సాధన, పునశ్చరణలతో సక్సెస్‌!
close
Published : 15/03/2018 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాధన, పునశ్చరణలతో సక్సెస్‌!

సాధన, పునశ్చరణలతో
సక్సెస్‌!

టాప్‌ ర్యాంకర్ల విజయం గమనిస్తే.. వారు నిర్మించుకున్న నిర్దిష్ట సన్నద్ధత వ్యూహం కనిపిస్తుంది. ఇటీవల వెలువడిన నీట్‌ పీజీ ఫలితాల్లో అఖిల భారతస్థాయిలో 47వ ర్యాంకు, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు.. రామినేని కావ్య. ఆమె ప్రిపరేషన్‌ వ్యూహం ఏ తీరులో ఉంది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం!
నా చిన్నతనంలో మా తాతగారు ఎక్కువగా జబ్బు పడుతుండేవారు. అది చూసి మా నాన్న బాధపడుతుండేవారు. మా ఇంట్లోనే ఒక డాక్టర్‌ ఉంటే బాగుండేదని ఆయన ఎప్పుడూ అంటుండేవారు. అందుకే నాకు వైద్యవృత్తిపై ఆసక్తి పెరిగింది. ఇంటర్‌ తరువాత ఎంబీబీఎస్‌ ఎంచుకోవడానికి కారణమైంది.
ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరంలోనే పీజీ ప్రవేశపరీక్ష రాయాలని నిర్ణయించుకున్నాను. సన్నద్ధతను కూడా ఇంటర్న్‌షిప్‌ మధ్యలోనే మొదలుపెట్టాను. అయితే అది సీరియస్‌గా సాగిందని మాత్రం చెప్పలేను. అంతంతమాత్రంగానే సాగింది కానీ.. కొనసాగించాను. ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యాక సీరియస్‌గా సన్నద్ధత సాగించాను. మిగతావారితో పోలిస్తే నేను కాస్త నెమ్మదిగా చదువుతాను. కాబట్టి నోట్స్‌ ఉంటే బాగుండనిపించింది. అందుకే శిక్షణ తీసుకోవాలనుకున్నాను. ప్రైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను.తరగతులకు తప్పనిసరిగా హాజరయ్యాను. ఏ వారం చెప్పిన పాఠాలను ఆ వారాంతానికి పూర్తయ్యేలా చూసుకున్నా. దానికి సంబంధించిన పుస్తకాలను చదవటం, ఎంసీక్యూలను సాధన చేయటం.. అలా ఆ వారంలో చెప్పిన అంశాలకు సంబంధించినవన్నీ పూర్తి చేయడానికి ప్రయత్నించాను. ఒక్కోసారి మొత్తం పూర్తిచేయడం కుదిరేది కాదు. కానీ అయినంతవరకూ పూర్తిచేసేదాన్ని.
పునశ్చరణ, గత ప్రశ్నపత్రాలూ...
రోజుకు 8 నుంచి 12 గంటలు సన్నద్ధతకు కేటాయించాను. ఒక్కోరోజు పరిస్థితులనుబట్టి దానిలో హెచ్చుతగ్గులూ ఉన్నాయి. పరీక్షకు నెలరోజుల సమయం ఉందనగా పునశ్చరణ ప్రారంభించాను. మొత్తంగా నేను చేసింది ఒక్కసారే! కానీ గత ప్రశ్నపత్రాలను మాత్రం సాధన చేశాను. ఎయిమ్స్‌ ఇంకా మిగతా ప్రవేశపరీక్షల గత ప్రశ్నపత్రాలు రెండు సంవత్సరాలవి సాధన చేశాను.
నీట్‌లో... చాలావరకూ మెమరీ ఆధారిత ప్రశ్నలే ఉంటాయి. దాదాపుగా సగానికిపైగా అని చెప్పొచ్చు. మిగతావి నాలెడ్జ్‌ను అప్లై చేసేలా, క్లినికల్‌ బేస్‌డ్‌గా ఉంటాయి. అందుకే సాధన తప్పనిసరి.
అయితే నేను కేవలం నీట్‌కే పరిమితం కాలేదు. ఎయిమ్స్‌, జిప్‌మర్‌, పీజీఐఎంఈఆర్‌ చండీగఢ్‌ ప్రవేశపరీక్షలనూ రాశాను. కానీ వాటిల్లో నాకు ర్యాంకు రాలేదు. అయితే ప్రిపరేషన్లో దోహదపడ్డాయి. ఒకరకంగా నీట్‌లో ర్యాంకు సాధనకు కూడా! వాటితోపాటు ఆన్‌లైన్‌ పరీక్షలనూ రాశాను. తద్వారా ఎప్పటికప్పుడు నా సన్నద్ధతను సమీక్షించుకోగలిగాను.
చివరగా...
నా విజయాన్ని పూర్తిగా నా కుటుంబ సభ్యులు, స్నేహితులకే అంకితమిస్తాను. నా విజయానికి వారు అడుగడుగునా సహకరించారు. పీజీలో జనరల్‌ మెడిసిన్‌ చేద్దామనుకుంటున్నాను. ఏ కళాశాలలో చదవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే.. ఈ మూడేళ్ల పీజీని విజయవంతంగా పూర్తిచేయాలనే చిన్ని లక్ష్యాన్ని పెట్టుకున్నాను. దాన్ని సాధించే క్రమంలో.. మంచి కళాశాలను ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఇక ఉండనా!

భవిష్యత్‌ పరీక్షార్థులకు..

 నాలాగే అందరికీ కోచింగ్‌ తప్పనిసరి అని చెప్పలేను. ప్రవేశపరీక్షకు 19 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ఎవరికి వారిపై పూర్తి అవగాహన ఉంటుంది. దాన్నిబట్టి సొంతంగా సాధన చేయగలమా లేదా అనేది నిర్ణయించుకోవాలి. దాని ప్రకారం పుస్తకాలు చదివి పరీక్ష రాయగలమా లేదా కోచింగ్‌ తప్పనిసరా అనేది నిర్ణయించుకోవచ్చు. కోచింగ్‌ తీసుకున్నా, సొంతంగా సిద్ధమైనా ప్రత్యేకంగా నోట్స్‌ రాసుకోవాలి. అది పునశ్చరణను సులభతరం చేస్తుంది. 
చదవడంతోపాటు వాటికి సంబంధించిన ఎంసీక్యూలను సాధన చేయాలి. గత ప్రశ్నపత్రాలూ, మాక్‌ పరీక్షలను రాయడమూ చేయాలి. ఇవికూడా సన్నద్ధతలో భాగమే! అయితే ప్రతి సబ్జెక్టూ ముఖ్యమే. ఏదో ఒకదానిపైనే ఇష్టాన్ని ప్రదర్శించడం లాంటివి చేయొద్దు.

రామినేని కావ్య

 * సొంత ఊరు: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి.
* నివాసం: హైదరాబాద్‌- కూకట్‌పల్లి. 
* నాన్న: శ్రీనివాసరావు (పంచాయతీరాజ్‌ శాఖలో ఏఈ) 
* అమ్మ: ఝాన్సీలక్ష్మి (గృహిణి) 
* ఏడో తరగతి వరకు: కొండాపూర్‌లోని మహర్షి విద్యామందిర్‌.
* 8-10 తరగతి వరకు: నిజాంపేటలోని సంఘమిత్ర స్కూల్‌.
* పదో తరగతి: 94% మార్కులు
* ఇంటర్‌: శ్రీ చైతన్య కళాశాల. 97% మార్కులు 
* ఎంసెట్‌: 35వ ర్యాంకు.
* ఎంబీబీఎస్‌: ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌.70% మార్కులు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని