిక పరీక్షలకు సన్నద్ధత, అభ్యాసం చేయాలి.

రూ.9 లక్షలపైబడి వార్షిక వేతనం పొందే మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ/ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగం సంపాదించాలంటే గేట్‌ స్కోరు అత్యంత కీలకం. అందువల్ల అభ్యర్థులు గేట్‌లో మంచి స్కోరు సాధిస్తే సుప్రసిద్ధ పీఎస్‌యూల్లో ఉద్యోగానికి అత్యంత చేరువగా వెళ్ళినట్టే!


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని