Supreme Court: టీకాల విధానంలో ఇన్ని లోపాలా!
close
Updated : 01/06/2021 07:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Supreme Court: టీకాల విధానంలో ఇన్ని లోపాలా!

రకరకాల ధరల వెనుక హేతుబద్ధతను చెప్పండి
థర్డ్‌ వేవ్‌ ఎదుర్కొనే వ్యూహం ఏమిటి?  
కరోనా బాధలు చెబితే కేసులా?
కేంద్రంపై సుప్రీంకోర్టు అసంతృప్తి

దిల్లీ

నిజాలు చెప్పినా కేసులా?

సమస్యలను సామాజిక మాధ్యమాల ద్వారా చెబుతున్న వారిపై క్రిమినల్‌ కేసులు పెడుతుండడాన్ని తప్పుపట్టింది. కరోనా కారణంగా మృతి చెందిన వ్యక్తి శవాన్ని నదిలో విసిరివేస్తున్న వైనాన్ని ప్రచారం చేసిన టీవీ ఛానల్‌పైనా దేశద్రోహం కేసు పెడతారా ఏమిటి? అని వ్యాఖ్యానించింది. వీటన్నింటికీ రెండు వారాల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న టీకాల విధానంలో పలు లోపాలు ఉన్నాయని సుప్రీంకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రానికి సూటిగా ప్రశ్నలు వేసింది. ధరల్లో తేడాలు, టీకాల కొరత, గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం తదితర అంశాలను ప్రస్తావించింది. మందులు, టీకాలు, ఆక్సిజన్‌ సరఫరాపై తనకుతానుగా కేసు విచారిస్తున్న న్యాయస్థానం.. అధికార యంత్రాంగం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసును జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. కరోనా మూడో అల (థర్డ్‌ వేవ్‌)లో పిల్లలు, గ్రామీణ ప్రాంతాల వారు అధికంగా ప్రభావితమవుతారన్న వార్తలు వస్తున్నాయని, దీనిపై ఏమైనా అధ్యయనం చేశారా? అని ప్రశ్నించింది. ఇందు కోసం అనుసరించనున్న వ్యాక్సిన్‌ విధానం ఏమిటని అడిగింది.
క్షేత్ర స్థాయి వాస్తవాలను గమనించాలి
విధానరూపకర్తలు క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. టీకాల కోసం కొవిన్‌ యాప్‌లో నమోదు చేయించుకోవాలన్న నిబంధనను ప్రశ్నించింది.  మారుమూల ప్రాంతాల వారికి, వలస కార్మికులకు ఈ డిజిటల్‌ సౌకర్యం ఉంటుందా అని అడిగింది. ఇందుకు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం చెబుతూ గ్రామీణ ప్రాంతాల్లోని కమ్యూనిటీ సెంటర్ల ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఇది ఆచరణ సాధ్యమేనా అని ప్రశ్నించింది. కోర్టు సహాయకురాలు (అమికస్‌ క్యూరీ)గా వ్యవహరిస్తున్న మల్లికా అరోడా ఓ ఉదాహరణ చెబుతూ ‘‘కొవిన్‌లో పేరు నమోదు చేసుకుంటే ప్రయివేటు ఆసుపత్రి నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఒకరికి టీకా వేయడానికి రూ.900 చెల్లించాలని అడిగారు. ఈ లెక్కన ఒక కుటుంబానికి పెద్ద మొత్తమే ఖర్చవుతుంది’’ అని అన్నారు.  
రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లకు వెళ్లడం ఏమిటీ?
వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు గ్లోబల్‌ టెండర్లను ఎందుకు పిలుస్తున్నాయని ప్రశ్నించింది.  18-44 ఏళ్ల వారికి టీకాల వేసే బాధ్యతను కొంతవరకు రాష్ట్రాలకు అప్పగించారని, ఇందుకు హేతుబద్ధత ఏమిటని ప్రశ్నించింది. కరోనా రెండో ఉద్ధృతిలో ఈ వయసుకు చెందిన వారే ఎక్కువగా మరణిస్తున్నట్టు గుర్తు చేసింది. టీకాలకు రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ ధర చెల్లించాలి? ధరలను తయారీ సంస్థలే ఎందుకు నిర్ణయించుకోవాలి? వంటి ప్రశ్నలను సంధించింది.
విధాన పత్రాన్ని సమర్పించండి
విధానపరమైన విషయాల్లో కోర్టులకు పరిమితమైన అధికారమే ఉంటుందని మెహతా చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘మేమేమీ విధానాన్ని రూపొందించడం లేదు. పలు సమస్యలను ప్రస్తావిస్తూ ఏప్రిల్‌ 30న ఉత్తర్వులు ఇచ్చాం. పరిస్థితులకు తగ్గట్టు మార్చుకోవాలి. కేంద్రంలో ఉన్నాం, సరయినదేదో మాకు తెలుసు అని చెప్పలేరు. మా చేతులు పెద్దవే. ప్రజాభిప్రాయాన్ని వినడానికి కోర్టులు ఒక వేదిక’’ అని తెలిపింది. ‘‘రాష్ట్రాలు, నగర పాలక సంస్థలు వ్యాక్సిన్లు కొనుగోలు చేయడానికి వీలు కలిగించడం కేంద్రం విధానంలో భాగమా? ఇందుకు కేంద్రమే సమన్వయకర్తగా వ్యవహరిస్తుందా? దీనిపై స్పష్టత ఇవ్వాలి. దీని వెనుక ఉన్న హేతుబద్ధతను చెప్పాలి.  ఈ విషయాలన్నింటినీ వివరించే విధాన పత్రమేదీ ఇంతవరకు మాముందుకు రాలేదు. దీన్ని చూడాలని అనుకుంటున్నాం’’ అని పేర్కొంది.


రెండు ధరల విధానం ఎందుకు?

టీకాలపై రెండు ధరల విధానాన్ని ఎందుకు అవలంబిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని సూచించింది. ‘‘ఇది ప్రధానమైన సమస్య. రాజ్యాంగంలోని 1వ అధికరణం ప్రకారం దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వమే టీకాలు సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. రాష్ట్రాలను నిస్సహాయ స్థితిలో విడిచపెట్టకూడదు. ఈ విధానం వల్ల రాష్ట్రాల మధ్య పోటీ పెంచినట్టయింది’’ అని వ్యాఖ్యానించింది. దీనికి కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం ఇస్తూ రాష్ట్రాలు పోటీ పడేటట్టు చూస్తున్నారన్నది సరికాదని అన్నారు. టీకాల తయారీదార్లతో కేంద్రమే చర్చలు జరిపిందని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని