తెగేలా చెరువు గట్లు.. బతుకుడెట్లు?
close
Published : 28/09/2021 02:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెగేలా చెరువు గట్లు.. బతుకుడెట్లు?

వందల కాలనీల్లో బిక్కుబిక్కుమంటూ ప్రజలు
కొన్నేళ్లుగా అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి

ఈనాడు, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధాని నగరంలో భారీ వర్షం పడితే చాలు చెరువుల చెంత ఉన్న వేలాది కాలనీల ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. ఏడెనిమిది సెంటీమీటర్ల వర్షం ఏకబిగిన పడితే చాలు ఆయా తటాకాల కట్టలు తెగుతున్నాయి. మరి కొన్ని చెరువుల్లో కిందికి నీరు వెళ్లే దారిలేక కాలనీలను ముంచెత్తుతున్నాయి. మూడేళ్లుగా రాష్ట్ర రాజధానిలో ఇదే పరిస్థితి. వందల చెరువుగట్లు బలహీనంగా ఉన్నా, కొన్నేళ్లుగా అధికారులు వీటిని పటిష్ఠం చేయడంపై దృష్టి సారించక ఈ దుస్థితి తలెత్తింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరంలో లక్షల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఏ రాత్రి వేళ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని నిద్రకు దూరం అవుతున్నారు. గ్రేటర్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 185, హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో 3,132 చెరువులు ఉన్నాయి. వీటిలో చాలా చెరువులు వర్షాలకు నిండు కుండలను తలపిస్తున్నాయి. గత ఏడాది కట్ట తెగి నలుగురి మృతికి కారణమైన గగన్‌ పహాడ్‌ చెరువు కట్టకు ఇటీవల మరమ్మతులు చేశారు. ఈ పనులు ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో మళ్లీ కట్ట తెగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ ప్రస్తుత పరిస్థితి..

* జల్‌పల్లి బురాన్‌ఖాన్‌ చెరువు పూర్తిగా నిండి పొంగుతోంది. బాలాపూర్‌ వెళ్లే రహదారులన్నీ జలమయమయ్యాయి. ఏడు కాలనీల్లో 450 ఇళ్లు నీట మునిగాయి.

* రాజేంద్రనగర్‌ గగన్‌పహాడ్‌ సమీపంలోని అప్పా చెరువు అలుగు పారుతోంది. బెంగళూరు జాతీయ రహదారిపై నీరు పారుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

* హయత్‌నగర్‌లోని బాతుల చెరువు, కుమ్మరి కుంటలో భారీగా వరద నీరు చేరింది. ఇప్పటికే అంబేడ్కర్‌ బస్తీ సహా నాలుగు కాలనీల్లో వరద నీరు ప్రవహిస్తోంది. జీ స్కూల్‌ వద్ద చెరువు నీరు రహదారిపై పారుతోంది.

* మల్కాజిగిరిలోని బండ చెరువు నిండి సమీపంలోని షిరిడీ కాలనీ నీట మునిగింది. వంద ఇళ్లలో వరద నీరు చేరింది.

* జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్‌ సాగర్‌లోకి భారీగా వరద చేరింది. ఉమామహేశ్వర కాలనీలో 100కుపైగా ఇళ్లు మునిగాయి.

* మీర్‌పేట పరిధిలోని మంత్రాల చెరువు నిండి ఆర్‌సీఐ రహదారిపై వరద నీరు పారుతోంది. విమానాశ్రయానికి వెళ్లే రహదారిలో రెండు నుంచి 3 అడుగుల ఎత్తులో నీరు చేరింది.

* బండ్లగూడ చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. సమీపంలోని అయ్యప్ప కాలనీ, మల్లికార్జుననగర్‌కు ముంపు ముప్పు పొంచి ఉంది. వీధుల్లో వరద పారుతోంది. అవసరమైతే బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పడవలు సిద్ధం చేశారు. సమీపంలోని రెండు ఫంక్షన్‌ హాళ్లలో ఏర్పాట్లు చేశారు.

* సరూర్‌నగర్‌ చెరువు నిండితే సమీపంలోని 12 కాలనీలు మునిగే అవకాశం ఉంది.

* రామంతాపూర్‌లోని పెద్దచెరువు నుంచి నీటిని మోటార్లు పెట్టి చిన్న చెరువులోకి తోడేస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని