కాష్టం కాలాలంటే కష్టం!
close
Updated : 19/04/2021 07:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాష్టం కాలాలంటే కష్టం!

పెరుగుతోన్న కొవిడ్‌ మరణాలతో అంత్యక్రియలకు ఇబ్బందులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌వ్యాప్తంగా మరణాలు పెరిగాయి. అనారోగ్య సమస్యలతో చికిత్స తీసుకుంటూ మరణించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏప్రిల్‌ మొదటివారంతో పోలిస్తే రెండో వారంలో 10 శాతం అదనంగా చనిపోయారని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గతంలో శ్మశానవాటికల్లో రెండు, మూడు రోజులకోసారి కాష్టం కాలే పరిస్థితి ఉండగా ఇప్పుడు నిరంతరాయంగా దహన సంస్కారాలు కొనసాగుతుండటం గమనార్హం. ఇంత జరుగుతున్నా వైకుంఠథామాల్లో సౌకర్యాలను మెరుగుపరచడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి పెట్టట్లేదన్న విమర్శలొస్తున్నాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఎల్పీజీ దహన వాటికలను అందుబాటులోకి తేవట్లేదని, పనిచేస్తున్న విద్యుత్తు దహనవాటికల పనితీరును మెరుగుపరిచి విశ్రాంతి గదులు, ఇతర సౌకర్యాలను కల్పించాలని పౌరులు కోరుతున్నారు.
నగరంలో మొదటి కొవిడ్‌ కేసు గతేడాది మార్చిలో నమోదైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో మే వరకు పరిస్థితి మెరుగ్గా కనిపించింది. అనంతరం వ్యాధి తీవత్ర ఊపందుకుని కొవిడ్‌ బాధితుల మరణాలు పెరిగాయి. అదే సమయంలో ఆస్పత్రులు నెలల తరబడి మూసి ఉండటం, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు చాలా రోజులపాటు చికిత్స లేకపోవడంతో కొవిడ్‌తో సంబంధం లేనివారూ చనిపోయారు. ఫలితంగా జూన్‌, జులై, ఆగస్టులో మృతులు ఎక్కువగా నమోదయ్యారు. అప్పట్లో లాక్‌డౌన్‌ ఉండటం, బయటి ప్రాంతాల్లో చనిపోయిన వారిని ఊర్లలోకి రానివ్వకపోవడం వంటి పరిస్థితులు ఉండటంతో నగరంలో చనిపోయిన స్థానికేతరులకూ ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించడంతో సంఖ్య ఎక్కువగా కనిపించిందని అధికారులు చెబుతున్నారు.

ఏప్రిల్‌ 5 నుంచి మారిన పరిస్థితి..

ఎర్రగడ్డలోని హిందూ శ్మశానవాటికకు గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏప్రిల్‌ మొదటివారం వరకు తాకిడి లేదు. రోజుకు రెండు, మూడు దహనాలే జరిగాయి. ఏప్రిల్‌ 5 నుంచి సగటున రోజుకు 15 దహనాలు జరుగుతున్నాయి. ఒక్కోరోజు 20కిపైగా మృతదేహాలు వస్తున్నాయి. విద్యుత్తు ఛార్జి చెల్లించలేదంటూ విద్యుత్తు దహనవాటికను మూసేశారు.

బన్సీలాల్‌పేట హిందూ శ్మశానవాటికలో కొవిడ్‌ వ్యాప్తి తగ్గినప్పుడు వారానికి 7-8 అంత్యక్రియలు జరిగేవి. ఇప్పుడు రోజుకు 11-12 జరుగుతున్నాయి. అందులో కొవిడ్‌ కేసులు 3, 4 ఉంటున్నాయి.

అంబర్‌పేట హిందూ శ్మశానవాటికలో విద్యుత్తు దహనవాటిక మార్చి నెలాఖరు వరకు మూసి ఉండేది. కొవిడ్‌ మరణాలు నమోదవడం మొదలయ్యాక దాన్ని అందుబాటులోకి తెచ్చారు. రోజూ 6-7 మృతదేహాలను దహనం చేస్తున్నారు. పక్కనున్న హిందూ శ్మశానవాటికకూ తాకిడి పెరిగింది.

శ్మశానాలు కిటకిట!

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: గ్రేటర్‌ వ్యాప్తంగా సుమారు 50 నుంచి 60 శ్మశానవాటికల్లో కొవిడ్‌ మృతుల అంత్యక్రియలు కొనసాగుతుండగా.. వీటిలో కొన్నింటికి ఒక్కోదానికి రోజుకు గరిష్ఠంగా 20దాకా మృతుల్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆదివారం అంబర్‌పేట శ్మశానవాటికలో ఇద్దరు కొవిడ్‌ మృతులకు అంత్యక్రియలు చేసినట్లు సమాచారం. బన్సీలాల్‌పేటలోని హిందూ శ్మశానవాటికలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వర్షంలోనూ 10కిపైగా మృతదేహాల్ని దహనం చేశారు. ఈఎస్‌ఐ శ్మశానవాటికలో 21 మందికి అంత్యక్రియలు జరగ్గా వీటిలో 8 కొవిడ్‌ మృతదేహాలుగా నిర్వాహకులు నిర్ధారించారు. దాదాపు అన్ని కేంద్రాల్లో ముందస్తుగా పెద్ద ఎత్తున కట్టెల కుప్పల్ని, చితి పేర్చి సిద్ధంగా ఉంచుతున్నారు.
దొరికిందే అదనుగా దోపిడీ..
కొవిడ్‌ బూచిని చూపి ఇదే అదనుగా కొవిడ్‌ మృతుల కుటుంబాల్ని శ్మశానాల నిర్వాహకులు దోచుకుంటున్నారు. ఓవైపు మనిషి పోయిన బాధలో ఉన్న కుటుంబాల నుంచి పెద్దఎత్తున సొమ్ము వసూలు చేస్తూ మరింత దుఃఖంలోకి నెడుతున్నారు. గతంలో ఒక్కో మృతదేహం అంత్యక్రియలకు జీహెచ్‌ఎంసీ నిబంధనల మేరకు రూ.500-రూ.1500 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం ఇష్టారాజ్యంగా ఒక్కో బాధిత కుటుంబం నుంచి రూ.15 వేల నుంచి రూ.25 వేలదాకా దండుకుంటున్నారు. కట్టెలు, అంబులెన్సు, ఇతర ఖర్చుల పేరిట బేరాలాడుతున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని