CJI: మధ్యవర్తిత్వమే ఉత్తమం
close
Updated : 18/07/2021 07:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CJI: మధ్యవర్తిత్వమే ఉత్తమం

సంధి కుదరకపోతే వినాశనమేనని కృష్ణ రాయబారం చాటింది
వివాదాలను విలాస వ్యాజ్యాలుగా కొందరు మార్చేశారు
అత్యాధునిక వ్యవస్థకు తెలంగాణ ముందుకు రావడం స్వాగతించదగ్గ పరిణామం
పెండింగ్‌ కేసులపై లెక్కలు.. అనాలోచిత విశ్లేషణ
సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ఈనాడు, దిల్లీ: రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మతపరమైన విభిన్న కారణాల వల్ల సమాజంలో సంఘర్షణలు అనివార్యంగా మారాయని, వాటి పరిష్కారానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ చెప్పారు. పరస్పర ఆమోదం, సహకారంతో వివాదాలను పరిష్కరించుకొనే సుదీర్ఘమైన సంస్కృతి భారత్‌తో పాటు, ఎన్నో ఆసియా దేశాలకు ఉందని తెలిపారు. శనివారం వీడియో సమావేశం ద్వారా ‘ఇండియా-సింగపూర్‌ మీడియేషన్‌ సమ్మిట్‌-2021’లో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘‘వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వాన్ని ఓ సాధనంగా ప్రయోగించిన ఉదాహరణ మహా భారతంలోనే ఉంది. కౌరవులు-పాండవుల మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి శ్రీకృష్ణుడు రాయబారం నెరిపే ప్రయత్నం చేశారు. మధ్యవర్తిత్వం విఫలమైతే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందని చెప్పడానికి అదో ప్రబల ఉదాహరణ’’ అని ఆయన పేర్కొన్నారు.

యథో ధర్మ... స్థతో జయ

‘‘బ్రిటిష్‌ వ్యవస్థ రావడానికి ఎంతోకాలం ముందే వివాదాల పరిష్కారం కోసం విభిన్నమైన మధ్యవర్తిత్వాలు అనుసరించిన చరిత్ర మనకు ఉంది. ఇదివరకు వివాదాలను సమాజ పెద్దలు పరిష్కరించేవారు. దేశంలో బ్రిటిష్‌ కోర్టు వ్యవస్థ ఏర్పాటైన తర్వాత అప్పటివరకు ఉన్న స్వదేశీ సామాజిక వివాద పరిష్కార వ్యవస్థ కనుమరుగైంది. మార్పులు చేర్పులతో బ్రిటిష్‌ న్యాయవ్యవస్థే ప్రస్తుత భారతీయ న్యాయ వ్యవస్థగా రూపాంతరం చెందింది. న్యాయవ్యవస్థ ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో ఉంది. వివాదాలను ఎదుర్కొనే శక్తిని అదే వారికి ఇచ్చింది. యథో ధర్మ, స్థతో జయ (ధర్మం ఎక్కడుంటే జయం అక్కడుంటుంది) అన్న నానుడికి జీవం పోసేలా కక్షిదారులకు సంపూర్ణ న్యాయం చేసే విస్తృతాధికారాలను రాజ్యాంగం న్యాయవ్యవస్థకు ఇచ్చింది.

నిన్న దాఖలు.. నేడు పెండింగ్‌..!

భారతీయ కోర్టుల్లో 4.5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తరచూ వింటున్నాం. ఇది అతిశయంతో కూడిన అనాలోచిత విశ్లేషణ. ఓ కేసు ఎన్నాళ్ల నుంచి పెండింగులో ఉందనేది తెలుసుకోకుండా అన్నింటికీ ‘పెండెన్సీ’ అనే పదాన్నే ఉపయోగిస్తున్నారు. నిన్న దాఖలైన కేసు ఈరోజు గణాంకాల్లో పెండింగ్‌ జాబితాలో చేరిపోతోంది. ఇది వ్యవస్థ మంచి-చెడులను విశ్లేషించేందుకు అనువైన సూచిక కాదు. కొన్ని కేసుల జాప్యంలో సహేతుకమైన కారణాలుంటాయి. వివాదం విలాసవంతం కావడమే అందులో ప్రధానమైంది. మంచి వనరులున్న కక్షిదారులు కొన్ని ప్రత్యేక వివాదాల్లో న్యాయవ్యవస్థను నిస్పృహకు గురిచేసే ప్రయత్నం చేస్తారు. రకరకాల ప్రొసీడింగ్స్‌ దాఖలుతో జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని గుర్తించాలి

మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కోణంలోనూ కేసులను చూడాలి. ఉన్నత న్యాయస్థానాల్లో పనిచేసే న్యాయమూర్తులు కేసుల ఉద్ధృతిని ఎదుర్కోవడానికి తరచూ అర్ధరాత్రి వరకూ పనిచేస్తున్న సందర్భాలుంటున్నాయి. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ ప్రజల్లో న్యాయ అవగాహన పెంచడంతోపాటు ప్రత్యామ్నాయ వేదికల ద్వారా వివాదాల పరిష్కారానికి ప్రయత్నిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా చట్టాల్లో నిరంతరం మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

ఆర్బిట్రేషన్‌ వ్యవస్థ గొప్ప సంస్కరణ

1996లో దేశంలో స్వేచ్ఛా వాణిజ్యం ప్రారంభమైన తర్వాత ఆర్బిట్రేషన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లయింది. న్యాయవ్యవస్థలో ప్రధానమైన సంస్కరణ ఇది. దీనివల్ల వివాద పరిష్కారంలో న్యాయవ్యవస్థ జోక్యాన్ని తగ్గించి, కక్షిదారులకు గరిష్ఠ స్వయంప్రతిపత్తి కల్పించడం సాధ్యమైంది. 2019లో మధ్యవర్తిత్వంపై జరిగిన సింగపూర్‌ సదస్సు.. భారత్‌కు ప్రస్తుత మధ్యవర్తిత్వ వ్యవస్థను తీసుకొచ్చింది. 2021 మార్చి వరకు పది లక్షల వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించగలిగారు.

కేసు స్వీకరించాలంటే మధ్యవర్తిత్వ ప్రయత్నం జరగాలి

భారత్‌లో మధ్యవర్తిత్వ వ్యవస్థ విజయవంతం కావాలంటే దాని చట్టబద్ధత, విశ్వసనీయత, ఆమోదయోగ్యత విషయాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. మధ్యవర్తిత్వానికి అవకాశాలు పెరుగుతున్నందున భారత్‌ ఈ విషయంలో మిషన్‌ మోడ్‌లో పనిచేయాలి. దీన్ని చౌకైన, వేగవంతమైన పరిష్కార మార్గంగా నిరూపించాలి. కోర్టులో ఏ కేసు స్వీకరించాలన్నా అంతకు ముందు మధ్యవర్తిత్వం ద్వారా దాన్ని పరిష్కరించే ప్రయత్నం తప్పనిసరిగా జరిగి ఉండాలన్న షరతు విధించాలి. ప్రస్తుతం ఉన్న శూన్యతను పరిష్కరించడానికి ఒక సంపూర్ణమైన చట్టం అవసరం. దేశంలో ఎక్కువమంది కక్షిదారులు మధ్యతరగతి, పేద వర్గాలేనని గుర్తించి, సమస్యల పరిష్కారం కోసం నమ్మకమైన మధ్యవర్తిత్వ వ్యవస్థను ఏర్పాటుచేస్తే వారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. కోర్టుల్లో కేసుల సంఖ్య తగ్గుతుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక ప్రత్యామ్నాయ పరిష్కార వేదిక ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇది స్వాగతించదగ్గ పరిణామం. మిగిలిన రాష్ట్రాలూ ఈ పంథాను అనుసరిస్తాయని ఆశిస్తున్నాను’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని