TS News: కొవిడ్‌ తగ్గుముఖం
close
Updated : 27/05/2021 07:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: కొవిడ్‌ తగ్గుముఖం

ఇప్పటికే గణనీయంగా తగ్గిన వైరస్‌ సంక్రమణ

జూన్‌ 30కి అదుపులోకి రావొచ్చు
బ్లాక్‌ ఫంగస్‌కు ప్రత్యామ్నాయ ఔషధాలు
వైద్య ఆరోగ్యశాఖ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా జూన్‌ 30 నాటికి రాష్ట్రంలో కొవిడ్‌ పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో వైరస్‌ గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ఈ నెల మూడో వారంలో 6.01 శాతంగా కొవిడ్‌ పాజిటివ్‌ రేటు బుధవారం నాటికి 4.1 శాతానికి వచ్చిందని పేర్కొంది. ఈ నెలాఖరు నాటికి మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

దేశంలో కొవిడ్‌ పాజిటివ్‌ రేటు సగటు 8.1 శాతంగా నమోదవగా.. రాష్ట్రంలో పాజిటివ్‌ రేటు 3.82 శాతంగా ఉందని పేర్కొంది. ఈ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉండాలనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధన కంటే రాష్ట్రంలో తక్కువగా నమోదవడం గుర్తించాలని తెలిపింది. కోఠిలోని ఆరోగ్య కార్యాలయంలో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు.
* రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను రోజుకు లక్ష, లక్షన్నర నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. లక్షణాలున్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలినవారికి అక్కడే ఉచితంగా ఔషధ కిట్లనూ అందజేస్తారు.
* పీహెచ్‌సీ మొదలుకొని బోధనాసుపత్రుల దాకా 1,518 ప్రత్యేక కొవిడ్‌ ఓపీ కేంద్రాలను నిర్వహిస్తున్నాం. మొత్తం 33 జిల్లాల్లోనూ ఈ నెల 6 నుంచి బుధవారం వరకు మొత్తం 13,05,793 మందిని పరీక్షించి,  వీరిలో 2,57,277 మందికి కొవిడ్‌ లక్షణాలున్నట్లు గుర్తించారు. వీరికి నిర్ధారణ పరీక్షలతో సంబంధం లేకుండానే ఔషధ కిట్లను అందజేశారు.
* రాష్ట్రంలో మొదటి దశ జ్వర సర్వే పూర్తయింది. ఇందులో 33,374 బృందాలు పాల్గొన్నాయి. 1,01,28,711 ఇళ్లలో వ్యక్తులను పరీక్షించారు. వీరిలో 2,18,698 మందిలో కొవిడ్‌ తరహా లక్షణాలు కనిపించడంతో వీరికి ఇళ్ల వద్దనే ఔషధ కిట్లను పంపిణీ చేశారు. రెండోదశ ఇంటింటి సర్వే కూడా ప్రారంభమైంది. ఇందులో 17,089 బృందాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 55,05,417 మందిని  పరీక్షించి, 97,567 మంది లక్షణాలున్న వారిని గుర్తించి ఔషధ కిట్లను అందజేశారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఇంటింటి సర్వేల్లో తెలంగాణ రెండు వారాల ముందుంది.
* అన్ని బోధనాసుపత్రుల్లోనూ పోస్ట్‌ కొవిడ్‌ ఓపీలను ప్రారంభించాం. మ్యూకర్‌ మైకోసిస్‌ బాధితులకు త్వరితగతిన చికిత్స అందించేందుకు జిల్లాల్లోనే ఈఎన్‌టీ వైద్యులు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో 240 కంటే ఎక్కువ కేసులున్నాయి. రోజుకు 20 వరకూ సర్జరీలు చేస్తున్నారు. వీటి సంఖ్యను 30-40కి పెంచాలని నిర్ణయించాం. బ్లాక్‌ఫంగస్‌కు ప్రైవేటులో వినియోగించే ఔషధాల కొరత తీవ్రంగా ఉంది. ప్రత్యామ్నాయ ఔషధాలనూ వాడాలి. బ్లాక్‌ ఫంగస్‌  వల్ల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయనే ప్రచారంలోనూ వాస్తవం లేదు.

ఖాళీగా 31 వేల పడకలు..

‘‘రాష్ట్రంలో మొత్తం 55,120 కొవిడ్‌ పడకలు అందుబాటులో ఉండగా.. 31,375 పడకలు ఖాళీగా ఉన్నాయి. 4,589 ఐసీయూ పడకలు, 9,718 ఆక్సిజన్‌ పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 23,745 మందిలో 40 శాతం మంది ఇరుగు, పొరుగు రాష్ట్రాల వారున్నారు. ఆసుపత్రుల్లో చేరికలు తగ్గుతున్నాయి. ఇదే సమయంలో కోలుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.

ఇది టీకా లెక్క...
రాష్ట్రంలో ఇప్పటికే 56 లక్షల మందికి కొవిడ్‌ టీకాలను పంపిణీ చేశాం. ప్రస్తుతం 6.18 కొవిషీల్డ్‌ డోసులు అందుబాటులో ఉండగా.. జూన్‌ మొదటి వారంలో మరో 3.35 లక్షలు రానున్నాయి. కొవాగ్జిన్‌ టీకాలు 2.50 లక్షలు అందుబాటులో ఉండగా.. వచ్చే వారంలో మరో 2.50 లక్షలు వస్తాయి. మరో 5 లక్షల డోసులు జూన్‌లో రానున్నాయి.

వాహకులకు ముందుగా...

జనబాహుళ్యంలో తిరుగుతూ కొవిడ్‌ ముప్పు ఎక్కువ ఉన్నవారికి టీకాలు ఇచ్చేందుకు వారున్న ప్రాంతాల్లోనే ప్రత్యేక కేంద్రాలను నెలకొల్పుతాం. ముందుగా 7.75 లక్షల మందికి టీకాలను అందించనున్నాం. తొలుత జీహెచ్‌ఎంసీలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో టీకాలను పంపిణీ చేస్తాం.

ఏ రంగాల వారు ఎంతమంది?
* రేషన్‌ షాపు డీలర్లు, సహాయకులు: 33,980
* ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు, కార్మికులు: 49,616
* భారత ఆహార సంస్థ ఉద్యోగులు: 1,435
* ఫెర్టిలైజర్లు, పెస్టిసైడ్‌ దుకాణదారులు, పనిచేసేవారు: 30వేలు
* ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా: 20వేలు
* ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు: 3 లక్షలు
* కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపలు, చికెన్‌ విక్రయదారులు.. వీధి వ్యాపారులు.. సెలూన్లలో పనిచేసేవారు.. కిరాణా దుకాణదారులు, అందులో పనిచేసేవారు.. మద్యం దుకాణాల్లో పనిచేసేవారు: సుమారు 3 లక్షల మంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని