Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘గాంధీ’లో చికిత్సలు!
close
Updated : 23/05/2021 10:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘గాంధీ’లో చికిత్సలు!

ఇప్పటికే 90కి చేరిన బాధితుల సంఖ్య
కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రికీ రోగుల తాకిడి

ఈనాడు, హైదరాబాద్‌-గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: కొవిడ్‌ రోగులకు చికిత్సలు అందించడంలో ముందున్న హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు.. ప్రస్తుతం బ్లాక్‌ఫంగస్‌ బాధితులకూ సేవలు అందించనున్నారు. ఇందుకు నేత్ర, ఈఎన్‌టీ, ప్లాస్టిక్‌ సర్జరీతో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటైంది. శనివారం ఓ బ్లాక్‌ఫంగస్‌ రోగికి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం గాంధీలో 90 మంది వరకు బ్లాక్‌ఫంగస్‌తో చేరినట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కోఠిలోని ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రికి కూడా రోగుల తాకిడి పెరిగింది. శనివారం నాటికి 127 మంది బ్లాక్‌ఫంగస్‌తో చేరారు. 9 మందికి శస్త్ర చికిత్సలు చేశారు. నగరంలోని ఇతర ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ బ్లాక్‌ఫంగస్‌ రోగులు చేరుతున్నారు. కోఠిలోని ఈఎన్‌టీ ఆసుపత్రిలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. వివిధ పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో రోగులను అంబులెన్సులో ఉస్మానియాకు పంపుతున్నారు.

కరోనా నివేదికతో పనిలేదు..
‘గాంధీ’కి వచ్చే బ్లాక్‌ఫంగస్‌ బాధితుల్లో కరోనా నెగెటివ్‌ ఉంటే చేర్చుకోవాలని తొలుత నిర్ణయించారు. కొవిడ్‌ నోడల్‌ కేంద్రం కావడంతో బాధితులు మళ్లీ కరోనా ఇన్‌ఫెక్షన్లకు గురికాకుండా ఈ విధానం పాటించారు. అయితే బ్లాక్‌ఫంగస్‌ రోగుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు విధివిధానాల్లో మార్పు చేశారు. కరోనా నివేదికతో సంబంధం లేకుండా బాధితులను చేర్చుకుంటున్నట్లు నోడల్‌ అధికారి డాక్టర్‌ ప్రభాకర్‌ తెలిపారు.

అందుబాటులోకి ఇంజక్షన్లు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో బ్లాక్‌ఫంగస్‌కు కోసం వాడే మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనాతోపాటు బ్లాక్‌ఫంగస్‌తో కలిపి ప్రస్తుతం 1,278 మంది గాంధీలో చికిత్స పొందుతున్నారు. డిశ్ఛార్జీలు పెరుగుతున్నాయని గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు.

దేశంలో మొత్తం 8,848 కేసుల నమోదు
- రాష్ట్రాలకు యాంఫోటెరిసిన్‌-బి వయల్స్‌ కేటాయించిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా 8,848 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులున్నట్లు కేంద్ర మంత్రి సదానందగౌడ వెల్లడించారు. వారి చికిత్స కోసం అన్ని రాష్ట్రాలకు కలిపి 23,680 యాంఫోటెరిసిన్‌-బి వయల్స్‌ కేటాయించినట్లు తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 910 మంది రోగుల కోసం 2,310, తెలంగాణలోని 350 రోగులకు 890 వయల్స్‌ కేటాయించారు. కేంద్రం విడుదల చేసిన డేటా ప్రకారం.. ప్రస్తుతం బ్లాక్‌ ఫంగస్‌ రోగులు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్‌ (రోగులు-2,281), మహారాష్ట్ర (2000), ఆంధ్రప్రదేశ్‌ (910), మధ్యప్రదేశ్‌ (720), రాజస్థాన్‌ (700), కర్ణాటక (500), తెలంగాణ (350), హరియాణా (250) ముందు వరుసలో ఉన్నాయి. 13 రాష్ట్రాల్లో ఒక్క కేసూ లేదు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని