ఇప్పుడు ప్రశాంతంగా ఉంది: మోరిస్‌
close
Updated : 08/05/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పుడు ప్రశాంతంగా ఉంది: మోరిస్‌

కేప్‌టౌన్‌: ఐపీఎల్‌ బబుల్‌ లోపల కరోనా కేసులు వెలుగు చూశాయనగానే తమ అందరిలో కంగారు మొదలైందని, టోర్నీని అర్ధంతరంగా ఆపేశాక స్వదేశానికి చేరడంతో ఇప్పుడు ప్రశాంతంగా ఉందని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ అన్నాడు. మరో పది మంది దక్షిణాఫ్రికా క్రికెటర్లతో కలిసి స్వదేశానికి చేరుకున్న మోరిస్‌.. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వ షరతుల మేరకు పది రోజులు క్వారంటైన్‌లో గడుపుతున్నాడు. ఐపీఎల్‌ మధ్యలో ఆగిపోవడంపై అతను స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం చాలా ప్రశాంతంగా ఉన్నాను. బబుల్‌ లోపల ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారని తెలియగానే అందరిలోనూ ప్రశ్నలు మొదలయ్యాయి. మాలో అలారం మోతలు మోగడం ఆరంభమైంది. సోమవారం నాటి కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్‌ వాయిదా పడగానే టోర్నీ ఒత్తిడిలో పడబోతోందని అర్థమైంది’’ అని చెప్పాడు. ఐపీఎల్‌ ఆగిపోయినట్లు తెలిసిన సందర్భం గురించి మోరిస్‌ వివరిస్తూ.. ‘‘నేను బస చేసిన హోటల్లో మా జట్టు డాక్టర్‌తో మాట్లాడుతూ వెళ్తుంటే.. సంగక్కర (రాజస్థాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌) ఎదురుపడి తన గొంతు దగ్గర అడ్డంగా చేయి పెట్టి సంజ్ఞ చేశాడు. టోర్నీ కథ ముగిసిందని అప్పుడే అర్థమైంది. వెంటనే అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు చాలా భయపడ్డారు. ఎందుకంటే వారి దేశానికి వెళ్లగానే హోటళ్లలో ఐసొలేట్‌ కావాలి. కానీ అక్కడ గదులు అందుబాటులో లేవు. మా రాజస్థాన్‌ జట్టు నుంచి ముందే స్వదేశానికి వెళ్లిపోయిన టై స్థానంలో ఎంపికైన మా దేశ కుర్రాడు జెరాల్డ్‌ కొయెట్జె పాపం అప్పుడే ఇండియాకు చేరుకుని మాతో కలిశాడు. అతను చాలా బాధ పడుతుంటే అతణ్ని ఓదార్చాను’’ అని మోరిస్‌ తెలిపాడు. గత ఏడాది వరకు బెంగళూరుకు ఆడిన మోరిస్‌ను.. రాజస్థాన్‌ ఈ ఏడాది వేలంలో ఐపీఎల్‌ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.16.25 కోట్లకు కొన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో తడబడ్డ రాయల్స్‌కు ఈ ఆల్‌రౌండర్‌ రెండు మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో విజయాలందించాడు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని