అవమానం చాలు.. రాజీనామా చేస్తున్నా
close
Published : 19/09/2021 02:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవమానం చాలు.. రాజీనామా చేస్తున్నా

పంజాబ్‌ సీఎం అమరీందర్‌ నిర్ణయం

గవర్నర్‌కు లేఖ.. తక్షణ ఆమోదం

కార్యకర్తలతో చర్చించాక కార్యాచరణ

సిద్ధూ అసమర్థుడు.. ముఖ్యమంత్రిగా అంగీకరించలేను: కెప్టెన్‌

కొత్త నేతపై నిర్ణయాధికారం సోనియాకే: సీఎల్పీ

చండీగఢ్‌, దిల్లీ: అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ శనివారం సాయంత్రం తన పదవికి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌కు చేరుకుని తనతో సహా మంత్రులందరి రాజీనామా లేఖలను గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌కు సమర్పించారు. వాటిని గవర్నర్‌ తక్షణం ఆమోదించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. కీలకమైన కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశానికి ముందు అమరీందర్‌.. రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ‘సీఎల్పీని అధిష్ఠానం సమావేశపరచడం ఇది మూడోసారి. నేను ప్రభుత్వాన్ని నడపలేనని గానీ, మరేదైనా విషయంలో గానీ అధిష్ఠానానికి సందేహం ఉంటే అదినాకు అవమానమే. అందుకే రాజీనామా చేశా. అధినాయకత్వానికి ఎవరిపై విశ్వాసం ఉంటే వారిని ముఖ్యమంత్రిని చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను కాంగ్రెస్‌లోనే ఉన్నాను. మద్దతుదారులతో చర్చించాక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాను’ అని అమరీందర్‌ చెప్పారు.‘‘రాజీనామా గురించి శనివారం ఉదయం నిర్ణయించుకుని, పార్టీ అధ్యక్షురాలు సోనియాతో మాట్లాడి విషయాన్ని చెప్పాను. ఆమె స్పందిస్తూ ‘సారీ అమరీందర్‌’ అన్నారు’’ అని వివరించారు.

సిద్ధూపై నిప్పులు

‘‘సిద్ధూ అసమర్థుడు. అస్థిరుడు. ఒక్క మంత్రిత్వ శాఖనే నిర్వహించలేకపోయిన ఆయన్ని సీఎంని చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. ఆయన సీఎం కావడం పంజాబ్‌కు నష్టదాయకం. సిద్ధూ దేశ వ్యతిరేకి. ప్రమాదకర వ్యక్తి. ఓ పెద్ద విపత్తు. పాక్‌తో చేతులు కలిపిన ఆయన.. రాష్ట్రానికి, దేశానికి భద్రతాపరమైన ముప్పు. పాక్‌ ప్రధాని, సైన్యాధికారి విషయంలో సిద్ధూ ఏం చేశారో మనం చూశాం’’ అని అమరీందర్‌ తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సైనికునిగా దృఢంగా ఉన్న తాను రాజకీయాల నుంచి వైదొలగే ప్రశ్నే లేదన్నారు. ఎన్నికల్లో నెగ్గేందుకు పార్టీకి మంచి అవకాశాలు ఇటీవల వరకు ఉండేవన్నారు. సీఎల్పీ నేతనైన తననే శాసనసభాపక్ష సమావేశానికి పిలవలేదన్నారు. తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా కొనసాగిన తనను ఎందుకు మార్చాలనుకున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.

ఎన్నికలకు మరో ఐదు నెలలే

పంజాబ్‌ శాసనసభ పదవీకాలం మరో ఐదు నెలలే మిగిలిఉంది. పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూతో కెప్టెన్‌కు ఏమాత్రం పొసగక పరస్పరం నిప్పులు చెరుగుకుంటూ వస్తున్న తరుణంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. సీఎంను మార్చాలంటూ నలుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఇటీవల బాహాటంగానే డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. సీఎల్పీని శనివారం సాయంత్రం మరోసారి సమావేశపరచాలని శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్న అధిష్ఠానం.. తమ తరఫున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్‌ రావత్‌ను, సీనియర్‌ నేతలు- అజయ్‌ మకెన్‌, హరీశ్‌ చౌధరిలను ప్రతినిధులుగా చండీగఢ్‌కు పంపింది. వారి సమక్షంలో జరగాల్సిన ఆ సమావేశానికి హాజరు కాకూడదని అమరీందర్‌ నిర్ణయించుకున్నారు. అందుకే ముందే రాజీనామా చేశారు. తదుపరి సీఎం ఎవరనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాకు విడిచిపెడుతూ సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మానించింది. కొత్తనేత పేరు ఆదివారంఖరారు కావచ్చు.

అధికారం దక్కడంలో కీలక పాత్ర

పంజాబ్‌లో కాంగ్రెస్‌కు అధికారం దక్కడంలో అమరీందర్‌ కీలకపాత్ర పోషించారు. పదేళ్ల తర్వాత అధికారం దక్కడం కాంగ్రెస్‌లో అప్పుడు కొత్త ఆశలు రేకెత్తించింది. భాజపాను వదిలి వచ్చిన సిద్ధూను పీసీసీ అధ్యక్షుడిని, తర్వాత మంత్రిని చేశాక అంతర్గత కలహాలు ముదిరాయి.

నూతన పగ్గాలు ఎవరికో

నూతన సీఎం అయ్యే అవకాశాలు ముగ్గురికి ఉన్నాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్‌ జాఖడ్‌, తాజా మాజీ మంత్రి సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధ్వా, మాజీ సీఎం రాజేందర్‌ కౌర్‌ భట్టల్‌లలో ఒకరిని ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. సిద్ధూ పేరు కూడా వినవస్తోంది.

భాజపా నుంచి ఆహ్వానం!

చండీగఢ్‌: రాజీనామా చేసిన పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు ప్రధాని నరేంద్రమోదీతో సత్సంబంధాలున్నాయి. తమ పార్టీలోకి వచ్చి భాజపా సర్కారును ఏర్పాటు చేయాల్సిందిగా ఆ పార్టీ నేతలు కెప్టెన్‌ను ఆహ్వానిస్తున్నారు. పంజాబ్‌లో తాము అధికారంలోకి రాకుండా భాజపా, కాంగ్రెస్‌ అడ్డం పడాలనుకుంటున్నాయని ఆప్‌ నేతలు అమన్‌ అరోరా, హర్‌పాల్‌ చీమా ‘ఈటీవీ భారత్‌’కు చెప్పారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని