రాజధాని.. జాతి సామర్థ్య చిహ్నం
close
Published : 17/09/2021 04:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజధాని.. జాతి సామర్థ్య చిహ్నం

  ప్రధాని నరేంద్ర మోదీ

  దిల్లీలో రక్షణ శాఖ భవనాల ప్రారంభం

దిల్లీ: రాజధాని అంటే కేవలం నగరమే కాదని, దేశ సామర్థ్యానికి చిహ్నమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం ఇక్కడి కస్తూర్బా గాంధీ మార్గ్‌, ఆఫ్రికా అవెన్యూల్లో రక్షణ సిబ్బంది కోసం నిర్మించిన రెండు బహుళ అంతస్థుల భవనాలను ఆయన ప్రారంభించారు. 7,000 మంది రక్షణ శాఖ, సైనిక ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి వీలుగా వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘‘మనం రాజధాని గురించి మాట్లాడుకున్నప్పుడు అది కేవలం ఒక నగరం కాదు. ఏ దేశ రాజధాని అయినా అది ఆ జాతి ఆలోచన విధానం, అంకిత భావం, బలం, సంస్కృతికి నిదర్శనంగా ఉంటుంది. భారత దేశం ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది. అందువల్ల ప్రజలు కేంద్రీకృతంగా భారత రాజధాని ఉండాలి’’ అని చెప్పారు. సెంట్రల్‌ విస్టాలో భాగంగానే ఈ భవనాలు నిర్మించినట్టు ప్రధాని మోదీ చెప్పారు. ‘‘స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా నూతన భారతం అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా దేశ రాజధాని నిర్మాణంలో మరో అడుగు వేశాం. సైన్యం ప్రస్తుతం రెండో ప్రపంచ యుద్ధం కాలంనాటి గుడిసెల్లాంటి నిర్మాణాలు, నాటి గుర్రపుశాలల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందుకే ఆధునిక వసతులు కల్పిస్తున్నామ’’ని తెలిపారు. సెంట్రల్‌ విస్టా నిర్మాణం వృథా అని విమర్శలు చేస్తున్నవారు సైనికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై మౌనం వహిస్తున్నారని అన్నారు. వారి అబద్ధాలు బయటపడతాయనే దీనిపై ఏమీ అనడం లేదని విమర్శించారు. ఆధునికతతో పాటు భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా ఈ భవనాలను నిర్మించినందుకు అభినందించారు. 13 ఎకరాల స్థలంలోనే విశాలమైన భవనాలు నిర్మించారని చెప్పారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవాలకు పునర్నిర్మిత రాజ్‌పథ్‌ సిద్ధం

కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ మాట్లాడుతూ.. వచ్చే జనవరిలో గణతంత్ర దినోత్సవాలను పునర్నిర్మిత రాజ్‌పథ్‌లో నిర్వహించుకొనేలా సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రపతి భవన్‌ నుంచి ఇండియా గేట్‌ వరకు 3 కి.మీ.ల పొడవున ఉండే రాజ్‌పథ్‌ నిర్మాణ పనులన్నీ రెండున్నర నెలల్లో పూర్తవుతాయని తెలిపారు. 2022 పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా నూతనంగా నిర్మించే పార్లమెంటు భవనంలోనే నిర్వహించుకోవచ్చన్నారు.

మన్‌ కీ బాత్‌కు సలహాలివ్వండి

ప్రతి నెలా నిర్వహించే ‘మన్‌ కీ బాత్‌’లో ప్రస్తావించడానికి సూచనలు ఇవ్వాలని ప్రధాని మోదీ దేశ వాసులను కోరారు. ఈ నెల 26న జరగనున్న కార్యక్రమంపై సలహాలు ఇవ్వాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. నమో యాప్‌, మైగవ్‌ పోర్టల్‌ ద్వారాగానీ, లేదంటే రికార్డు చేసి 1800-11-7800 ఫోన్‌కు సందేశం ద్వారాగానీ అభిప్రాయాలు పంపాలని తెలిపారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని