తీరు మారింది మీరు మారాలి!
close
Published : 03/05/2018 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తీరు మారింది మీరు మారాలి!

తీరు మారింది మీరు మారాలి!

కళాశాలల్లో  ప్రాంగణ నియామకాలు జులైలో జరగబోతున్నాయి. ‘అవి  దగ్గరపడినప్పుడు చూడొచ్చులే, ఇప్పటినుంచే హైరానా ఎందుకు?’ అనుకుంటూ నిర్లక్ష్యం చేయటం సరైనది కాదు. తాత్సారం చేయకుండా క్యాంపస్‌, ఆఫ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లకు  తగిన విధంగా సన్నద్ధమవటం ముఖ్యం. మార్పులను గ్రహించి వాటికి అనుగుణంగా వివిధ అంశాలపై పట్టు పెంచుకోవటానికి ప్రయత్నించాలి!

ప్రాంగణ నియామకాలు- 2018
సంస్థల ఎంపిక ప్రక్రియలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏటా కొత్త అంశాల జోడింపు జరుగుతోంది. వాటికి అనుగుణంగా అభ్యర్థి తయారైవుండాలని సంస్థలు ఆశిస్తున్నాయి. అందుకే- దరఖాస్తు చేసుకున్న సంస్థ పరిశ్రమ నుంచి అవసరమైన నైపుణ్యాల వరకూ అన్ని విషయాల్లో పరిశోధన, ఆచరణ తప్పనిసరి. అప్పుడే మిగిలినవారికంటే ముందుండటం సాధ్యమవుతుంది.

గతంలో మనదేశంలో వస్తూత్పత్తి కంటే సేవలను అందించడం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వస్తూత్పత్తి రంగంలో ముందుకు సాగుతోంది. దీంతో నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ సంస్థ అయినా తాము ఎంపిక చేయబోయే అభ్యర్థులకు పనిచేసే రంగంపై అవగాహన ఉండాలని భావిస్తోంది. అభ్యర్థులు సానుకూల దృక్పథంతో ఉండటం, మార్పునకు అనుగుణంగా మారగలగడం తరువాతి ప్రాధాన్యాంశాలు!
దరఖాస్తు చేసేముందే విద్యార్థి సంబంధిత సంస్థ గురించి పరిశోధన చేయాలి. తన సామర్థ్యం, అనుభవాలకు తగ్గట్టుగా అవకాశాలు ఉన్నాయో లేదో గమనించుకోవాలి. ఫలానా సంస్థ తన భవిష్యత్తుకు బాటలు ఏర్పరుస్తుందో లేదో నిర్ధారించుకోవాలి. దరఖాస్తు చేస్తున్న స్థానానికి చెందిన రంగంపై అవగాహనే కాకుండా దానిలో తన కెరియర్‌ను నిర్మించుకుంటూ ఏ స్థాయి వరకూ వెళ్లగలరో కూడా చూసుకోవాలి. ఇదివరకటిలా ఏదో ఒక సంస్థలో ఏదో ఒక స్థానంలో చేరితే చాలనుకునేవారికి విజయావకాశాలు కష్టమే.

ప్రణాళికే ప్రధానం
ఏ విద్యార్థికైనా తగిన స్థాయిలో అవగాహన రావాలంటే పరీక్షలు అయిన వెంటనే రెండు మూడు నెలలు పక్కా ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవ్వాలి.
* చదువుతున్న కోర్సుకు ఏయే రంగాల్లో అవకాశాలున్నాయో తెలుసుకోవాలి. ఈ సమాచారం సీనియర్లు, ఆ రంగాల్లో పనిచేసే నిపుణుల ద్వారా లభిస్తుంది. దాని ఆధారంగా తనకు ఏ రంగాల్లో ఆసక్తి ఉందో విశ్లేషించుకోవాలి. ఆ రంగాలకు తన సామర్థ్యం సరిపోతుందో లేదో చూసుకోవడమూ ముఖ్యమే. ఇదంతా కచ్చితంగా తెలియాలంటే ఇంటర్న్‌షిప్‌లే మార్గం. నెల నుంచి మూడు నెలల వ్యవధిలో ఇవి చేయగలిగితే కచ్చితమైన అవగాహన వస్తుంది. ఇదంతా చేస్తే కచ్చితమైన కెరియర్‌ ఆబ్జెక్టివ్‌ను నిర్మించుకున్నట్లే.
* రెండో దశలో ఈ కెరియర్‌ ఆబ్జెక్టివ్‌కు సంబంధించిన సంస్థలు, వాటి ఇంటర్వ్యూ విధానం ఏమిటి, వాటికి దరఖాస్తు ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలి. ఆ సంస్థలు ప్రాంగణ నియామకాలకు మీ కళాశాలకు వస్తాయా లేదా ఆఫ్‌ క్యాంపస్‌ నిర్వహిస్తారా అనేవి చూసుకోవాలి. ఆఫ్‌ క్యాంపస్‌ అయితే నియామకాల్లో ఎలా పాల్గొనవచ్చో కసరత్తు చేయాలి. ఇందులో భాగంగా ప్రొఫైల్‌ను కూడా తయారుచేసుకోవాలి. ఏదైనా టెంప్లేట్‌ను అనుసరించినా సమాచారం మాత్రం అభ్యర్థిదే ఉండాలి. ప్రొఫైల్‌ అంటే కెరియర్‌ ప్రయాణం. అది ప్రస్ఫుటంగా కనిపించాలి.
* ఏ సంస్థ ఎంపిక విధానమైనా రెజ్యూమెతోనే మొదలవుతుంది. సంస్థ ఆశించిన అంశాలు రెజ్యూమెలో ఒక క్రమంలో ఉండేలా తీర్చిదిద్దాలి.

ఏ రౌండులో ఏవి?
మొదటి రౌండ్‌లో ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను అభ్యర్థి సమస్య పరిష్కార శక్తిని అంచనా వేయడానికి నిర్వహిస్తారు. అందువల్ల అభ్యర్థులు షార్ట్‌కట్‌లు, ఫార్ములాలకే  పరిమితం కాకూడదు. సమస్య స్వరూపాన్ని ఊహించగలిగి థాట్‌ స్టెప్స్‌తో సమాధానాలు సాధించేలా సిద్ధం కావాలి.

రెండో రౌండ్‌.. గ్రూప్‌ డిస్కషన్‌ కానీ, జస్ట్‌ ఏ మినిట్‌ (జామ్‌) కానీ, లేదా కేస్‌స్టడీ ఉంటుంది. వీటిలో అభ్యర్థి భావ వ్యక్తీకరణ, ప్రవర్తనలను అంచనా వేస్తారు.

మూడో రౌండ్‌ టెక్నికల్‌, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలకు సంబంధించింది. టెక్నికల్‌ ఇంటర్వ్యూలో కాన్సెప్ట్‌, అప్లికేషన్‌ లెవల్స్‌లో ఉండే తీరు మారింది. ఇప్పుడు కచ్చితంగా కాన్సెప్టులు, రియల్‌ టైం అప్లికేషన్లతోపాటు మొత్తం ప్రొడక్ట్‌ గురించి అడుగుతున్నారు. ఇలాంటి ఇంటర్వ్యూల్లో ఇంటర్న్‌షిప్‌ చేసిన వారికి విజయావకాశాలు ఎక్కువ. ప్రస్తుతం విద్యార్థులను తాము చేసిన అకడమిక్‌ ప్రాజెక్టుపై లోతైన ప్రశ్నలు వేస్తున్నారు. వీటితోపాటు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే- ఏ బ్రాంచి విద్యార్థి అయినా ఇతర బ్రాంచిలపై అవగాహన తప్పనిసరి.

సాంకేతిక నైపుణ్యాలతో పాటు రియల్‌టైం అప్లికేషన్‌, టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌, ప్రాడక్ట్‌ యుటిలిటీపై పూర్తి అవగాహన అవసరం. ఈ సంవత్సరం నుంచీ వీటికి ప్రాధాన్యం ఉంటుంది.

హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో సానుకూల దృక్పథం, పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోగల     సామర్థ్యాన్ని చూస్తారు. ఉదాహరణకు: అభ్యర్థికి ఒక పరిస్థితిని ఇచ్చి దానిపై వారిచ్చిన అభిప్రాయం ఆధారంగా వారి వైఖరిని అంచనావేస్తారు. ఒక హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థిని.. ‘సంస్థలో పనిచేస్తున్నపుడు ప్రాజెక్టు పని నిమిత్తం మిమ్మల్ని ఆఫ్రికా వెళ్లాలంటే మీరేం చేస్తారు?’ అని అడిగారనుకుందాం. దానికి సమాధానం వెళ్తాను.. వెళ్లను అని కాకుండా.. ప్రాజెక్టు సమాచారం అడిగి, అది తన కెరియర్‌కు  ఎంత ఉపయోగకరం? అక్కడ ఎంతకాలం ఉండాల్సి వస్తుంది? ఉండటానికి అనుకూలమేనా వంటి అంశాలను తెలుసుకోవాలని హెచ్‌ఆర్‌ అధికారి భావిస్తారు. మరి ఆఫ్రికాకి (అమెరికా, లండన్‌ లాంటివి కాకుండా) వెళ్లడానికి నీ కుటుంబాన్ని ఎలా ఒప్పిస్తావు అంటే.. అభ్యర్థి ఒప్పుకుంటే.. కుటుంబాన్ని ఎంత వరకూ, ఎలా ఒప్పించడానికి ప్రయత్నిస్తాడో చూస్తాడు. ఇలా అభ్యర్థి సానుకూల దృక్పథం, మార్పునకు అనుకూలంగా మారడం అనేవి ఏ పరిమాణంలో ఉన్నాయో పరిశీలిస్తారు. ఇలా మొత్తంగా విద్యార్థులు తమ అభ్యర్థిత్వాన్ని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకొని, ప్రదర్శిస్తారనే అంశంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.

సాధారణ గ్రాడ్యుయేట్లకూ అవకాశాలు