డిజిటల్‌ చెల్లింపుల్లో ఓచర్‌ విధానం
close
Updated : 03/08/2021 05:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డిజిటల్‌ చెల్లింపుల్లో ఓచర్‌ విధానం

‘ఈ-రూపీ’ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

దిల్లీ: డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభంగా, పారదర్శకంగా ఉండేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘ఈ-రూపీ’ విధానాన్ని... ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో ద్వారా ప్రారంభించారు. ప్రభుత్వం-లబ్ధిదారుల నడుమ మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించి; లక్షిత ప్రయోజనాలను నేరుగా వారికి అందించాలన్న యోచనతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానంలో నగదు ప్రమేయం ఉండదు. వ్యక్తులను నేరుగా కలవాల్సిన పనిలేదు. సేవలు పొందిన తర్వాత మొబైల్‌ ఫోన్‌కు వచ్చే క్యూఆర్‌ కోడ్‌ను చూపించినా, ఓచర్‌ నంబరును చెప్పినా సరిపోతుంది! సుపరిపాలనలో భాగంగా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ కొత్త విధానాన్ని అభివృద్ధి చేసింది. ఆర్థిక, ఆరోగ్య శాఖలతో పాటు నేషనల్‌ హెల్త్‌ అథారిటీ కూడా ఇందుకు తోడ్పాటు అందించాయి. ప్రస్తుతం ఆరోగ్య సేవల నిమిత్తం అందుబాటులోకి తెచ్చిన ఈ విధానాన్ని త్వరలోనే ఇతర విభాగాలకూ విస్తరించనున్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ- ‘‘దేశంలో డిజిటల్‌ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల అమలులో ఈ-రూపీ కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల అవకతవకలకూ చోటుండదు. ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా లబ్ధి చేకూరుతుంది. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల తరుణంలో ఈ-రూపీని తీసుకురావడం సంతోషంగా ఉంది.

ప్రభుత్వానికి రూ.1.78 లక్షల కోట్ల ఆదా

మహమ్మారి సమయంలో ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడానికి జామ్‌ (జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌) ఎంతో బాగా తోడ్పడింది. సంక్షోభ సమయంలో కోట్ల మందికి నగదు బదిలీ చేశాం. వంట గ్యాస్‌ సబ్సిడీ, రేషన్‌, పీఎం కిసాన్‌ యోజన, ఉపకార వేతనాలు తదితర సుమారు 300 పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ చేయడం ద్వారా రూ.1.78 లక్షల కోట్ల ప్రభుత్వ సొమ్ము ఆదా అయింది.

ఏం ప్రయోజనం అన్నారు..

టెక్నాలజీ మిషన్‌ గురించి ప్రభుత్వం చెప్పినప్పుడు... సాంకేతికత వల్ల ధనికులకే లాభం, పేదవాళ్లకు ఏం ప్రయోజనమని చాలామంది రాజకీయ నాయకులు, కొందరు నిపుణులు వ్యాఖ్యానించారు. వారి ఆలోచన విధానం తప్పని నేడు మన దేశం నిరూపించింది. 21వ శతాబ్దం... ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని, ప్రజలందర్నీ అనుసంధానిస్తూ అభివృద్ధి పథాన ముందుకు వెళ్తోందనేందుకు ఈ-రూపీయే ఉదాహరణ. పేదలకు సాయపడే, వారు అభివృద్ధి చెందేందుకు దోహదపడే సాధనంగా సాంకేతికతను మేం చూస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

ప్రస్తుతం 11 బ్యాంకుల్లో..

దేశంలో 11 బ్యాంకులు ఈ-రూపీ సేవలను అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, యాక్సిస్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలు ఈ ఓచర్లను జారీ చేయడంతోపాటు.. రిడీమ్‌ చేసుకునే సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నాయి. కెనరా, ఇండస్‌ ఇండ్‌, కోటక్‌ మహీంద్రా, ఇండియన్‌, యూనియన్‌ బ్యాంకులు ఈ-రూపీ కూపన్లను జారీ చేస్తున్నా, ప్రస్తుతానికి రిడీమ్‌ సదుపాయం కల్పించడం లేదు.


ఎలా పనిచేస్తుంది?

‘ఈ-రూపీ’... గూగుల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం వంటిది కాదు. ఈ విధానంలో ప్రభుత్వం లేదా సంస్థలు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఓచర్‌ నంబర్లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌కి పంపుతాయి. ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ ఓచర్ల వంటివి. బ్యాంకు ఖాతా, డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ లేకపోయినా ఈ ఓచర్లను వినియోగించుకోవచ్చు. సేవలు అందుకున్న అనంతరం... క్యూఆర్‌ కోడ్‌ను చూపించాలి. లేదంటే ఓచర్‌ కోడ్‌ను చెప్పాలి. ఓచర్లను కొనుగోలు చేసి, ఇతరులకు జారీచేసే వ్యక్తి కూడా... వాటి వినియోగాన్ని తెలుసుకోవచ్చు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని