మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి
close
Updated : 03/08/2021 05:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి

కృష్ణా జలాల వివాదంపై తెలుగు రాష్ట్రాలకు సీజేఐ జస్టిస్‌ రమణ సూచన
న్యాయపరంగా వెళ్లాలనుకుంటే మరో ధర్మాసనానికి పంపిస్తానని వెల్లడి
రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా తీర్పు చెప్పలేనని ప్రకటన

ఈనాడు, దిల్లీ: ‘‘తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ సమస్యను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలి. ఇందుకు అవసరమైన సహకారం అందిస్తా. రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినైనందున ఈ విషయంలో తీర్పు ఇవ్వలేను’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సూచించారు. ఉభయ రాష్ట్రాల మధ్య 2015లో కుదిరిన జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తికి కృష్ణా జలాలను వాడుకునేందుకు జీవో ఇవ్వడం అన్యాయమని, నీటి విడుదలతో దిగువ రాష్ట్రమైన తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.  ఈ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు సోమవారం విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభంకాగానే సీజేఐ ఎన్‌.వి.రమణ జోక్యం చేసుకున్నారు.

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ: మీకు తెలుసు నేను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని. మధ్యవర్తిత్వం ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ కోరుకుంటే సమాఖ్య వ్యవస్థలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని వివాదాన్ని పరిష్కరించే అంశాన్ని పరిశీలిస్తా. భారత ప్రభుత్వం, ఇతర వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. న్యాయపరంగానే పరిష్కరించుకోవాలని మీరు భావిస్తే ఈ విచారణ నుంచి తప్పుకొని మరో ధర్మాసనానికి బదిలీ చేస్తా. మధ్యవర్తిత్వానికి మీకు అంగీకారమైతే నేను విచారణ చేపడతా.. లేకుంటే తప్పుకొంటా. మీ అభిప్రాయాలు చెప్పండి.
వైద్యనాథన్‌ (తెలంగాణ తరఫు సీనియర్‌ న్యాయవాది): కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విచారణ అవసరం లేదు.
దుష్యంత్‌ దవే (ఆంధ్రప్రదేశ్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది): మీ (సీజేఐ) సూచనకు గౌరవపూర్వకంగా కట్టుబడి ఉంటా. అది అద్భుతమైన సలహా. వినయంతో దానిని అంగీకరిస్తున్నా. అయితే ఇది రాజకీయపరమైన అంశం కావడంతో ప్రభుత్వ ఆదేశాలు తీసుకుంటా.
సీజేఐ: అవును.. అది మంచిది.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకోండి.
దుష్యంత్‌ దవే: మేం 14న పిటిషన్‌ దాఖలు చేశాం. కేంద్ర ప్రభుత్వం 15వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసింది. జల బోర్డుల నియంత్రణ అక్టోబరు నుంచి ప్రారంభమవుతుంది. మేం నాలుగు నెలల కాలాన్ని నష్టపోతాం. అందువల్ల ఇప్పుడు నేను ఏమీ చెప్పదల్చుకోలేదు.
వైద్యనాథన్‌: ఇప్పుడు నీళ్లు ఎక్కువగా ఉన్నాయి.
సీజేఐ: చూడండి.. వైద్యనాథన్‌.. నీరు కొరత ఉన్నప్పుడే ఈ సమస్యలు వస్తాయి. నేను ఈ అంశాలపై వాదనలు వినిపించా.
దుష్యంత్‌ దవే: వైద్యనాథన్‌పై నాకు అపారమైన గౌరవం ఉంది. బహుశా మనం దీనిని పరిష్కరించుకోగలం. కానీ ఈశాన్యంలో ఏం జరిగిందో చూడండి. తప్పకుండా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలి. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజలను మనం చూడకూడదు.
సీజేఐ: దయచేసి అటువంటి ఘటనలను మనం కలలోనూ ఊహించవద్దు. మనమంతా సోదరులం. మీరిద్దరూ మీ ప్రభుత్వాలతో మాట్లాడి మధ్యవర్తిత్వానికి ఒప్పిస్తారని ఆశిస్తున్నా. అనవసరంగా జోక్యానికి మూడో పక్షాన్ని ఆహ్వానించవద్దని భావిస్తున్నా. మీరిద్దరూ కొంత సమయం తీసుకోండి. అందుకోసం వాయిదా వేస్తా.
వైద్యనాథన్‌: తప్పకుండా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళతాం.
దుష్యంత్‌ దవే: రేపటికి వాయిదా వేయండి.
వైద్యనాథన్‌: వారానికి వాయిదా వేయండి.
సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ: ఎల్లుండి సరేనా? (ఇద్దరు న్యాయవాదులూ అందుకు అంగీకరించారు.) మరోసారి చెబుతున్నా... ఈ విషయంలో న్యాయపరమైన విషయాల్లో జోక్యం చేసుకోను.
దుష్యంత్‌ దవే: మీరు అత్యున్నతంగా వ్యవహరించారు. పూర్తి వినయంతో మేం కట్టుబడి ఉంటాం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని