దిల్లీ సూపర్‌
close
Updated : 29/04/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీ సూపర్‌

ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై విజయం
మెరిసిన పృథ్వీ
విలియమ్సన్‌ పోరాటం వృథా
20 ఓవర్లలో..  దిల్లీ 159/4...  హైదరాబాద్‌ 159/7
చెన్నై

వాహ్‌.. ఇదే కదా ఐపీఎల్‌ అంటే! ఇదే కదా టీ20 మజా అంటే! రెండు జట్లతో విజయం దోబూచులాడుతూ.. మలుపులు తిరిగిన మ్యాచ్‌కు సూపర్‌ ముగింపు! ఈ సీజన్‌లో తొలిసారి సూపర్‌ ఓవర్‌లో ఫలితం తేలిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై దిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. మొదటే విజయం దిశగా సాగినా.. చివర్లో తడబడి, మ్యాచ్‌ను దూరం చేసుకునేలా కనిపించిన దిల్లీ.. చివరికి రసవత్తరంగా సాగిన సూపర్‌ ఓవర్లో ఉత్కంఠ, ఒత్తిడిని అధిగమిస్తూ గెలుపు తీరాలకు చేరింది. మొత్తానికి స్వల్ప స్కోర్లే నమోదయినా రెండు జట్ల పోరాటంతో అభిమానులకు అసలు సిసలైన టీ20 వినోదం దక్కింది.
దిల్లీకి ఇది వరసగా మూడో విజయం

దిల్లీ క్యాపిటల్స్‌కు స్ఫూర్తిదాయక విజయం.. ఆదివారం ఉత్కంఠ రేపిన పోరులో ఆ జట్టు సూపర్‌ ఓవర్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. సూపర్‌ ఓవర్లో మొదట హైదరాబాద్‌ 7 పరుగులు చేసింది.  చివరి బంతికి వార్నర్‌ రెండు పరుగులు తీసినా.. బ్యాట్‌ను క్రీజులో సరిగా పెట్టకపోవడంతో ఒక పరుగు తగ్గింది. ఛేదనలో తీవ్ర ఉత్కంఠ మధ్య దిల్లీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. దిల్లీ పరుగుల్లో మూడు లెగ్‌ బైసే. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై అంతకుముందు స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. మొదట దిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసింది. పృథ్వీ షా (53; 39 బంతుల్లో 7×4, 1×6) రాణించాడు. ఛేదనలో హైదరాబాద్‌ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (66 నాటౌట్‌; 51 బంతుల్లో 8×4) పోరాడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.  
బెయిర్‌స్టో బాదినా..: మందకొడి పిచ్‌పై ఛేదనలో ఆరంభం నుంచే బెయిర్‌స్టో (38; 18 బంతుల్లో 3×4, 4×6) బాదుడు మొదలుపెట్టాడు. వార్నర్‌ (6) ఔటైనా.. ఏమాత్రం వెనక్కి తగ్గని ఈ ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌.. మరింత ధాటిగా ఆడాడు. అక్షర్‌ బౌలింగ్‌లో సిక్స్‌, ఫోర్‌ దంచిన అతడు.. ఆ తర్వాత అవేశ్‌ఖాన్‌ బౌలింగ్‌లోనూ ఓ బంతిని స్టాండ్స్‌లో పడేశాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్‌ కొట్టే క్రమంలో అతను ఔటయ్యాడు. బెయిర్‌ స్టో వెనుదిరిగాక సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ మందగించింది. బౌండరీల రాక తగ్గిపోయింది. సమీకరణం 72 బంతుల్లో 96 పరుగులుగా ఉన్న స్థితిలో విలిమయ్సన్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టి మళ్లీ స్కోరు బోర్డు కదిలించాడు. కానీ విరాట్‌ సింగ్‌ (14 బంతుల్లో 4) తీవ్రంగా తడబడడంతో సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. దీనికి తోడు కేదార్‌ జాదవ్‌ (9) కూడా ఔట్‌ కావడంతో హైదరాబాద్‌ వెనకబడిపోయింది. అయితే సుచిత్‌ (14 నాటౌట్‌; 6 బంతుల్లో 2×4, 1×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టును పోటీలో నిలిపాడు.
ఒక్క ఓవర్‌: చివరి ఓవర్లో (రబాడ) 16 పరుగులు చేయాల్సిన స్థితిలో తొలి బంతి వైడ్‌ కాగా.. అదనంగా వచ్చిన బంతిని విలియమ్సన్‌ ఫోర్‌గా మలిచి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చాడు. రెండో బంతికి ఒక పరుగు రాగా.. మూడో బంతిని సుచిత్‌ సిక్సర్‌గా కొట్టడంతో మ్యాచ్‌ (3 బంతుల్లో 4) హైదరాబాద్‌ వైపు మొగ్గింది. కానీ తర్వాత మూడు బంతులకు 3 పరుగులే రావడంతో మ్యాచ్‌ టై అయింది.
ఆరంభంలో దూకుడు: అంతకుముందు దిల్లీ ఇన్నింగ్స్‌లో పృథ్వీషా ఆటే హైలైట్‌. మెరుపు షాట్లతో అలరించిన అతడు ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. ఒకవైపు ధావన్‌ (28) నెమ్మదిగా ఆడుతుండగా.. చెలరేగి బ్యాటింగ్‌ చేసిన పృథ్వీ దిల్లీకి శుభారంభం అందించాడు. అయితే స్పిన్నర్ల రాకతో దిల్లీ స్కోరింగ్‌ వేగం కాస్త మందగించినా 10 ఓవర్లకు 80/0తో మంచి స్థితిలో నిలిచింది. అయితే ఓవర్‌ తేడాతో ధావన్‌, పృథ్వీ వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో పంత్‌ (37; 27 బంతుల్లో 4×4, 1×6), స్టీవ్‌ స్మిత్‌ (34 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 1×6) జట్టును ముందుకు నడిపించారు. అయితే పంత్‌, హెట్‌మయర్‌ (1) ఒకే ఓవర్లో ఔట్‌ కావడంతో దిల్లీ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది.

దిల్లీ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా రనౌట్‌ 53; ధావన్‌ (బి) రషీద్‌ 28; పంత్‌ (సి) సుచిత్‌ (బి) కౌల్‌ 37; స్మిత్‌ నాటౌట్‌ 34; హెట్‌మయర్‌ (సి) విలియమ్సన్‌ (బి) కౌల్‌ 1; స్టాయినిస్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-81, 2-84, 3-142, 4-145; బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4-0-42-0; అభిషేక్‌శర్మ 1-0-14-0; సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-31-2; సుచిత్‌ 4-0-21-0; విజయ్‌ శంకర్‌ 3-0-19-0; రషీద్‌ ఖాన్‌ 4-0-31-1
సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ రనౌట్‌ 6; బెయిర్‌స్టో (సి) ధావన్‌ (బి) అవేశ్‌ 38; విలియమ్సన్‌ నాటౌట్‌ 66; విరాట్‌సింగ్‌ (సి) స్టాయినిస్‌ (బి) అవేశ్‌ 4; కేదార్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) మిశ్రా 9; అభిషేక్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 5; రషీద్‌ ఎల్బీ (బి) అక్షర్‌ 0; విజయ్‌ శంకర్‌ (బి) అవేశ్‌ 8; సుచిత్‌ నాటౌట్‌ 14; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159; వికెట్ల పతనం: 1-28, 2-56, 3-84, 4-104, 5-117, 6-117, 7-136; బౌలింగ్‌: రబాడ 3-0-25-0; అశ్విన్‌ 4-0-27-0; స్టాయినిస్‌ 1-0-12-0; అక్షర్‌ పటేల్‌ 4-0-26-2; అవేశ్‌ 4-0-34-3, మిశ్రా 4-0-31-1



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని