తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..
close
Updated : 20/04/2021 07:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తొలుత జ్వరం అనుకుని.. చివరి నిమిషంలో మేల్కొని..

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

కొవిడ్‌ ఏ రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుందో తెలియడం లేదు. ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని సకాలంలో వైద్య సేవలు పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నాలుగైదు రోజుల పాటు జ్వరంతో బాధపడుతూ.. రక్త పరీక్షల్లో టైఫాయిడ్‌, డెంగీ అని వచ్చినా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మండు వేసవిలో శరీరం వేడిగా మారడంతో జ్వరం అని భావించి.. చివరి నిమిషంలో మేల్కొని కరోనాను జయించిన వారి ఉదంతాలివి.
* విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి విధి నిర్వహణలో భాగంగా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ నెల మొదటి వారంలో అనారోగ్యానికి గురయ్యారు. రాత్రివేళ ఒక్కసారిగా జ్వరం ఎక్కువైంది. మరుసటి రోజు ఉదయం ఇంటికి సమీపంలోని ఆర్‌ఎంపీ వద్దకు వెళ్తే రక్త పరీక్ష చేయించారు. అందులో టైఫాయిడ్‌ అని తేలింది. వారం రోజుల పాటు మందులు వాడినా తగ్గలేదు. ఆయన భార్యకు జ్వరం వచ్చింది. ఇంట్లో ఉన్న ఇద్దరు పెద్దలు అనారోగ్యానికి గురయ్యారు. ప్రైవేటు ఉద్యోగికి, ఆయన భార్యకు మధుమేహం, రక్తపోటు ఉన్నాయి. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. ఇద్దరికీ వైరస్‌ సోకిందని తేలింది. ఆమెకు శ్వాసపరమైన సమస్యలు ఉండటంతో సమస్య తీవ్రమైంది. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సకు రూ.మూడు లక్షలు ఖర్చు చేశారు. ఆయన ప్రభుత్వం నిర్వహిస్తున్న కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఆ ఇంట్లోని ఇద్దరు పెద్దలు ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రంలో చికిత్స పొంది కోలుకున్నారు. ‘మాకైతే జ్వరం వచ్చింది. పెద్దలకు రాలేదు. వారిని అలాగే వదిలేసి నిర్లక్ష్యం చేసి ఉంటే ఊహించని విషాదం చోటుచేసుకునేదని’ ఆ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు.
* సత్తెనపల్లికి చెందిన వ్యాపారి భార్యకు 20 రోజుల కింద జ్వరం వచ్చింది. రెండు రోజుల చికిత్స అనంతరం తగ్గింది. అనంతరం ఆయనకు జ్వరం వచ్చింది. ఆర్‌ఎంపీ వద్దకు వెళ్తే రక్తపరీక్ష చేయించి టైఫాయిడ్‌ అని చెప్పారు. వారం-పది రోజులు జ్వరం వస్తూ పోతూ ఉండటంతో పాటు శ్వాసపరమైన సమస్యలు తలెత్తాయి. మధుమేహం, రక్తపోటు కూడా ఉండటంతో గుంటూరులోని శ్వాసకోశ వైద్య నిపుణుడి వద్దకు వెళ్లారు. మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌లో భాగంగా కరోనా నిర్ధారణ పరీక్ష చేశారు. వైరస్‌ సోకిందని గుర్తించారు. వారం రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని మందులు రాసిచ్చారు. ‘జ్వరం అనుకుని కరోనా పరీక్ష చేయించుకోకపోతే ఆరోగ్య పరిస్థితి విషమంగా మారేదని’ ఆయన తెలిపారు.
* గుంటూరుకు చెందిన వస్త్ర వ్యాపారి అనారోగ్యానికి గురయ్యారు. ఒంటి నొప్పులు, జ్వరం వచ్చాయి. ఆర్‌ఎంపీ వద్దకు వెళ్తే వేడితో వచ్చిన సమస్యలంటూ ఔషధాలు ఇచ్చారు. మూడ్రోజులకు జ్వరం తగ్గి మళ్లీ వచ్చింది. మళ్లీ అవే మందులు వాడినా తగ్గలేదు. ఒకరోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్ష చేయిస్తే కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించి వారం రోజులు దాటినా అశ్రద్ధ చేయడంతో చికిత్సకు రూ.రెండు లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది.
శరీరంలో అసాధారణమైన మార్పులు గమనిస్తే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.యాస్మిన్‌ తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ పరీక్ష ఉచితంగా చేయడంతో పాటు పాజిటివ్‌ అని నిర్ధారణ అయిన వారికి వెంటనే కొవిడ్‌ కేర్‌ కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు. వారు ఆరోగ్యవంతులయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. 104కు సమాచారం అందజేసి అవసరమైన వైద్య సేవల్ని పొందవచ్చని సూచించారు.

* చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటున్న ఘటనలు రెండు జిల్లాల్లో తరచూ చోటుచేసుకుంటున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగికి జ్వరం వచ్చింది. ఔషధాలు వాడుతూనే విధులకు హాజరయ్యారు. ఒకరోజు తెల్లవారుజామున ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చాయి. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే ప్రయత్నం చేయగా అప్పటికే కరోనా శరీరంలోని ముఖ్య వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి ప్రాణాల్ని బలిగొంది. పల్పాడులోని ఒక పట్టణానికి చెందిన వ్యాపారికి కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. తీర్థయాత్రలకు వెళ్లి వచ్చిన తరువాత జ్వరం వచ్చింది. ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించుకుంటూ రోజూ దుకాణానికి వెళ్లారు. ఐదో రోజు పరిస్థితి విషమంగా మారింది. కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొంది మృతి చెందారు. వైద్యానికి రూ.నాలుగు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. డెల్టాలోని ఒక పట్టణంలని ఒక కుటుంబంలో ఇద్దరు కరోనా పట్ల నిర్లక్ష్యం చూపి ప్రాణాలు వదిలారు. విజయవాడలో ఇలాంటి మరణాలు పదుల సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని