ఫైబర్‌నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్టు
close
Updated : 19/09/2021 03:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫైబర్‌నెట్‌ కేసులో సాంబశివరావు అరెస్టు

14 రోజుల రిమాండు విధించిన న్యాయస్థానం

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌)కు సంబంధించిన తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఐఆర్‌టీఎస్‌ అధికారి కోగంటి సాంబశివరావును సీఐడీ అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆయన అప్పట్లో.. ఆంధ్రప్రదేశ్‌ మౌలిక వసతుల సంస్థ (ఇన్‌క్యాప్‌) ఎండీగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఫైబర్‌నెట్‌ టెండర్ల వ్యవహారంపై ఈ నెల 9న కేసు నమోదవగా... 14న ఆయన తొలిసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. తర్వాత మూడురోజుల పాటు ఆయన్ను వివిధ అంశాలపై ప్రశ్నించింది. విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో శనివారం ఉదయం ఆయన విచారణకు హాజరయ్యారు. రెండు గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించిన దర్యాప్తు అధికారి.. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించి.. న్యాయస్థానంలో హాజరుపరిచారు. రాత్రి 9.30 గంటల సమయంలో ఆయనకు న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండు విధించారు. తొలుత మచిలీపట్నం కారాగారానికి, అక్కడి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి ఆయన్ను పంపడానికి చర్యలు చేపట్టారు. ఆయన్ను ఈ కేసులో విచారించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని సీఐడీ కోరింది. ‘టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టెండర్ల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రభుత్వాధికారిగా ఉంటూ ఈ కేసులోని ఇతర నిందితులతో కుమ్మక్కై, కుట్ర చేసి ప్రభుత్వ ఖజానాకు రూ.119.98 కోట్ల మేర నష్టం కలిగించారు. ఆయన అధికారిక హోదాను దుర్వినియోగం చేశారు...’ అని న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండు రిపోర్టులో సీఐడీ ఆర్థిక నేరాల విభాగం డీఎస్పీ ఎన్‌.నరేంద్ర పేర్కొన్నారు. అందులోని ఇతర ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి.

ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి

‘దర్యాప్తులో భాగంగా సాంబశివరావును ప్రశ్నించినప్పుడు.. కలవరపడుతూ, తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇచ్చారు. ఈ కేసులో ఆయన పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. తన చర్యలు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తాయని తెలిసే ఆయన అధికారిక దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఏ3గా ఉన్న టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుచిత లబ్ధి కలిగించారు. ప్రభుత్వాన్ని మోసగించేందుకు చేసిన కుట్రలో ఆయన పాలుపంచుకున్నారు. టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నాయకత్వంలోని కన్సార్షియం సమర్పించిన తప్పుడు పత్రాల్ని ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించారు. టెండర్ల ప్రక్రియతో సంబంధం ఉన్న సీనియర్‌ అధికారులు, ఇతర వ్యక్తులు.... టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు టెండర్ల కేటాయింపు వ్యవహారంపై అభ్యంతరాలు తెలిపినా వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఈ టెండర్ల కేటాయింపులపై ఫిర్యాదులు చేసిన వారిని బెదిరించి.. వాటిని ఉపసంహరించుకునేలా చేశారు. టెండరు దక్కించుకున్న తర్వాత ఆ సంస్థ నాయకత్వంలోని కన్సార్షియం నిబంధనల ప్రకారం పనులు చేయలేదు. అవసరమైన ధ్రువీకరణ చేపట్టలేదు. అయినా సరే వారు పెట్టిన బిల్లులకు నిధులు విడుదల చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు....’’ అని సీఐడీ రిమాండు రిపోర్టులో పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని