అన్నా.. ఎంత ఘోరం
close
Updated : 30/07/2021 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అన్నా.. ఎంత ఘోరం

ప్రమాదవశాత్తు బావిలో పడిన కారు
రిటైర్డ్‌ ఎస్సై జలసమాధి
సహాయక చర్యలకు వచ్చి సోదరుడి మృతదేహాన్ని చూసి భోరుమన్న అగ్నిమాపక అధికారి

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌: విధి ఆడిన వింత నాటకమిది.. ప్రమాదవశాత్తు ఓ కారు బావిలోకి దూసుకువెళ్లింది. అందులోని వ్యక్తి ఊపిరాడక మృతిచెందారు. అగ్నిమాపక శాఖ అధికారి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 9 గంటలపాటు శ్రమించి కారు వెలికి తీసి చూడగా అందులో ఉన్నది తన అన్నే అని గుర్తించి ఆయన భోరుమన్నారు. కరీంనగర్‌ జిల్లా చిగురుమామడి మండలం చిన్నముల్కనూర్‌ సమీపంలో బావిలో కారు పడడంతో చోటుచేసుకున్న హృదయ విదారకరమైన ఘట్టమిది. హన్మకొండ జిల్లా సూర్యానాయక్‌ తండాకు చెందిన విశ్రాంత ఎస్సై పాపయ్యనాయక్‌ (60) రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. కరీంనగర్‌లో స్థిరపడ్డారు.  గురువారం రాజీవ్‌ రహదారిపై ముల్కనూర్‌ వైపు వెళ్తుండగా ఆయన కారు అదుపుతప్పింది. రోడ్డు కుడివైపునకు వ్యతిరేక దిశలో దూసుకెళ్లింది. అక్కడ లోతైన బావి ఉంది. దాని పక్కన చిన్నపాటి కల్వర్టు రక్షణగా ఉన్నప్పటికీ వేగం వల్ల కారు అదుపులోకి రాక అడ్డుగా ఉన్న విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని మరీ బావిలో పడిపోయింది. పాపయ్యనాయక్‌ కారు తలుపులు తెరిచేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో కారుతో పాటే ఆయన జలసమాధి అయ్యారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు కారును వెలికితీసేందుకు అగ్నిమాపక శాఖ సహాయాన్ని కోరారు. మానకొండూర్‌ అగ్నిమాపక శాఖ అధికారిగా భూదయ్య నాయక్‌.. వెంటనే తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. 60 అడుగుల లోతున్న ఆ బావిలో నీళ్లు నిండుగా ఉండటంతో కారు పూర్తిగా మునిగిపోయింది. క్రేన్‌ సాయంతో బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పోలీసులతోపాటు గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి ఎట్టకేలకు ఉదయం 11 గంటల సమయంలో పడిన కారును రాత్రి 8 గంటల తరువాత వెలికితీశారు. బయటకు తీస్తుండగానే.. దానిని చూసి అగ్నిమాపకశాఖ అధికారి భూదయ్య మనసులో అనుమానం తలెత్తింది. అది తన సోదరుడిదేనని గుర్తు పట్టిన ఆయన లోపల ఉన్న తన సోదరుడు పాపయ్యనాయక్‌ మృతదేహాన్ని చూసి కుప్పకూలిపోయారు. ఇంతసేపు శ్రమపడినా సొంత అన్నను కాపాడుకోలేకపోయానంటూ ఆయన బోరున విలపించాడు. మృతిచెందిన పాపయ్య నాయక్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని