జీవానందం 
close
Published : 12/10/2018 13:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జీవానందం 

జీవానందం 

శ్రీరాముడు పదహారేళ్ల లేలేత వయసులో తీర్థయాత్రలు చేశాడు. ప్రకృతి శోభను సమగ్రంగా దర్శించి రసానుభూతిని పొందాడు. తీర్థాల్లో పుణ్యస్నానాలు ఆచరించి జన్మ పవిత్రం చేసుకున్నాడు. సంపూర్ణమైన ఆనందం నిండిన హృదయంతో అయోధ్యకు తరలి వచ్చాడు. సంతోషాంతరంగుడైన శ్రీరాముడికి అయోధ్య, అందులోని రాచరికం, సుఖభోగాల పట్ల మనసు విరక్తి చెందింది. అయోధ్యలో నివసించడం అతడికి రుచించలేదు. తన హృదయాన్ని తండ్రి దశరథుడి ముందు ఆవిష్కరించాడు. దశరథుడు ఖిన్నుడయ్యాడు. గురుదేవులైన వసిష్ఠుణ్ని ఆస్థానానికి ఆహ్వానించి రామహృదయాన్ని ఆయనకు నివేదించాడు. పరంధాముడైన శ్రీరాముడి మనోస్థితిని గుర్తించాడు మహర్షి. శ్రీరామచంద్రుడు శ్రోతగా, ముల్లోకాల్లోని జనావళి లక్ష్యంగా లోకవాసుల క్షేమం కోసం వసిష్ఠుడు వేదాంత సారాన్ని బోధించాడు. అదే వసిష్ఠ గీత, లేక యోగవాసిష్ఠంగా ప్రాచుర్యం పొందింది. 
అది కురుక్షేత్ర సంగ్రామ రణస్థలం. సైన్యం, రథాలు, గజాలు, తురగాలు, కాల్బలాలు బారులు తీరి ఉన్నాయి. యుద్ధం చేయవలసిన వీరుల్లో సోదరులు, బంధువులు, గురువులు, తాతలతోపాటు కురు పితామహుడు భీష్మాచార్యుడు నిలిచి ఉన్నాడు. వీరందరితోనా యుద్ధం చేయవలసినది, వీరినా వధించవలసింది. అలా వధించి సాధిస్తే రాజ్య ‘లక్ష్మి’ అవుతుందా? లక్ష్మి సుఖసంతోషాలను ప్రసాదించే వరదేవత! బంధువర్గాన్ని, అమాయక సైన్యాన్ని నిర్జించి రాజ్యలక్ష్మిని చేపడితే- సుఖశాంతులు దక్కుతాయా, అలా కానప్పుడు తనకు రాజ్యకాంక్ష ఎందుకు, తాను ఎందుకు యుద్ధం చేయాలి? 
అర్జునుడు విషాదంలో కూరుకుపోయాడు. సరిగ్గా అప్పుడే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడి అంత‘రంగ’ ప్రవేశం చేశాడు. సకల మానవాళి ధ్యేయంగా అర్జునుడు శ్రోతగా భగవద్గీతను అతడికి ఉపదేశించాడు. విషాదంలో ఉన్న అర్జునుడికి మార్గనిర్దేశం చేశాడు. ఆ తరవాత ఏం జరిగిందో లోకవిదితమే! 
భగవంతుడి నుంచి ఆవిర్భవించినవాడు మనిషి. భవసాగరంలోని క్లేశాలు అనుభవిస్తూ తనలో ఉంది ఆనందసాగరమని తెలుసుకోలేకపోతున్నాడు. ఆనందం తన సృష్టికి కేంద్రబిందువైనా జీవితంలో దుఃఖాలను అనుభవిస్తూ ఆనందం అనుభవించే అదృష్టం ఉందా అని వాపోతున్నాడు. మనిషి జీవితంలో ఎల్లవేళలా అనుభవాలు కలుగుతుంటాయి. జరిగే ప్రతి సంఘటనా ఓ అనుభవమే! వాటిలో కొన్ని ఆనందాన్ని ప్రత్యక్షంగా అందించగా మరికొన్ని దుఃఖం ముసుగు వేసుకొని పరోక్షంగా ఆనందానికి కారణమవుతాయి. క్లేశ రూపం సంతరించుకున్న ప్రతి అనుభవం ఓ గుణపాఠం నేర్పుతుంది. చేసిన తప్పులు చేయకుండా రక్షిస్తుంది. దుఃఖానుభవాన్ని నివారించి ఆనంద ప్రాప్తికి కారణమవుతుంది. మనిషి తన ప్రతి చేతనలో ఆనందాన్ని ఒడిసిపట్టే ప్రయత్నం చేయాలి.

శ్వాస అందినవేళ ఓ ఆనంద క్షణం! ఆకలి తీరే వేళ, దాహార్తి ఉపశమించే వేళ ఆనందం కలుగుతుంది. వాయువు తల్లిలాంటి స్పర్శ అందించి  పరవశం కలిగిస్తుంది. పీల్చే శ్వాసలో అవరోధం, అన్న ద్వేషం రోగాలుగా బాధలకు కారణమవుతాయి. రోజూ తారసిల్లే స్వల్ప ప్రయోజనాలు ఆనంద క్షణాలకు బాటలు పరచేవే! అసంతృప్తి వల్ల ఆనందం బీటలు వారుతుంది. అల్ప సంతోషులు సతతం ఉత్సాహ స్ఫూర్తి పొందుతారు.

కొండగాలి సేద తీరుస్తుంది. చిరుజల్లు మనసును ఆహ్లాదభరితం చేస్తుంది. పెనుతుపానులో గాలీ వానా ఉద్ధృతమవుతాయి. పెనుగాలి మహావృక్షాలను పెళ్లగిస్తుంది. వరద నీరు ఏరులై ప్రవహిస్తుంది. విధ్వంసకారక తుపానును ఎవరూ హర్షించరు. అయితే జీవితానికి సరిపడా అందే గుణపాఠాలు అనంతర కాలంలో ముందు జాగ్రత్తలకు సాయపడతాయి. పరమాత్మ దారులు అనూహ్యమైనవి. అర్థమైన మేర, గురువులు అర్థవివరణ చేసినంతమేర సత్యాన్ని గ్రహించి సాధకుడు ముందుకు సాగాలి. సృష్టి, స్థితి, లయల తత్వాన్ని తెలుసుకున్నవాడిని దుఃఖం దరి చేరదు!

- గోపాలుని రఘుపతిరావు

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని