పారా కోర్సులు.. చాలా కొలువులు
close
Published : 12/06/2018 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పారా కోర్సులు.. చాలా కొలువులు

పారా కోర్సులు.. చాలా కొలువులు

  రోగికి శస్త్రచికిత్స చేయాలంటే మత్తుమందు వైద్యుడు ఎంత ముఖ్యమో..ఆ మత్తుమందు ఇవ్వడానికి సర్వం  సిద్ధం చేసే సాంకేతిక నిపుణుడు కూడా అంతే అవసరం.  ఇన్‌ఫెక్షన్లు రాకుండా శస్త్రచికిత్స గదిని శుభ్రంగా ఉంచాలన్నా సహాయకులు కావాల్సిందే. వాళ్లే పారామెడికల్‌ సిబ్బంది. పారామెడికల్‌ కోర్సులు చేయడం ద్వారా వీళ్లు ఆ నైపుణ్యాలను పొందుతారు.  డాక్టర్లకు అడుగడుగునా అండగా ఉంటూ  పేషెంట్లకు సకాలంలో వైద్యసేవలు అందిస్తారు. అందుకే పారామెడికల్‌ నిపుణులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. ఈ రంగంలో ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు వస్తున్నాయి. ఎప్పటికీ తరగని ఉద్యోగావకాశాలను అభ్యర్థులకు అందిస్తున్నాయి.

వైద్యవృత్తిలో సాంకేతిక నిపుణుల పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత ప్రధానమైంది. రెండు దశాబ్దాల కిందటితో పోలిస్తే వైద్యవృత్తికి సంబంధించిన సాంకేతిక నిపుణుల కోర్సులు ఇటీవలి కాలంలో కొత్తవి పుట్టుకొచ్చాయి. ఒక్కో వైద్యనిపుణుడికి తన విభాగానికి సంబంధించిన సాంకేతిక నిపుణుడి సహకారం ఇప్పుడు అవసరమవుతోంది. ఈ సాంకేతిక నైపుణ్యాన్ని అందించే కోర్సులే ‘పారామెడికల్‌ కోర్సులు’.
దాదాపు 22 రకాల పారామెడికల్‌ డిప్లొమా కోర్సులు ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చాయి. ఇందులో డిగ్రీ కోర్సులూ, పీజీ డిప్లొమా కోర్సులూ ఉన్నాయి. పారామెడికల్‌ కోర్సులో ఏ స్థాయి విద్యనభ్యసించినా.. వృత్తిలో కొనసాగాలంటే మాత్రం తప్పనిసరిగా రాష్ట్ర పారామెడికల్‌ బోర్డులో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సిందే.
2006లో ఉమ్మడి రాష్ట్రంలోనే పారామెడికల్‌ బోర్డు అనేది ప్రత్యేకంగా ఏర్పాటు కాగా.. దానికి కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారామెడికల్‌ బోర్డులు ఏర్పడ్డాయి.


బీఎస్సీ పారామెడికల్‌ కోర్సుల ప్రవేశాలను మాత్రం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. పరీక్షలు కూడా వారే నిర్వహిస్తారు. డిగ్రీ పూర్తయిన అనంతరం ధ్రువపత్రాల నమోదు ప్రక్రియను మాత్రం పారామెడికల్‌ బోర్డులోనే చేయించాల్సి ఉంటుంది. అయితే డిప్లొమాలో ఉన్నన్ని భిన్నమైన పారామెడికల్‌ కోర్సులు.. డిగ్రీలో లేవు.
అర్హత ఏమిటి?: ఈ కోర్సులన్నీ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో రెండింటిలోనూ ఉన్నాయి. తెలంగాణలోని 9 ప్రభుత్వ కళాశాలల్లో 13 రకాల పారామెడికల్‌ డిప్లొమా కోర్సులతో మొత్తం 591 సీట్లుండగా.. 250 ప్రైవేటు కళాశాలల్లో 22 రకాల పారామెడికల్‌ కోర్సులతో మొత్తం 33456 డిప్లొమా సీట్లున్నాయి. అయితే ప్రైవేటులో సీట్లు భారీగానే ఉన్నా వాస్తవానికి నాలుగో వంతు సీట్లు కూడా భర్తీ కావడం లేదు. 2016-17లో కేవలం 7 వేల మంది పారామెడికల్‌ డిప్లొమా కోర్సుల్లో పరీక్షలు రాయగా.. 2017-18లో ఆ సంఖ్య స్వల్పంగా పెరిగి 8700 మంది తుది పరీక్షకు హాజరయ్యారు.
ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోనూ పారామెడికల్‌ ఉద్యోగాల ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ దఫా 2018-19లో తుది పరీక్షలు రాసేవారి సంఖ్య 10 వేలు దాటొచ్చని పారామెడికల్‌ బోర్డు అంచనా వేస్తోంది.
2012-13కు ముందు ఈ కోర్సుల ప్రవేశానికి అర్హత పదో తరగతి మాత్రమే ఉండేది. కానీ ఆ తర్వాత నుంచి దీనికి కనీస అర్హత ఇంటర్మీడియట్‌గా నిర్ణయించారు. రెండు సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లోనూ ఇప్పుడు ప్రవేశం కల్పిస్తున్నారు. ఒక మోస్తరు ఆర్థిక స్థోమత ఉన్నవారు డిగ్రీ పారామెడికల్‌ కోర్సుల్లో చేరుతుండగా.. పూర్తిగా నిరుపేద విద్యార్థులు, ఆర్థికంగా రుసుములు చెల్లించలేని విద్యార్థులు మాత్రమే డిప్లొమా పారామెడికల్‌ కోర్సుల్లో చేరుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు మాత్రమే పారామెడికల్‌ కోర్సులు చదవడానికి అర్హత ఉండేది. కానీ ఆ తర్వాత కాలంలో ఆర్ట్స్‌ విద్యార్థులకూ అవకాశాలు కల్పించారు. డిప్లొమా ఇన్‌ రేడియోథెరపీ టెక్నీషియన్‌ కోర్సుకు మాత్రం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే అర్హులు.
ప్రవేశాలెప్పుడు?
*జూన్‌లో జిల్లాలవారీగా ప్రవేశ ప్రకటనలు వెలువరిస్తారు. ‌
* జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ‌
* ఇంటర్మీడియట్‌లోని మార్కుల ప్రాతిపదికనే ప్రవేశ ప్రక్రియ కొనసాగుతుంది. ‌
* ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారామెడికల్‌ బోర్డుకు పంపిస్తారు.
* ఆ జాబితాను బోర్డు ధ్రువీకరించిన అనంతరమే ఈ-పాస్‌ విధానంలో రుసుములు చెల్లిస్తారు. ‌
* సెప్టెంబరులో విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
రుసుములెలా?: ఈ వృత్తి విద్య కోర్సుల్లో చదివేది అత్యధికులు నిరుపేద విద్యార్థులే కావడంతో.. వీరికి ప్రభుత్వమే రుసుమును ఆన్‌లైన్‌ విధానంలో చెల్లిస్తోంది. ప్రభుత్వ కళాశాలల్లో చదివినా.. ప్రైవేటులోనూ కన్వీనర్‌ కోటాలో చదివినా.. మొత్తం రుసుమును సర్కారే భరిస్తోంది. వీరికి ఏడాదికి రూ.6 వేలు ప్రభుత్వ కళాశాలల్లో, రూ.13 వేలు ప్రైవేటు కళాశాలల్లో రుసుము ఉంటుంది. వీరికి రెండేళ్లకోసారి వార్షిక పరీక్షలను నిర్వహిస్తుంటారు. ఆ పరీక్ష రుసుము రూ.1500 కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా కింద ఏడాదికి రూ.40 వేల రుసుమును నిర్ణయించారు. కానీ ఆ సీట్లలో చేరికలు బహు స్వల్పం.


మెరుగైన అవకాశాలు: ఇంజినీరింగ్‌ చదివినా కూడా ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయేమోగానీ.. పారామెడికల్‌ కోర్సుల్లో డిప్లొమా కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రం సమాజంలో మెరుగైన అవకాశాలే లభిస్తున్నాయి. ఉదాహరణకు ల్యాబ్‌టెక్నీషియన్‌ చేసిన అభ్యర్థి ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగం చేయాలనేం లేదు. ప్రైవేటులోనూ బోలెడన్నీ అవకాశాలున్నాయి. ఏ ప్రైవేటు ఆసుపత్రులోనైనా, ఏ ప్రయోగశాలలోనైనా ల్యాబ్‌ టెక్నీషియన్‌గా చేరిపోవచ్చు. ఇక్కడ వీరికి డిమాండ్‌ ఎక్కువ. నెలకు కనీసం రూ.20 వేల వేతనంతో చేరిపోతున్నారు.
అలాగే అనెస్తీషియా, పర్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, కార్డియాలజీ, ఇమేజింగ్‌ టెక్నాలజీ తదితర విభాగాల్లో సాంకేతిక నిపుణులకు విదేశాల్లోనూ ఎక్కువ గిరాకీ ఉంది. మన దగ్గర పారామెడికల్‌ కోర్సుల్లో డిప్లొమా చేసిన అనేకమందికి విదేశాల్లో ఇక్కడి కంటే ఐదింతలు అధికంగా వేతనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ‘కంటి వెలుగు’ పేరిట పెద్ద ఎత్తున నేత్ర వైద్యశిబిరాలు నిర్వహించనున్న నేపథ్యంలో.. ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్లు, ఆప్టోమెట్రిక్‌ టెక్నీషియన్లకు ఆదరణ పెరగనుంది. ఇప్పటికే నేత్ర వైద్యంలో సాంకేతిక శిక్షణ పూర్తిచేసుకున్న సుమారు 700 మంది నిపుణులను కంటి వెలుగులో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వ కళాశాలల్లో కొత్తగా ప్రారంభించనున్న డెంటల్‌ హైజీనిస్ట్‌, ఎమర్జన్సీ పారామెడిక్‌ టెక్నీషియన్‌ తదితర పారామెడికల్‌ కోర్సులు, కళాశాలల వివరాలను ‌www.eenadupratibha.net లోచూడవచ్చు.
 

తెలంగాణ కాలేజీలు, కోర్సులు
తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉన్న పారామెడికల్‌ డిప్లొమా కోర్సులివి..
*తెలంగాణలో మొత్తం ప్రైవేటు పారామెడికల్‌ కళాశాలలు-250
* మొత్తం సీట్లు-33456 ‌
* ప్రభుత్వ రంగంలో 9 వైద్యకళాశాలలు.. మొత్తం సీట్లు- 591
* కాకతీయ వైద్యకళాశాల ‌
* ఉస్మానియా వైద్యకళాశాల ‌
* ప్రభుత్వ ప్రసూతి దవాఖానా పేట్లబురుజు‌
* ఛాతీ ఆసుపత్రి ‌
* ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాల ‌
* గాంధీ వైద్యకళాశాల
* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ ‌
* ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి ‌
* సరోజినీదేవి కంటి ఆసుపత్రి.

కోర్సులు: * మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ * ఆప్టోమెట్రీ టెక్నీషియన్‌  * హాస్పిటల్‌ ఫుడ్‌సర్వీస్‌ మేనేజ్‌మెంట్‌  * మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (మేల్‌) * ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్‌ * ఆడియోమెట్రీ * రేడియోథెరపీ * పర్‌ఫ్యూజన్‌ * డయాలసిస్‌ * మెడికల్‌ ఇమేజింగ్‌ * రెస్పిరేటరీ థెరపీ * మెడికల్‌ స్టెరిలైజేషన్‌ మేనేజ్‌మెంట్‌  అండ్‌ ఆపరేషన్‌ థియేటర్‌ * హియరింగ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌ థెరపీ * డెంటల్‌ * డెంటల్‌ హైజీనిస్ట్‌ * మైక్రోసర్జరీ * అనెస్తీషియా * క్యాథ్‌ల్యాబ్‌ * రేడియోగ్రాఫిక్‌ అసిస్టెంట్‌ * డార్క్‌రూమ్‌ అసిస్టెంట్‌ * ఈసీజీ * కార్డియాలజీ

ఈ ఏడాది నుంచే సీట్ల పెంపు  

ఈసారి ప్రవేశ ప్రకటన జారీ చేసేటప్పుడు పారామెడికల్‌ కోర్సులకు సంబంధించి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించాం. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో 591 డిప్లొమా సీట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నిజానికి సీట్ల సంఖ్యను పెద్దసంఖ్యలో పెంచుకోవడానికి అవసరమైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలున్నాయి. అందుకే ప్రభుత్వ వైద్యంలో అదనంగా 958 పారామెడికల్‌ డిప్లొమా సీట్లను పెంచే ప్రతిపాదనను ఇప్పటికే ప్రభుత్వానికి అందజేశాం. త్వరలోనే దీనిపై సానుకూల నిర్ణయం రానుంది. 
ఈ విద్యా సంవత్సరం నుంచే పెంచిన సీట్లను ప్రవేశ ప్రక్రియలో పొందుపరుస్తాం. ప్రస్తుతం రెండేళ్లకోసారి వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. వీటిని ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఆధునిక వైద్యంలో వస్తున్న మార్పులకనుగుణంగా పాఠ్యాంశాల్లోనూ మార్పులు తీసుకురానున్నాం. విదేశాలకు వెళ్లేముందు పారామెడికల్‌ బోర్డులో మంచి ప్రవర్తనకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పొందాల్సి ఉంటుంది. కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యత ప్రమాణాలు పరిరక్షించడంపైనా దృష్టిపెట్టాం. ప్రయోగశాలలు, బోధన అర్హులతో నిర్వహిస్తున్నారా? లేదా? అనేది పరిశీలిస్తాô. లోటు ఉన్నవారిపై చర్యలు తీసుకుంటాం. 

టి.గోపాలరెడ్డి, తెలంగాణ పారామెడికల్‌ బోర్డు కార్యదర్శి

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని