Vaccine: కోలుకున్న 3 నెలల తర్వాతే టీకా
close
Updated : 20/05/2021 10:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: కోలుకున్న 3 నెలల తర్వాతే టీకా

పాలిచ్చే తల్లులూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు
కేంద్ర ప్రభుత్వ నిపుణుల బృందం వెల్లడి

ఈనాడు, దిల్లీ: కరోనాతో బాధపడుతున్న వారు, కోలుకున్న బాధితులు, మొదటి డోసు టీకా తీసుకున్న తర్వాత వైరస్‌ బారిన పడిన వారు, ప్లాస్మా చికిత్స పొందిన వారు టీకా తీసుకోవాల్సిన సమయంపై కేంద్ర ప్రభుత్వ  నిపుణుల బృందం (నేషనల్‌ ఎక్స్‌పర్ట్‌ గ్రూప్‌ ఆన్‌ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఫర్‌ కొవిడ్‌- నెగ్‌వ్యాక్‌) స్పష్టతనిచ్చింది. వీరు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన మూడు నెలల తర్వాతే టీకా తీసుకోవాలని సూచిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు సిఫార్సు చేసింది. మహమ్మారి పరిణామ క్రమంలో వస్తున్న మార్పులు, ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న అనుభవాలు, అందుబాటులోకి వచ్చిన సాక్ష్యాధారాల ఆధారంగా తీసుకున్న ఈ నిర్ణయాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆమోద ముద్ర వేసింది. బిడ్డలకు పాలు ఇస్తున్న మహిళలు కరోనా టీకా తీసుకోవచ్చని నిపుణుల బృందం సిఫార్సు చేసింది.

ప్రధానమైన నిర్ణయాలు ఇవీ..
కొవిడ్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్దారణ అయిన వారు వ్యాధి నుంచి కోలుకున్న 3 నెలల అనంతరమే కరోనా టీకా తీసుకోవాలి.
మోనోక్లోనల్‌ రోగ నిరోధకాలు, కన్వాలసెంట్‌ ప్లాస్మా ఇచ్చిన కొవిడ్‌ బాధితులు కూడా ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయిన రోజు నుంచి 3 నెలల తర్వాతే టీకా తీసుకోవాలి.
మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకొనేలోపే ఇన్‌ఫెక్షన్‌కు గురైనట్లయితే కరోనా నుంచి కోలుకున్న 3 నెలల తర్వాతే మలి డోసు తీసుకోవాలి.
ఇతరత్రా సాధారణ రోగాలకులోనై ఆసుపత్రి, ఐసీయూ సేవలు అవసరమైన వారు టీకా తీసుకోవడానికి 4-8 వారాలు వేచి చూడాలి.
టీకా తీసుకున్న వారు, కొవిడ్‌ నుంచి కోలుకొని ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చిన వారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు.
వ్యాక్సినేషన్‌కు ముందు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌ ద్వారా స్క్రీనింగ్‌ చేయాల్సిన అవసరం లేదు.
గర్భిణులకు టీకా అందించే అంశం ప్రస్తుతం చర్చ దశలో ఉంది. దీనిపై నిపుణుల బృందం తదుపరి సమాలోచనలు జరపాల్సి ఉంది.
ఈ సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలు టీకాలు అందించే విషయంలో చర్యలు తీసుకోవాలి. దీని గురించి వ్యాక్సిన్‌ అందించేవారు, సామాన్య ప్రజలకు తెలిసేలా స్థానిక భాషల్లో విస్తృత ప్రచారం చేయాలి. వ్యాక్సినేషన్‌ సిబ్బందికి అన్ని స్థాయిల్లో శిక్షణ ఇవ్వాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని