LockDown: సడలింపు పెంపు
close
Updated : 31/05/2021 07:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

LockDown: సడలింపు పెంపు

ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
ఇళ్లకు చేరేందుకు మరో గంట వెసులుబాటు  
లాక్‌డౌన్‌ పది రోజులు కొనసాగింపు
ఏడు వైద్య కళాశాలలకు ఆమోదం
ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్లకు పచ్చజెండా
ధాన్యం సేకరణలో కేంద్ర వైఖరిపై అసంతృప్తి.. ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయం
విదేశాలకు వెళ్లే విద్యార్థులకు కరోనా టీకాలు
మంత్రిమండలి నిర్ణయం
ఈనాడు - హైదరాబాద్‌

పాజిటీవిటీ రేటు మరింత తగ్గితే లాక్‌డౌన్‌ ఎత్తివేత
కరోనా ఉద్ధృతి వల్ల లాక్‌డౌన్‌ విధించాం. దాన్ని ఎత్తివేయాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు, వినతులు వస్తున్నాయి. జీవనోపాధి సమస్యల దృష్ట్యా తమ గురించి ఆలోచించాలని ప్రధానంగా చిరువ్యాపారులు, పేదలు కోరుతున్నారు. అయితే వెంటనే ఎత్తివేసే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ వల్ల కరోనా పాజిటివిటీ రేటు 29 నుంచి 9.5 శాతానికి వచ్చింది. ఇలాగే కట్టడి కొనసాగితే అది 5 శాతానికి తగ్గుతుంది. అప్పుడు లాక్‌డౌన్‌ ఎత్తివేస్తాం.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌
 

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి మరో పది రోజుల (జూన్‌ 9) పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. బయట ఉన్నవారు ఇళ్లకు చేరడానికి మరో గంట అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు వెసులుబాటు కల్పించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మర్నాటి ఉదయం 6 వరకు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఆదేశించింది. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయంది. ఏడు కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లకు అనుమతించింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వెంటనే కరోనా టీకాలు ఇవ్వాలని సూచించింది. ధాన్యం సేకరణను పూర్తిగా చేపట్టకుండా తెలంగాణ పట్ల కేంద్రం అవలంబిస్తున్న వైఖరిపై చర్చించిన మంత్రిమండలి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా కట్టడిలో భాగంగా మే 12 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపులున్నాయి. అయితే కరోనా కేసుల్లో తగ్గుదల ఉన్నా.. వ్యాధి నియంత్రణ ఆశించిన స్థాయిలో లేనందున లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, సడలింపు సమయాన్ని పెంచాలని మంత్రి మండలి నిర్ణయించింది. మినహాయింపులున్నవారు తప్ప లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలెవ్వరూ బయట తిరగకుండా కఠిన ఆంక్షలు అమలుచేయాలని మంత్రిమండలి డీజీపీని ఆదేశించింది. కరోనా నిబంధనలను పాటిస్తూ రాష్ట్రావతరణ వేడుకలను అతి తక్కువ మందితో జరుపుకోవాలన్నారు. ప్రగతిపథంలో ముఖ్యమంత్రి, ఆయా జిల్లాల్లో మంత్రులు అమరవీరులకు నివాళులర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించింది.
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సరిహద్దు ప్రాంతాలైన ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఆలంపూర్‌, గద్వాల, నారాయణపేట, మక్తల్‌, నాగార్జునసాగర్‌, కోదాడ, హుజూర్‌నగర్‌ వంటి ప్రాంతాల్లో రాష్ట్రస్థాయి వైద్యాధికారులు పర్యటించాలని ఆదేశించింది. ఆయా ప్రాంతాల్లో కరోనా నియంత్రణకు తగు చర్యలను తీసుకోవాలంది. రాష్ట్రంలోని అన్ని ఏరియా, జిల్లా, తదితర దవాఖానాల పరిస్థితులను సమీక్షించి అన్నిరకాల మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలంది.
కరోనా మూడో దశ వస్తుందనే సమాచారంపై వైద్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని, తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.
కొవిడ్‌ కారణంగా రాష్ట్రం కోల్పోతున్న ఆదాయాన్ని సమీకరించుకునేందుకు కొత్తచర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ, గృహనిర్మాణ సంస్థ ఆధీనంలోని భూములు, ఇళ్ల అమ్మకం కోసం తక్షణమే చర్యలను ప్రారంభించాలని నిర్దేశించింది.

16కు చేరిన ప్రభుత్వ వైద్యకళాశాలలు

మహబూబాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మంచిర్యాలలో కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలను నెలకొల్పేందుకు అనుమతించింది. ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలల్లో నర్సింగ్‌ కళాశాలలు లేని చోట వాటిని మంజూరు చేసేందుకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ప్రస్తుతం 9 వైద్య కళాశాలలుండగా కొత్తవాటితో ఈ సంఖ్య 16కి చేరుతుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో బీబీనగర్‌ ఎయిమ్స్‌, సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ వైద్యకళాశాలున్నాయి. ప్రైవేటు రంగంలో మరో 23 ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రంలో వైద్యకళాశాలల సంఖ్య 41కి చేరనుంది.

87 శాతం ధాన్యం సేకరణ పూర్తి

ధాన్యం దిగుబడి పెరుగుతున్నందున నూతన రైస్‌ మిల్లుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రిమండలి ఆదేశించింది. ఇప్పటికే 87 శాతం ధాన్యం సేకరణ జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలని పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. వరిధాన్యంలో సన్నాలకు మార్కెట్‌లో డిమాండు ఉంటుందనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. పొరుగు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యానికి డిమాండు తగ్గుతున్న నేపథ]్యంలో వరి కన్నా భవిష్యత్తులో పత్తికే ఎక్కువ లాభాలొస్తాయని మంత్రిమండలి అంచనా వేసింది. కందులకున్న డిమాండు నేపథ్యంలో ఆ పంటను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖకు సూచించింది.  
వానాకాలం సీజన్‌ మొదలవుతున్న నేపథ్యంలో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ అన్ని విధాలుగా సన్నద్ధం కావాలంది. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
రాష్ట్రంలోకి రుతుపవనాల రాక నేపథ్యంలో వరినాట్లు కాకుండా వెదజల్లే పద్ధతిని అవలంబించాలని రైతాంగానికి కేబినెట్‌ పిలుపునిచ్చింది. గతేడాది  మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని సంతృప్తి వ్యక్తం చేసింది. భూసారాన్ని పెంచడానికి ప్రత్యేక దృష్టి సారించాలంది. వ్యవసాయం విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ శాఖలో రెండు అదనపు సంచాలకుల పోస్టులను మంజూరు చేసింది.
రాష్ట్రంలో రైతుబంధు సమితులను కార్యాచరణలోకి తేవాలని, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొంది. రైతుబంధు సంఘాల అధ్యక్షులు, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఇందులో పాల్గొనాలని కోరింది.  
రాష్ట్రంలో ఆహారశుద్ధి యూనిట్ల కోసం తొమ్మిది నుంచి పది క్లస్టర్లను ఎంపిక చేయాలని, కొత్త జోన్ల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తించాలని పేర్కొంది.

విదేశాలకు వెళ్తున్న విద్యార్థులకు టీకాలు

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టీకాలు వేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. విద్యార్థులు 45 ఏళ్ల లోపు వారు కావడంతో వారికి ఇంకా టీకాల కార్యక్రమం ప్రారంభం కాలేదు. అయితే విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మినహాయింపు ఇచ్చింది. ఈ విషయమై తగిన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.
రైతుబంధు ఆర్థిక సాయాన్ని జూన్‌ 15 నుంచి 25 వరకు అందించాలని, యాసంగిలో లాగే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదించింది. జూన్‌10ని కటాఫ్‌గా పెట్టుకుని, పార్ట్‌ బి నుంచి పార్ట్‌ ఏ లోకి మారిన భూముల వివరాలను పరిగణనలోకి తీసుకోవాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలను ఆదేశించింది.

మామునూరులో జైలు
వరంగల్‌లోని సెంట్రల్‌ జైలును తరలించి దాని స్థానంలో మల్టీసూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు అంగీకారం తెలిపింది. మామునూరులో అత్యాధునిక సౌకర్యాలతో విశాలమైన జైలును నిర్మించాలని నిర్ణయించింది. ఖైదీలను అనువైన ఇతర ప్రాంతానికి తరలించి ఆ స్థలాన్ని నెలలోపు వైద్యశాఖకు అప్పగించాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి నిర్మాణ ప్రతిపాదనలను వచ్చే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టాలని సూచించింది.
రాష్ట్రంలో అమల్లో ఉన్న బీసీ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాల పాటు పొడిగించే ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలిపింది.
మాజీ ప్రధానమంత్రి పీవీ శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా నెక్లెస్‌ రోడ్డుకు (5.5 కిమీ) పీవీ నరసింహారావు (పీవీఎన్‌ఆర్‌) మార్గ్‌గా నామకరణం చేసేందుకు అనుమతించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని