సాంకేతిక విద్యకు తొలిఅడుగు!
close
Published : 03/04/2018 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సాంకేతిక విద్యకు తొలిఅడుగు!

పాలీసెట్‌-2018
సాంకేతిక విద్యకు తొలిఅడుగు!

టెన్త్‌ తర్వాత సంప్రదాయ డిగ్రీలకు భిన్నంగా సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే అభ్యర్థులకు పాలీసెట్‌ వరంలాంటిది. అభిరుచికి తగిన ఎన్నో రకాల కోర్సులు డిప్లొమా స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అవి  పూర్తికాగానే ఉద్యోగాలు లభించే అవకాశాలూ ఎక్కువే. టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌కు మొదటి అడుగు పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ప్రారంభమవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లోని సాంకేతిక విద్య శిక్షణ సంస్థలు పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌)-2018 ప్రకటనలు విడుదల చేశాయి. వీటి ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. సాంకేతిక అంశాలపై మక్కువ ఉండి, చిన్న వయసులోనే కెరియర్‌లో స్థిరపడాలనుకునేవాళ్లు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. ఈ అర్హతతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పలు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు లేదా ఉన్నత విద్య దిశగా అడుగులేయవచ్చు. కొన్ని పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా విద్యార్థులు క్యాంపస్‌ నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందుతున్నారు.

అవకాశాలు
మూడేళ్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు చదివినవారు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ), రైల్వేల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రస్థాయిలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు కూడా డిప్లొమా అర్హతతో సబ్‌ ఇంజినీర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నాయి. పాలిటెక్నిక్‌ తర్వాత ఈసెట్‌ ద్వారా నేరుగా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. యూనివర్సిటీ క్యాంపస్‌ కళాశాలల్లో అయితే ప్రథమ సంవత్సరంలో చేరాల్సి ఉంటుంది. తక్కువ వయసులోనే స్థిరపడడానికి ఇంజినీరింగ్‌ డిప్లొమాలు దోహదపడతాయి. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ డిప్లొమా అభ్యర్థులకు అవకాశాలు లభిస్తున్నాయి. రైల్వేలో పెద్ద ఎత్తున భర్తీచేసే లోకో పైలట్‌ ఉద్యోగాలను సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా చదివినవారు సొంతం చేసుకోవచ్చు. సివిల్‌, ఎల‌్రక్టికల్‌, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎల‌్రక్టికల్‌ విభాగం వారికి అవకాశాలు లభిస్తాయి. సివిల్‌ అభ్యర్థులకు నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగం తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

ప్రవేశం లభించే కోర్సులు
సివిల్‌, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్‌, మెకానికల్‌, ఆటోమొబైల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్‌, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్‌, మెటలర్జికల్‌, కెమికల్‌, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌,  ఫుట్‌ వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ తదితర కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. మూడేళ్లు, మూడున్నరేళ్ల పాలిటెక్నిక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మూడున్నరేళ్ల కోర్సుల్లో చేరినవారికి ఏడాది వ్యవధితో పారిశ్రామిక శిక్షణ ఉంటుంది.

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. ప్రస్తుతం పది పరీక్షలు రాసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు  

తెలంగాణ
* ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 11 సాయంత్రం 5 వరకు
* పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 21 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు
* ఫలితాలు: ఏప్రిల్‌ 28న ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌:https://polycetts.nic.in

ఆంధ్రప్రదేశ్‌
* ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 14 సాయంత్రం 5 వరకు
* పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 27 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు
* ఫలితాలు:  మే 8న ప్రకటిస్తారు.
వెబ్‌సైట్‌:https://polycetap.nic.in


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని