పాలపుంత సంగతేంటి?
close
Published : 03/04/2016 02:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాలపుంత సంగతేంటి?

పాలపుంత సంగతేంటి?

ప్రశ్న: పాలపుంత అంటే ఏమిటి?

కె.సునయన, కార్వేటినగరం

జవాబు: రాత్రివేళల్లో మేఘాలు లేని ఆకాశంలోకి చూస్తే పాలు పారబోసినట్టు ఉండే ఒక విశాలమైన చార ఒక దిక్కు నుంచి మరో దిక్కు వైపునకు పరుచుకుని ఉంటుంది. అదే పాలపుంత (మిల్కీవే). అతి శక్తిమంతమైన టెలిస్కోపుల సాయంతో పాలపుంతలో లెక్కలేనన్ని నక్షత్రాలు, దుమ్ము, వాయువులు సముదాయంగా ఉన్నాయని కనుగొన్నారు. పాలపుంత పాలరంగులో ఉండటానికి కారణం అందులో ఎన్నో నక్షత్రాలు ఉండటమే. మన సౌరకుటుంబం (సూర్యుడు, సూర్యునిచుట్టూ పరభ్రమించే గ్రహాలు) ఈ పాలపుంతలోని భాగమే. విశ్వంలో ఇలాంటి నక్షత్ర మండలాలు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. టెలిస్కోపు గుండా చూస్తే, పాలపుంత మధ్య భాగం ఉబ్బెత్తుగా, చివరి అంచులు పలచగా ఒక కుంభాకార కటకం (కాన్వెక్స్‌ లెన్స్‌) రూపంలో ఉంటుంది. శాస్త్ర పరిశీలనల ద్వారా పాలపుంత సర్పిలాకారంలో ఉండి 1,50,000,000,000 నక్షత్రాలు కలిగి ఉన్నట్లు తెలిసింది.

పాలపుంత పరిమాణాన్ని మైళ్లలో, కిలో మీటర్లలో కాకుండా, కాంతి సంవత్సరాలలో కొలుస్తారు. కాంతి సంవత్సరం అంటే సెకనుకు సుమారు 3,00,000 కిలోమీటర్ల వేగంతో కాంతి ఒక సంవత్సర కాలంలో పయనించే దూరం. అంటే 9,408,000,000,000,000 కిలోమీటర్లు. మన పాలపుంత వ్యాసం లక్ష కాంతి సంవత్సరాలు! సూర్యుడు పాలపుంత కేంద్రం నుంచి 30 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉండి పాలపుంత చుట్టూ తిరుగుతుంటాడు. అలా సూర్యుడు ఒక భ్రమణం తిరగడానికి పట్టే కాలం 250 మిలియన్‌ సంవత్సరాలు. పాలపుంతలో చీకటి ప్రదేశాలు నక్షత్రాలు తక్కువగా ఉండి, దుమ్ము, ధూళి ఉండే ప్రాంతాలు.

ప్రొ ఈ.వి.సుబ్బారావు,
హైదరాబాద్‌

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని