తప్పు తెలిసొచ్చింది
close
Published : 16/01/2016 17:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తప్పు తెలిసొచ్చింది

తప్పు తెలిసొచ్చింది

  సుందరయ్య, సీతమ్మల ఏకైక సంతానం సుదీపుడు. తల్లిదండ్రుల్ని చాలా ప్రేమగా చూసుకునేవాడు. సుదీపుడు వ్యాపారంలో స్థిరపడ్డాక సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. తనకు అనుకూలంగా ఉండి, తల్లిదండ్రుల్ని ప్రేమగా కనిపెట్టుకునే అమ్మాయి అయితే చాలన్నాడు. కొన్ని సంబంధాలు చూశాక సులోచన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొత్త కోడలు కొన్నాళ్లు బాగానే 

ఉంది. తర్వాత అత్తమామలు తమతో ఉండడం ఆమెకు నచ్చలేదు. వేరు కాపురం పెడదామని భర్తతో పోరు పెట్టసాగింది. అత్తమామలను వృద్ధాశ్రమంలో చేర్పించమంది. సుదీపుడు ససేమిరా అన్నాడు. సులోచన పోరు రోజురోజుకూ ఎక్కువ కాసాగింది. ఒకసారి బంధువుల వివాహానికి పట్నం వెళ్లాడు సుదీపుడు. అక్కడ సులోచన వాళ్ల అన్నయ్య సూర్యం కలిశాడు. పెళ్లి అయిన తర్వాత బావమరిది సూర్యాన్ని ఇంటికి తీసుకు వచ్చాడు సుదీపుడు. అన్నయ్యను చూస్తూనే సులోచనకు సంతోషం పొంగుకొచ్చింది. ‘ఎలా ఉన్నారన్నయ్యా! అమ్మానాన్నా ఆరోగ్యం ఎలా ఉంది?’ కుశల ప్రశ్నలు అడిగింది. సూర్యం ముఖం దిగాలుగా పెట్టి ‘‘ఈ మధ్య అమ్మానాన్న ఆరోగ్యం ఏం బావుండట్లేదు. ఇక నుంచి వాళ్లకు సేవ చేయడం కుదరదని మీ వదిన తెగేసి చెప్పేసింది. ఏం చేయను? వాళ్లను వృద్ధాశ్రమంలో చేర్పించబోతున్నాను’’ అన్నాడు. ఆ మాటలు వింటూనే అంతెత్తున లేచింది సులోచన. ‘ కన్నవాళ్లను వృద్ధాశ్రమంలో చేర్పించడానికి నీకసలు బుద్ధుందా? నీకేం తక్కువ చేశారు? అయినా పెళ్లాం మాటలు విని అమ్మానాన్నల్ని దూరం చేసుకునేంత వాజమ్మవి అనుకోలేదు’’ అంటూ మండిపడింది. సూర్యం మొహం చిన్నబుచ్చుకున్నాడు. అది గమనించిన సుదీపుడు భార్య మాటలకు అడ్డుపడుతూ ‘ఇంటికి వచ్చిన అన్నయ్యతో ఇలాగేనా మాట్లాడ్డం? అయినా మీ అన్నయ్య చేసిన దాంట్లో తప్పేముంది? ఎన్నాళ్లని మీ వదిన మాత్రం సేవలు చేస్తుంది చెప్పు? ఇంతకీ మనం కూడా అదే చేయబోతున్నాం కదా? ఏమంటావ్‌?’ అన్నాడు. సూర్యం ఆశ్చర్యపోతున్నట్టు మొహం పెట్టి, ‘‘ఏమిటి బావా? నువ్వు కూడా అత్తయ్య, మామయ్యలను వృద్ధాశ్రమంలో పెడుతున్నావా?’’ అని చెల్లెలి కేసి తిరిగి, ‘‘ఇక నువ్వేంటి, నాకు చెప్పొచ్చేది?’’ అన్నాడు కోపంగా. సులోచన ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ వృద్ధాశ్రమం మాట ఎత్తలేదు సరికదా, అత్తమామలను ఆదరణగా చూసుకోసాగింది. ఇదంతా సూర్యం, సుదీపుల ఉపాయంలో భాగమేనని ఆమెకు ఎప్పటికీ తెలియలేదు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని