ప్రైవేటీకరణ ముసుగులో దేశాన్ని అమ్మేస్తున్నారు
close
Updated : 28/09/2021 09:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రైవేటీకరణ ముసుగులో దేశాన్ని అమ్మేస్తున్నారు

భారత్‌ బంద్‌ ధర్నాలో రేవంత్‌ విమర్శ

ఈనాడు- హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: ప్రైవేటీకరణ ముసుగులో ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్నే అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే రైతు వ్యతిరేక చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేయడంలేదంటూ ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలంతా నిరసిస్తూ, గళమెత్తితే ఇక్కడ బంద్‌లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాతో విందులో పాల్గొన్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, పెట్రో ధరల పెంపును నిరసిస్తూ సోమవారం చేపట్టిన భారత్‌ బంద్‌లో భాగంగా హైదరాబాద్‌ ఉప్పల్‌ బస్‌ డిపో వద్ద రేవంత్‌తో పాటు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం, ఇతర పార్టీలు, సంఘాల నేతలు ధర్నా చేశారు. రేవంత్‌ మాట్లాడుతూ ‘‘మేమిద్దరం.. మాకు ఇద్దరు అని గుజరాత్‌ నుంచి నలుగురు బయలుదేరారు. మోదీ, అమిత్‌షా ఒకవైపు.. అంబానీ, అదానీ మరోవైపు..  దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు.  కోర్టు ఆదేశాల మేరకు కరోనా బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి’’అని అన్నారు. ఉద్యోగాల కోసం కేసీఆర్‌ నోటిఫికేషన్లు విడుదల చేసేవరకు సాక పెట్టాలన్నారు. వరంగల్‌ జాతీయ రహదారిపై రేవంత్‌ అఖిలపక్ష నేతలతో కలసి బైఠాయించారు. పోలీసులు వారందరినీ ఉప్పల్‌ స్టేషన్‌కు తరలించారు. 

బంద్‌పై వర్ష ప్రభావం
భారత్‌బంద్‌లో భాగంగా కాంగ్రెస్‌, తెలుగుదేశం, వామపక్షాలు, తెలంగాణ జనసమితి, ఇంటిపార్టీ, న్యూడెమోక్రసీ తదితర పార్టీల నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తుపాను ప్రభావంతో సోమవారం తెల్లవారుజామునుంచి కురుస్తున్న వర్షాలు బంద్‌పై ప్రభావం చూపాయి. విద్యాసంస్థలకు ముందుగా సెలవు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా తిరిగాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పనిచేశాయి. జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో బంద్‌ నిర్వహించారు.

గుర్రపు బగ్గీపై భట్టి ర్యాలీ
సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క, మండలిలో విపక్షనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క సహా సీనియర్‌ నాయకులు మర్రి శశిధర్‌రెడ్డి గాందీభవన్‌ నుంచి అసెంబ్లీ వరకూ గుర్రపు బగ్గీపై ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపైనే బైఠాయించి రాస్తారోకో చేపట్టగా.. వారిని అరెస్టు చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించి, తర్వాత విడిచిపెట్టారు. ఈ సందర్భంగా గాంధీభవన్‌లో భట్టి విలేకరులతో మాట్లాడారు. తాము అసెంబ్లీకి ఏవిధంగా వెళ్లాలనేది సభ్యులుగా తమ ఇష్టమని, అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను తెరాస ఆమోదిస్తుందా, వ్యతిరేకిస్తుందా? స్పష్టం చేయాలని జీవన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, నాయకులు మల్లు రవి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రాంరెడ్డి హయత్‌నగర్‌ వద్ద విజయవాడ హైవేపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మేడ్చల్‌ వద్ద పొన్నాల లక్ష్మయ్య, ముంబయి హైవేపై దామోదర్‌ రాజనర్సింహా, బెంగళూరు జాతీయ రహదారిపై సంపత్‌కుమార్‌ రాస్తారోకోలు చేపట్టారు. 


కొనసాగిన ఆందోళనలు

* నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రొఫెసర్‌ కోదండరాంను లక్ష్యంగా చేసుకుని పోలీసులు బలప్రయోగం చేశారని తెజస ప్రధాన కార్యదర్శులు ధర్మ అర్జున్‌, బైరి రమేశ్‌లు విమర్శించారు. ఆయన దుస్తులు చించేసి అవమానించారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

* శంషాబాద్‌లో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు, తెలుగు మహిళ అధ్యక్షురాలు జ్యోత్స్న, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధర్నా చేపట్టారు. వారిని పోలీసులు శంషాబాద్‌ స్టేషన్‌కు తరలించారు. 

* అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ, కార్మిక సంఘాల నేతల ఆధ్వర్యంలో నారాయణగూడ నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ వరకూ ప్రదర్శన నిర్వహించారు.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని