ఇష్టాల ప్రకారం ఇదిగో ఉద్యోగం
close
Published : 24/04/2018 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇష్టాల ప్రకారం ఇదిగో ఉద్యోగం

ఇష్టాల ప్రకారం ఇదిగో ఉద్యోగం

కొత్తగా చేయాలంటారు... ఏం చేయాలో చెప్పరు! కోర్సులన్నీ ఒక్కటే... అభిరుచి ఉంటే దేనిలోనైనా రాణించవచ్చు అంటారు. అంటే ఏమిటో అర్థం కాదు. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులూ ప్రతి విద్యా సంవత్సరంలోనూ ఎదుర్కొంటున్న  సమస్యలే ఇవి. అంత తలబద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. మీకు టీ అంటే పిచ్చి ఇష్టమా...మీ కోసమే కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఫుడ్‌ రుచి చూస్తే దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పేయగలరా... కొన్ని సంస్థలు మీ కోసమే ఎదురు చూస్తున్నాయి. వైన్‌ చూస్తే దాని సంగతేంటో తేల్చందే వదిలిపెట్టరా... అయితే మీకు కొన్ని పరిశ్రమలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇలా మీ ఆసక్తులకు అనుగుణంగా పర్వతారోహణ, కార్పెట్‌ టెక్నాలజీ, రూరల్‌ స్టడీస్‌, గాంధియన్‌ థాట్‌, మ్యూజియాలజీ వంటి ఎన్నో రకాల కోర్సులను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వాటిని పూర్తిచేస్తే మీకు ఇష్టమైన ఉద్యోగాల్లో చేరవచ్చు. మీ ప్రత్యేకతను చాటుకోవచ్చు.

ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, సీఏ, ఎంబీఏ, ఎంసీఏ, బీఏ, బీకామ్‌, బీఎస్సీ... ఈ కోర్సుల గురించి వినీవినీ చాలామందికి విసుగొస్తోంది. అందరూ అవే చదివితే ఆ పోటీలోపడి కొట్టుకుపోవాల్సిందేగా. ఇంకా ఏమీ లేవా అంటే...  ఎన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని ప్రత్యేక సంస్థలు ఆసక్తికరమైన, వేగంగా ఉపాధిని అందించే కోర్సులను ఆఫర్‌ చేస్తున్నాయి. మీ అభిరుచుల మేరకు  వాటిని చేసుకోవచ్చు.

టీ టేస్టింగ్‌
నిజమే.. ఇదో కోర్సు. దానికీ కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. ఏ ఇద్దరు కలిసినా ముందు మాట్లాడుకునేది టీ గురించే కదా. అందరి అనుభూతులన్నీ టీతో ముడిపడి ఉంటాయి. అందరికీ ఆప్తమైన అలాంటి టీలలో ఏది మంచిది, ఏది వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటుందో తేల్చి చెప్పే నిపుణుల బృందాలు ఉంటాయి. వారే టీ టేస్టర్లు. మంచి తేయాకును గుర్తించడం, ఎంత మోతాదులో కలపాలో తెలుసుకోవడం, వాటికి గ్రేడ్లు ఇవ్వడం టీ టేస్టర్‌ పని. టీ పొడి తయారుచేసే కంపెనీలు, స్టార్‌ హోటళ్లు వీరిని నియమించుకుంటున్నాయి. ఇలాంటి ఉద్యోగాల్లో చేరాలనుకునేవారి కోసం డార్జిలింగ్‌ టీ రిసెర్చ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ మూడు నెలల వ్యవధి ఉండే టీ టేస్టింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు అందిస్తోంది. డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అర్హులు. కోర్సు ఫీజు రూ.45,000. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 25 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు.
కోర్సులు అందిస్తున్న మరికొన్ని సంస్థలు:
బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఫ్యూచరిస్టిక్‌ స్టడీస్‌, అస్సాం అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌, టీ రిసెర్చ్‌ అసోసియేషన్‌, డిప్రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రొఫెషనల్‌ స్టడీస్‌.

వైన్‌ టేస్టింగ్‌
వైన్‌ రుచి ఎలా ఉంది, మరింత మెరుగుపడాలంటే ఏం చేయొచ్చు, ఏ ఫ్లేవర్‌ ఎంత మోతాదులో కలిపితే ఆ వైన్‌ అద్భుతంగా రూపొందుతుందో చెప్పడం వైన్‌ టేస్టర్ల బాధ్యత. పలు పదార్థాలతో తయారు చేసిన వైన్స్‌ కలిపి సరికొత్త ఫ్లేవర్లను వీరు ఆవిష్కరిస్తారు. వైన్‌ తయారీ కంపెనీలతోపాటు స్టార్‌ హోటళ్లు సైతం వీరిని నియమించుకుంటున్నాయి. వైన్‌ అంటే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ప్రపంచంలోని ప్రసిద్ధ సంస్థలతోపాటు భారత్‌ లోనూ పలు అకాడమీలు ఈ కోర్సును అందిస్తున్నాయి. డిగ్రీ అర్హతతో ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఇందులో లెవెల్‌ 1, 2, 3 కోర్సులు ఉంటాయి.
సంస్థలు:
* వైన్‌ అండ్‌ స్పిరిట్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌, లండన్‌
* విక్టోరియా యూనివర్సిటీ, మెల్బోర్న్‌
మనదేశంలో
* తుల్లీహో వైన్‌ అకాడమీ - ముంబయి
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైన్‌ అండ్‌ బేవరేజ్‌ స్టడీస్‌ - దిల్లీ

ఫోటోనిక్స్‌...
ఆప్టికల్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ కలయికే ఫోటోనిక్స్‌. ఈ కోర్సులో చేరినవారు ఫోటాన్స్‌, కాంతి సూక్ష్మ కణాల గురించి అధ్యయనం చేస్తారు. కాంతి ఉద్ఘారం, ప్రసారం, తీవ్రత...మొదలైనవన్నీ తెలుసుకుంటారు. సైన్స్‌ అందులోనూ ముఖ్యంగా ఫిజిక్స్‌, కెమిస్ట్రీలపై ఆసక్తి ఉన్నవారికి ఇది బాగా నప్పుతుంది. ఈ కోర్సు చదువుకున్నవాళ్లు ఇంజినీర్‌, సైంటిస్ట్‌, రిసెర్చర్‌, ప్రొఫెషనల్‌ ఆఫీసర్‌గా పలు కంపెనీలు, ప్రభుత్వ విభాగాల్లో పనిచేయవచ్చు. ఫోటోనిక్‌ పరికరాలను వీరు తయారుచేయవచ్చు. ప్రస్తుతం ఈ విభాగంలో నిపుణులు ఎక్కువగా లేరు. ఆసక్తి ఉన్నవారు ఇందులో చేరినవెంటనే ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఉన్నాయి.
సంస్థలు:
ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫోటోనిక్స్‌ - కొచిన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - న్యూదిల్లీ, చెన్నై; మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తదితర సంస్థలు ఫోటోనిక్స్‌ కోర్సు అందిస్తున్నాయి. వీటిలో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు కూడా ఉన్నాయి.

ఫుడ్‌ ఫ్లేవరిస్ట్‌
రుచిని పసిగట్టి అందులోని మంచి చెడులు వివరించగలరా...అయితే మీరు ఫుడ్‌ ఫ్లేవరిస్ట్‌ ఉద్యోగానికి తగినవారే. ఫుడ్‌ అంటే కేవలం తినుబండారాలనే కాదు. పానీయాలు, పోషక పదార్థ సప్లిమెంట్లు, టూత్‌ పేస్టు, ఔషధాలు, లిప్‌ బామ్స్‌, సౌందర్య ఉత్పత్తులు, సుగంధద్రవ్యాలు...వీటిలో దేని గురించైనా వివరించే నైపుణ్యం, తమ ఉత్పత్తికి సంబంధించి వివిధ కంపెనీలు తయారుచేసిన వాటిని విశ్లేషించడంపై ఆసక్తి ఉన్నవాళ్లు ఫుడ్‌ ఫ్లేవరిస్ట్‌ కెరియర్‌ దిశగా అడుగులేయవచ్చు.
సంస్థలు:
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ - ముంబయి
* సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నలాజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, మైసూరు
* శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
* డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇంజినీరింగ్‌ - ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ.

ఆస్ట్రోబయాలజీ
భూగోళం, అంతరిక్షం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, బయాలజీ సాయంతో మనిషి మనుగడను మరింత గొప్పగా ఎలా తీర్చిదిద్దవచ్చు...లాంటి అంశాలపై ఆసక్తి ఉన్నవాళ్లు ఆస్ట్రోబయాలజీ కోర్సును ఎంచుకోవచ్చు. ఇండియన్‌ ఆస్ట్రోబయాలజీ రీసెర్చ్‌ సెంటర్‌, ముంబయి - ఆస్ట్రోబయాలజీ, ఆస్ట్రానమీ, కాస్మాలజీల్లో డిప్లొమా కోర్సులను అందిస్తోంది. అంతర్జాతీయ డిప్లొమా కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

గాంధియన్‌ థాట్‌
మహాత్మా గాంధీ అనుసరించిన జీవనవిధానం, ఆయన ఆలోచనలు, వివిధ సందర్భాల్లో వ్యవహరించిన తీరు...ఇవన్నీ సూక్ష్మ స్థాయిలో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఈ కోర్సులో చేరొచ్చు. గాంధీ విచార్‌ దర్శన్‌ పేరుతో ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా కోర్సును నాసిక్‌లోని యశ్వంతరావ్‌ చవాన్‌ మహారాష్ట్ర ఓపెన్‌ యూనివర్సిటీ అందిస్తోంది. కోర్సులో భాగంగా అహింస, సత్యాగ్రహ ఉద్యమం, గాంధీ తత్వం తదితర అంశాలను బోధిస్తారు. వార్ధా (మహారాష్ట్ర)లోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గాంధియన్‌ స్టడీస్‌ గాంధియన్‌ థాట్‌లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సు అందిస్తోంది.

మ్యూజియాలజీ
మ్యూజియంలపై ఆసక్తి ఉన్నవారు వాటి గురించీ చదువుకోవడానికి కొన్ని కోర్సులు ఉన్నాయి. వీటిని చదివినవారు సమాజంలో మ్యూజియంల పాత్రను అర్థం చేసుకోవచ్చు. చరిత్ర, నాగరికతలపై అవగాహన, ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు. ఆర్ట్స్‌ గ్రూప్‌ విద్యార్థులు మ్యూజియాలజీ కోర్సును ప్రయత్నించవచ్చు. నేషనల్‌ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిస్టరీ అండ్‌ ఆర్ట్‌, కన్జర్వేషన్‌ అండ్‌ మ్యూజియాలజీ- న్యూదిల్లీ, కలకత్తా యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీలు మ్యూజియాలజీలో ఎంఏ, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి.

క్లినికల్‌ థెరపిస్ట్‌
ఆధునిక జీవనం అవకాశాలతోపాటు ఒత్తిడినీ తీసుకొచ్చింది. దాని వల్ల రకరకాల సమస్యలతో మానసికంగా కుంగిపోతున్న వాళ్లెందరో మనచుట్టూ ఉన్నారు. వీరిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి క్లినికల్‌ థెరపిస్టుల సేవలు అవసరం. ఆ పనిని క్లినికల్‌ సైకాలజిస్టులు చేస్తుంటారు. సైకాలజీలో ఒక స్పెషలైజేషన్‌ కోర్సుగా క్లినికల్‌ సైకాలజీ ఉంటుంది. పీజీలో ఎమ్మెస్సీ క్లినికల్‌ సైకాలజీ కోర్సును పలు సంస్థలు అందిస్తున్నాయి. సమస్యలను విశ్లేషించి పరిష్కార మార్గాలను చూపే సమర్థత, ఎదుటివారు చెప్పింది ఓపికగా వినే సహనం ఈ రెండూ క్లినికల్‌ థెరపిస్టులకు  ఉండాల్సిన లక్షణాలు.
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరో సైన్సెస్‌ - బెంగళూరు
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకాలజీ అండ్‌ రిసెర్చ్‌- బెంగళూరుతోపాటు పలు యూనివర్సిటీలు క్లినికల్‌ సైకాలజీ కోర్సు అందిస్తున్నాయి.

ఎన్వైరాన్మెంటలిస్ట్‌
పర్యావరణ ప్రేమికులు ఎన్వైరాన్మెంటలిస్ట్‌ ఉద్యోగాల్లో రాణించడానికి అవకాశాలున్నాయి. వివిధ ప్రమాదాలు, విపత్తుల నుంచి పర్యావరణాన్ని పరిరక్షించడమే ఎన్వైరాన్మెంటలిస్ట్‌ ప్రధాన విధి. నశించిపోతున్న జీవజాతుల మనుగడకు కృషి చేయడమూ వీరి విధుల్లో భాగమే.
సామాన్యశాస్త్రాలపై ఆసక్తి ఉన్నవాళ్లు పర్యావరణవేత్తలుగా రాణించే వీలుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఎన్వైరాన్మెంటలిస్టులకు డిమాండ్‌ పెరిగింది. పర్యావరణంలో సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులను పలు సంస్థలు, యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
* నేషనల్‌ ఎన్వైరాన్‌మెంటల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌-నాగ్‌పూర్‌, ఫారెస్ట్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ - డెహ్రాడూన్‌, జేఎన్‌యూ-దిల్లీ, దిల్లీ యూనివర్సిటీ, అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ- ఉత్తర్‌ ప్రదేశ్‌ మొదలైనవి పర్యావరణ కోర్సులకు జాతీయస్థాయిలో ప్రసిద్ధమైనవి.

మౌంటెనీరింగ్‌  

టీవలి కాలంలో పర్వతాలను అధిరోహించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ప్రభుత్వాలు సైతం విద్యార్థులను పర్వతాధిరోహణ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. అయితే పర్వతాలను నేరుగా వెళ్లి ఎక్కేయడం సాధ్యం కాదు. అందుకు తగ్గ ప్రాథమిక శిక్షణ తీసుకోవడం అనివార్యం. పర్వతారోహణపై ఆసక్తి ఉన్నవాళ్లు, పర్వతారోహణ శిక్షకులుగా మారాలనుకున్నవాళ్లు ఈ మౌంటెనీరింగ్‌ కోర్సులో చేరవచ్చు. పలు సంస్థలు ఏడాదిలో పలుసార్లు బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌ కోర్సులను అందిస్తున్నాయి.
నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌, ఉత్తరకాశీ (ఉత్తరాఖండ్‌).
వింటర్‌ స్పోర్ట్స్‌, పహల్గామ్‌-జమ్మూ కశ్మీర్‌
అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటెనీరింగ్‌ అండ్‌ అలైడ్‌ స్పోర్ట్స్‌, మనాలీ, హిమాచల్‌ ప్రదేశ్‌
* హిమాలయన్‌ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, డార్జిలింగ్‌, పశ్చిమ్‌ బంగ
* సోనమ్‌ గ్యాట్సో మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, గ్యాంగ్‌టక్‌, సిక్కిం

పపెట్రీ
తోలుబొమ్మల తయారీపై ఆసక్తి ఉన్నవాళ్లకి ముంబయి యూనివర్సిటీ ఒక చక్కని వేదిక. ఈ సంస్థ పపెట్రీలో నాలుగు నెలల పార్ట్‌ టైం కోర్సు అందిస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసినవాళ్లు ఇందులో చేరవచ్చు.

రూరల్‌ స్టడీస్‌
గ్రామీణ భారతం గురించి తెలుసుకోవాలనుకునేవారికి, గ్రామాల అభివృద్ధిపై ఆసక్తి ఉన్నవారికి సరిపోయే కోర్సు రూరల్‌ స్టడీస్‌. పెంపుడు జంతువులు, పాడిపశువులు, వ్యవసాయం, పర్యావరణం, అడవులు, శిశువికాసం...తదితరాంశాలను కోర్సులో భాగంగా బోధిస్తారు. స్థానిక పరిస్థితులను, అక్కడున్న వనరులను ఉపయోగించి గ్రామాలను ఎలా అభివృద్ధి చేయవచ్చో ఈ కోర్సులో నేర్పుతారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. కోర్సు పూర్తిచేసివవాళ్లు వీటిలో ఉపాధి పొందవచ్చు.
సంస్థలు:
* భావ్‌నగర్‌ యూనివర్సిటీ, గుజరాత్‌ ‌
* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, హైదరాబాద్‌
* ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, న్యూదిల్లీ
* తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు రూరల్‌ డెవలప్‌మెంట్‌లో రెండేళ్ల ఎంఏ కోర్సును అందిస్తున్నాయి.

కార్పెట్‌ టెక్నాలజీ  

కార్పెట్‌ తయారుచేయడమూ ఓ కళే. గృహాలు, వాణిజ్య సముదాయాలు కార్పెట్‌తో ప్రత్యేక రూపు సంతరించుకుంటాయి. వీటి వినియోగం పెరుగుతుండటంతో ఆకర్షణీయ మోడళ్లు వస్తున్నాయి. తయారీలోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అందుకే కార్పెట్‌ తయారీ కోసమూ సంస్థలను నెలకొల్పారు. ఇవి ఇప్పుడు ఉద్యోగ కేంద్రాలయ్యాయి.
సంస్థలు:
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పెట్‌ టెక్నాలజీ, భదోహీ (ఉత్తరప్రదేశ్‌), ఆసియాలోనే కార్పెట్‌ టెక్నాలజీ కోర్సులను అందించే ప్రత్యేక సంస్థగా ఇది గుర్తింపు పొందింది. ఈ సంస్థ కేంద్ర వస్త్రశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వస్త్ర పరిశ్రమలో సృజనాత్మకతను పెంపొందించి, నాణ్యమైన మానవవనరులను వృద్ధి చేయాలనే లక్ష్యంతో దీన్ని నెలకొల్పారు. ఇక్కడ చదివినవారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు లభిస్తున్నాయి. పలు డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. ఇక్కడ కార్పెట్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీలో బీటెక్‌ కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సులో భాగంగా వస్త్రాన్ని తయారుచేయడం, రంగులద్దడం, ఆరబెట్టడం, ఉతకడం ... తదితరాంశాల్లో శిక్షణ ఇస్తారు. నాలుగో సంవత్సరంలో హోమ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్‌ డిజైనింగ్‌ టెక్నాలజీ స్పెషలైజేషన్లను చదువుతారు. పలు స్వల్పకాలిక వ్యవధి, దూరవిద్య కోర్సులు కూడా ఐఐసీటీ అందిస్తోంది.

ఆల్కహాల్‌ టెక్నాలజీ