అందరి చూపూ.. ఆటోమేటిక్‌!
close
Published : 06/07/2018 01:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరి చూపూ.. ఆటోమేటిక్‌!

అందరి చూపూ.. ఆటోమేటిక్‌!

ధర ఎక్కువైనా ఫర్వాలేదు.. ప్రయాణం సాఫీగా సాగిపోవాలి... అలసట అస్సలు తట్టుకోలేం.. డ్రైవింగ్‌ తేలికగా ఉండాలి... ఇది ఇప్పటి కారు యజమానుల మాట... అందుకే ఆటోమేటిక్‌ బాట పడుతున్నారు... ఈ జోరు ఎంతలా ఉందంటే.. మూడేళ్లలో  అమ్మకాలు అమాంతం ముప్ఫైశాతం పెరిగిపోయాయి... ఇంకో రెండేళ్లలో వీటి వాటా సగానికిపైగా ఉంటుందంటున్నారు...
ఇంతకీ ఈ కారులో ఉన్న కిక్‌ ఏంటి?  మాన్యువల్‌కి, ఆటోమేటిక్‌కి  ఉన్న తేడా ఏంటి? నిపుణులేమంటున్నారు?

దినేశ్‌ హైదరాబాద్‌లో ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగి. వనస్థలిపురం నుంచి గచ్చిబౌలికి రోజూ ట్రాఫిక్‌లో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాడు. మాన్యువల్‌ కారులో క్లచ్‌ తొక్కుతూ, మాటిమాటికీ గేర్లు మార్చుతూ డ్రైవింగ్‌ చేస్తుంటే ఒళ్లు హూనమై పూర్తిగా అలసిపోయేవాడు. ఈ బాధ తప్పించుకోడానికి ఈమధ్యే ఆటోమేటిక్‌ కారుకి మారాడు. యాక్సిలరేటర్‌, బ్రేక్‌ ఈ రెండింటినే ఉపయోగిస్తూ ప్రయాణాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడు. దీంతో క్లచ్‌, బ్రేక్‌, యాక్సిలరేటర్‌, గేర్‌ల మధ్య అనుక్షణం సమన్వయం ఉండాల్సిన పన్లేదు. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌బాక్స్‌ డ్రైవింగ్‌ మోడ్‌లో పెట్టేస్తే చాలు. వేగానికి అనుగుణంగా గేర్లు వాటికవే మారిపోతుంటాయి. వెనక్కి వెళ్లాలంటే ఆర్‌, న్యూట్రల్‌కి ఎన్‌, ఎత్తైన ప్రదేశాల్లో హిల్‌సైడ్‌ మోడ్‌. అన్నింటికీ ఆటోమేటిక్కే.

అమ్మకాల జోరు
ఆటోమేటిక్‌ కారు ధర ఎక్కువ, మైలేజీ తక్కువ అనేది ప్రధాన ఫిర్యాదు. ఇందులో మొదటి మాట నిజమే అయినా రెండోది అవాస్తవం అంటారు హోండా ప్రైడ్‌ గ్రూప్‌ సీఈవో రాకేశ్‌కుమార్‌. సీవీటీ వెర్షన్‌ కారులో అయితే మాన్యువల్‌ కారుకన్నా ఒకట్రెండు కిలోమీటర్ల మైలేజీ ఎక్కువే వస్తుందంటారు. ఏదేమైనా ప్రస్తుతం భారత్‌ ఆటోమేటిక్‌ కార్ల బాట పడుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత అవసరాలకు కారు ఉపయోగించేవాళ్లు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఆటోమేటిక్‌ కార్ల అమ్మకాలు గడచిన రెండేళ్లలో రెండింతలయ్యాయి. ప్రస్తుతం 3.7లక్షల ఆటోమేటిక్‌ వాహనాలు వాడుకలో ఉన్నాయి. ఇంకో రెండేళ్లలో మొత్తం అమ్మకాల్లో యాభైశాతం ఇవే ఉంటాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వీటితోపాటు నగరాల్లో క్యాబ్‌ సర్వీసులు నడుపుతున్న ఓలా, ఉబర్‌లాంటి కంపెనీలు సైతం ఆటోమేటిక్‌ కార్లనే ఎంచుకుంటున్నాయి. మాన్యువల్‌ కారు కన్నా ఆటోమేటిక్‌ ధర అరవై వేల నుంచి లక్షా ఇరవై వేల రూపాయల వరకు ఎక్కువగా ఉంటుంది. అయినా కొత్తగా కారు కొనాలనుకునేవారు వీటివైపే ఆసక్తి చూపిస్తున్నారు. మారుతిసుజుకీ ఆల్టో కె100, రెనాల్ట్‌ క్విడ్‌, టాటా టియాగో లాంటి తక్కువ ధర కార్లలో కూడా ఈ సదుపాయం ఉండటం కొనుగోళ్లు పెరగడానికి మరో కారణం.

మూడు రకాలు  

ఆటోమేటిక్‌ కార్లన్నీ ఒకటే కాదు. వీటిలో మూడురకాలున్నాయి.
ఏఎంటీ: ఆటోమేటెడ్‌ మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌. ఇది ప్రాథమికస్థాయి. సెమీ ఆటోమేటిక్‌. దీన్నే ఆటోగేర్‌ షిఫ్ట్‌ అంటారు. మాన్యువల్‌లాగే క్లచ్‌ ఉంటుంది. కానీ క్లచ్‌ పెడల్‌ ఉండదు. హైడ్రాలిక్‌ సిలిండర్‌, ఎలక్ట్రానిక్‌ చిప్‌ పెట్టి గేర్లు మారేలా చేస్తారు. మాన్యువల్‌తో పోలిస్తే మైలేజీ తగ్గుతుంది. వాడినాకొద్దీ క్లచ్‌ అరిగిపోతుంటుంది. గేర్లు మారుతున్నపుడు చిన్నచిన్న కుదుపులు ఉంటాయి.

ఏటీ: ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌. క్లచ్‌ ఉండదు. గేర్లు అన్ని ఒకదానికొకటి అనుసంధానమై పని చేస్తాయి. దీంతో కూడా కొంచెం మైలేజీ తగ్గుతుంది. గేరు మారినపుడు ఆ ప్రభావం కొంచెం తెలుస్తుంది. దీంట్లోనే డ్యుయెల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ (డీసీటీ) అని మరింత అడ్వాన్స్‌డ్‌ రకం ఉంది. దీంట్లో గేరు మారినపుడు ఆ తేడా తెలియక సాఫీగా వెళ్లిపోతుంటుంది.

సీవీటీ: కంటిన్యూయెస్‌లీ వేరియేబుల్‌ ట్రాన్స్‌మిషన్‌. ఆటోమేటిక్‌ కార్లలో అత్యంత ఆధునికమైంది. రెండు పుల్లీలు, ఒక బెల్టు ద్వారా గేర్లు మారుతుంటాయి. ఎలాంటి కుదుపులుండవు. ఆడీ కార్లలో తొలిసారి ఈ టెక్నాలజీ వాడారు. మరో ప్రత్యేకత ఏంటంటే దీంతో మైలేజీ కూడా ఎక్కువే.

టాప్‌ కార్లు

* మారుతిసుజుకీ ఆల్టో కే10: కే సిరీస్‌ ఇంజిన్‌ 5 స్పీడ్‌ ఏఎంటీ గేర్‌బాక్స్‌. పెట్రోల్‌, సీఎన్‌జీ వేరియంట్‌లో కూడా ఈ సదుపాయం ఉంది.
ధర: రూ.3.30లక్షలు - రూ.4.15 లక్షలు
* రెనాల్ట్‌ క్విడ్‌: ఎస్‌యూవీ డిజైన్‌తో ఉన్న అతి తక్కువ ధరలో ఏఎంటీ ఫీచర్‌ అందిస్తున్న మోడల్‌ ఇదే. 5స్పీడ్‌ ఏఎంటీ, 800 సీసీ ఇంజిన్‌తో పని చేస్తుంది.
ధర: రూ.2.70లక్షలు - రూ.4.64 లక్షలు
* మారుతిసుజుకీ సెలేరియో: హ్యాచ్‌బాక్‌ విభాగంలో ఏఎంటీతో వచ్చిన తొలి కారు. దీని తర్వాతే ఇతర పోటీదారులు ఏఎంటీ బాట పట్టాయి.
ధర: రూ.4.20 - రూ.5.38 లక్షలు
* హోండా అమేజ్‌: తేలికైన ఛాసిస్‌, లోపల విశాలమైన స్థలంతో వచ్చిన సెడాన్‌ విభాగం కారు ఇది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇది అత్యాధునిక సీవీటీతో పని చేస్తుంది. ఇండియాలో డీజిల్‌ వేరియంట్‌లో ఏకైక సీవీటీ కారు ఇదే.
ధర: 5.60 - రూ.9లక్షలు
* మారుతిసుజుకీ డిజైర్‌: భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్‌ సెడాన్‌. పెట్రోల్‌, డీజిల్‌ రెండు వేరియంట్లలో దొరుకుతోంది. ఆటో గేర్‌ షిఫ్ట్‌ (ఏజీఎస్‌)
ధర: రూ.5.56 - రూ.9.43లక్షలు
* హ్యుందాయ్‌ వెర్నా: చిన్న కుటుంబాలకు అనువుగా ఉండే సెడాన్‌ కారు. 2018లో ఇండియన్‌ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. 6స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌..
ధర: రూ.7.80లక్షలు - రూ.12.95లక్షలు
* టయోటా యారిస్‌: టయోటా కంపెనీ ఇండియాలో దించిన మొదటి సెడాన్‌. 6 స్పీడ్‌ గేర్‌బాక్స్‌ సీవీటీతో పని చేస్తుంది.
ధర: 8.75లక్షలు - రూ.14.07లక్షలు
* మారుతిసుజుకీ విటారా బ్రెజ్జా: కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారు. డీజిల్‌ వేరియంట్‌లో ఏఎంటీ ఆఫర్‌ చేస్తున్నారు.
ధర: రూ.7.28లక్షలు - రూ.9.73లక్షలు
* టాటా నెక్సాన్‌: కాంపాక్ట్‌ సెడాన్‌ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇదొకటి. డిజైన్‌, లుక్స్‌ దీనికి ఈ స్థానం కల్పించాయి. దీనికి హిల్‌ క్లైంబ్‌ అసిస్ట్‌ అదనపు ఫీచర్‌.
ధర రూ.6.16లక్షలు - రూ.10.59లక్షలు
* ఫోక్స్‌వాగన్‌ పోలో: జర్మనీ కంపెనీ భారత్‌లో అమ్ముతున్న ఏకైక హ్యాచ్‌బాక్‌ కారు ఇది. డ్యుయెల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ గేర్‌తో పని చేస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌ రెండు వేరియంట్లలో దొరుకుతోంది.
ధర రూ.5.42లక్షలు - రూ.9.69లక్షలు

సగం ఇవే

విదేశాల్లో తొంభైశాతానికిపైగా ఆటోమేటిక్‌ కార్లే వాడుకలో ఉన్నాయి. భారత్‌ విషయానికొస్తే ముందునుంచీ మాన్యువల్‌వే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. మైలేజీకి ప్రాముఖ్యం ఇచ్చే సాంప్రదాయిక అలవాటుతో మన దగ్గర ఈ ట్రెండ్‌ ఉంది. నగరాల్లో ఇప్పట్లో ఉన్నంత భారీ ట్రాఫిక్‌ అప్పుడు లేకపోవడం కూడా ఓ కారణం. రాన్రాను ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరగడం, జనాల కొనుగోలు శక్తి పెరగడం, ధర ఎక్కువైనా ఫర్వాలేదు సౌకర్యంగా ఉండాలనుకునే మనస్తత్వం.. వెరసి ఆటోమేటిక్‌ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. సీవీటీ టెక్నాలజీతో మైలేజీలో కూడా తేడా లేకపోవడంతో ఎక్కువమంది వీటిని కోరుకుంటున్నారు. ప్రస్తుతం హోండా కంపెనీలో అన్ని కార్లూ ఆటోమేటిక్‌వే. ఐదారేళ్ల కిందట పదిహేను నుంచి ఇరవైశాతం ఉంటే ఇప్పుడు మేం అమ్ముతున్న వాటిలో సగం ఆటోమేటిక్‌వే. ఈ వాహనాలు మహిళలు డ్రైవింగ్‌ చేయడానికి సైతం అనుకూలంగా ఉంటాయి. సర్వీస్‌, మరమ్మతులు చేయడానికి అనువుగా ఉంటాయి.

- రాకేశ్‌కుమార్‌, సీఈవో హోండా ప్రైడ్‌ గ్రూప్‌

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని