చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు?
close
Published : 03/08/2021 04:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు?

మరియమ్మ కేసులో హైకోర్టు వ్యాఖ్య

ఈనాడు, హైదరాబాద్‌: చట్టాన్ని అమలు చేయాల్సిన వారు దాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారని పోలీసులను సోమవారం హైకోర్టు ప్రశ్నించింది. అధికారులను తొలగించినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగిరావంది. మరియమ్మ లాకప్‌డెత్‌కు సంబంధించి తాజా నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబరు 15కు వాయిదా వేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీసుస్టేషన్‌లో మరియమ్మ మృతిపై జ్యుడిషియల్‌ విచారణకు ఆదేశించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఆమె కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం ఇప్పించాలని పౌరహక్కుల సంఘం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం, రాచకొండ కమిషనర్‌ దాఖలు చేసిన కౌంటరును ధర్మాసనం పరిశీలించింది. మరియమ్మ కుమారుడిని చిత్రహింసలకు గురిచేయలేదని, సాధారణ గాయాలున్నట్లు డాక్టర్లు తమ నివేదికలో పేర్కొన్నారని తెలిపింది. మరియమ్మకు సంబంధించి రీపోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందంది. అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ ఆలేరు జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, జులై 2న రీపోస్టుమార్టం జరిగిందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రభుత్వ కౌంటరు ప్రకారం మే 27న సీసీటీవీల మరమ్మతులకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, ఈ సంఘటనలన్నీ జరిగాక జూన్‌ 25న మరమ్మతులు చేశారని ఈ మధ్య కాలంలో పోయిన ప్రాణాల సంగతేంటని, అధికారులను బయటికి పంపడం ద్వారా పోయిన ప్రాణాలను వెనక్కి తీసురాలేమంటూ... చర్యలేమైనా తీసుకున్నారా అని ప్రశ్నించింది. ఏజీ సమాధానమిస్తూ ఎస్సైతో సహా ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించామని, మరియమ్మ కుమారుడికి రూ.15 లక్షల పరిహారం చెల్లించామని, ఉద్యోగం కల్పించామని చెప్పగా ఇది పోయిన తల్లి ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సంఘటపై తాజా కౌంటరు దాఖలు చేయాలని, రీపోస్టుమార్టం నివేదిక అందాక స్థాయీ నివేదిక సమర్పించాలని ఆలేరు మొదటి తరగతి జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని