Vaccine: టీకాల విధానం ఏకపక్షం
close
Updated : 03/06/2021 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: టీకాల విధానం ఏకపక్షం

కొందరికి ఉచితం, మరికొందరికి చెల్లింపు పద్ధతి ఏమిటి?
ఇది హేతుబద్ధంగా లేదు.. మళ్లీ సమీక్షించండి
రూ.35,000 కోట్లు ఎలా ఖర్చు చేశారో చెప్పండి
కేంద్రంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ‘చెల్లింపు టీకాల విధానం’ నిరంకుశం, అహేతుకం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 45 ఏళ్లు పైబడ్డవారికి ఉచితంగా, 18-44 ఏళ్ల వయసు వారికి చెల్లింపు ప్రాతిపదికన కరోనా టీకాలు ఇస్తుండడం అసంబద్ధమని ఆక్షేపించింది. ఆ విధానాన్ని మళ్లీ సమీక్షించాలని ఆదేశించింది. వ్యాక్సిన్ల కోసం కేటాయించిన రూ.35,000 కోట్లను ఇంతవరకు ఎలా ఖర్చు చేశారో వివరాలు తమకు సమర్పించాలని ఆదేశించింది. కరోనాను ఎదుర్కోవడంపై తనకు తానుగా కేసు విచారిస్తున్న జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ల ప్రత్యేక ధర్మాసనం వివిధ అంశాలపై కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత లోతుగా సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించింది. పలు ఘాటైన వ్యాఖ్యలు చేసింది.  సరళీకరించిన టీకాల విధానం; కేంద్రానికి, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు ఇచ్చే టీకాలకు వేర్వేరు ధరలను నిర్ణయించడం; దానికి ఉన్న ప్రాతిపదిక, స్లాట్‌ బుకింగ్‌ కోసం కొవిన్‌ యాప్‌లో పేరు నమోదును తప్పనిసరి చేయడం వంటి అంశాలపై శరపరంపరగా ప్రశ్నలు సంధించింది. ఒక్కొక్క అంశానికి విడివిడిగా సమాధానాలు ఇవ్వాలంది. సోమవారం 32 పేజీల్లో ఇచ్చిన ఈ ఆదేశాలను బుధవారం సర్వోన్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ‘‘మొదటి ఉద్ధృతి సమయంలో ఇతర వ్యాధులతో సతమతం అవుతున్నవారికి, వివిధ లోపాలున్నవారికి టీకాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. సరళీకృత విధానంలో అలాంటి ప్రాధాన్యాలేమీ లేవు. వైరస్‌ మార్పులు చెందుతుందని, అది 18-44 ఏళ్ల వారికి ముప్పుగా మారుతుందని కొవిడ్‌ రెండో ఉద్ధృతి నిరూపించింది. శాస్త్రీయ ప్రాతిపదికన వేర్వేరు వయో వర్గాల మధ్య ప్రాధాన్యాలు కొనసాగించాల్సి ఉన్నా 18-44 ఏళ్ల వారికీ టీకాలు వేయాలి’’ అని ధర్మాసనం పేర్కొంది.

ఫైల్‌ నోటింగ్స్‌ కూడా ఇవ్వండి
టీకాల విధానానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.. అందుకు తగ్గ ఫైల్‌ నోటింగ్స్‌ను కూడా జత చేయాలని సూచించింది. ఇప్పటివరకు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, సుత్నిక్‌-వి టీకాల కొనుగోలుకు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాలంది. ‘వ్యాక్సిన్ల సేకరణ కోసం కేంద్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ.35వేల కోట్లలో ఇంతవరకు ఎంత ఖర్చు చేశారు? 18-44 ఏళ్ల వారికి టీకాలు ఇవ్వడానికి ఈ నిధులను ఎందుకు ఉపయోగించకూడదు?’ అని ప్రశ్నించింది.

ఎందరికి వ్యాక్సిన్లు వేశారు?
‘ఈ ఏడాది చివరి నాటికి ఎన్ని డోసుల టీకాలు వస్తాయని అంచనా వేస్తున్నారు? ఇందుకు సంబంధించిన మార్గసూచి ఏమిటి? మూడు దశలుగా జరిగిన టీకాల కార్యక్రమంలో వ్యాక్సిన్లు వేయించుకోవడానికి ఎంత మంది అర్హత పొందారు? జనాభాలో ఎంత శాతం మందికి టీకాలు వేశారు? వీరిలో ఒక డోసు పొందినవారు ఎందరు? రెండు డోసులు పొందినవారు ఎందరు? గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎందరికి వేశారు? ఈ మూడు దశల్లోనూ టీకాలు పొందని వారికి ఎప్పుడు, ఏ విధంగా వ్యాక్సిన్లు ఇస్తారు?’ అని ప్రశ్నించింది.

ఉచితంగా వేస్తామని రాష్ట్రాలూ ప్రమాణ పత్రాలు ఇవ్వాలి
‘ప్రజలకు ఉచితంగా టీకాలు వేస్తామని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రకటించినట్టు మే 9న సమర్పించిన ప్రమాణ పత్రంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయాన్ని అంగీకరిస్తున్నామనో, తిరస్కరిస్తున్నామనో రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు స్పష్టం చేయాలి. ప్రజానీకానికి ఉచితంగా టీకాలు వేస్తామని చెబితే ఆ విధాన పత్రాన్ని కోర్టుకు సమర్పించే ప్రమాణ పత్రంతో జత చేయాలి. అప్పుడే ఉచితంగా టీకా లభిస్తుందన్న ధీమా ప్రజల్లో కలుగుతుంది’ అని పేర్కొంది.

కోర్టులు మౌన ప్రేక్షకులు కావు

‘‘కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకునే నిర్ణయాల కారణంగా పౌరుల రాజ్యాంగపరమైన హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు మౌన ప్రేక్షకులుగా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. వ్యవస్థల మధ్య అధికారాల విభజన జరిగినంత మాత్రాన విధానాలపై న్యాయసమీక్ష నిర్వహించే హక్కు న్యాయవ్యవస్థకు లేదని అనలేరు. ఇలాంటి సమీక్ష చేసి, రాజ్యాంగపరమైన న్యాయ ఔచిత్యాన్ని తేల్చడం న్యాయస్థానాలకు ఉన్న కీలకమైన విధి’’ అని పేర్కొంది. ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి వ్యాక్సిన్ల లభ్యతపై మార్గసూచిని స్పష్టం చేయాలని ఆదేశించింది. మూడో ఉద్ధృతి వచ్చినట్లయితే పిల్లల అవసరాల రీత్యా ఎలాంటి సన్నద్ధతతో ఉన్నారో కూడా తెలపాలంది. సమాధానాలు చెప్పడానికి రెండు వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని