పట్టణ గురుకులం.. బాలలకు వరం
close
Published : 30/07/2021 02:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పట్టణ గురుకులం.. బాలలకు వరం

సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిత

బేల, న్యూస్‌టుడే

వివిధ కారణాలతో నిరుపేద పిల్లలు, అనాథ బాలలు, విధివంచితులు, బాల కార్మికులు చదువుకు దూరమైన డ్రాపౌట్స్‌గా మిగిలిపోతున్నారు. ఇలాంటి వారిని అక్కున చేర్చుకొని, విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవితకు బాటలు వేసేందుకు ప్రభుత్వం బాలుర కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన పట్టణ గురుకుల పాఠశాల సత్పలితాలిస్తోంది. డ్రా పౌట్‌ స్థితి నుంచి గురుకులాల బాట పట్టిస్తున్న అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌(యూఆర్‌ఎస్‌)పై ప్రత్యేక కథనం.

జిల్లాలో ఏటా వందలాది మంది బాలలు బడుల బయటే ఉంటుండగా, పలువురు బాల కార్మికులుగా మారుతున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తల్లిదండ్రుల మరణం.. ఇతర కారణాలతో చదువులకు దూరంగా ఉంటున్నారు. చదువులకు దూరంగా ఉంటున్న బాలలను ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కించి వారిని పాఠశాలలకు వెళ్లి చదువుకునేలా జిల్లా కేంద్రంలో 2017లో పట్టణ గురుకుల పాఠశాల (రెసిడెన్షియల్‌ బ్రిడ్జి స్కూల్‌) కొత్తగా ఏర్పాటైంది. అనాథలు, పేద పిల్లలు, బాల కార్మికులు, బడిమధ్యలో మానేసిన బాలలకు ఇందులో ప్రవేశాలను జిల్లా విద్యాశాఖ కల్పిస్తోంది. ఉచితంగా విద్యా బోధనతో పాటు ఏకరూప దస్తులు, పుస్తకాలు అందజేయడంతో పాటు పాఠశాలలోనే ఉచితంగా వసతి కల్పిస్తూ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.

సామర్థ్యాల స్థాయి పెంపు...

మొదట బడి వాతావరణానికి అలవాటు చేసి కనీస సామర్థ్యాల స్థాయిని పెంపొందించడమే ఈ పాఠశాల ఉద్దేశం. రెగ్యులర్‌ చదువులకు భిన్నంగా ఏ తరగతి వారు చదువు మానేశారో, వారు చదువుల్లో ఏ స్థాయిలో ఉన్నారు. వారి వయసును పరిగణనలోకి తీసుకుని వారు ప్రస్తుతం ఏ తరగతిలో ఉండాలన్న దాన్ని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష బోధనకు అవకాశం లేక ఆయా గ్రామాల్లోని విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వీక్షించేలా ఉపాధ్యాయులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. గత నాలుగేళ్లలో 76 మంది విద్యార్థులు వివిధ ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలతో పాటు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో సీట్లు సాధించారు. ఇంకొందరు ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ప్రవేశాలు తీసుకుని చదువు కొనసాగిస్తున్నారు.

సీట్లు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న డీఈఓపట్టణ గురుకులం.. బాలలకు వరం


మంచి అవకాశం

ప్రశాంత్‌రెడ్డి, ప్రత్యేకాధికారి, పట్టణ గురుకుల పాఠశాల

పట్టణ గురుకుల పాఠశాల బడిబయట బాలలకు వరంగా ఉంది. మధ్యలో చదువు మానేసిన బాలలకు వారి వయసుకు తగ్గ బోధన చేస్తూ సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. గురుకుల విధానంతో విద్యార్థులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉచితంగా చదువుకునే అవకాశం ఉంది. బడిబటయ పిల్లలందరిని పాఠశాలలో చేర్పించేలా ప్రయత్నం చేస్తున్నాం.

సద్వినియోగం చేసుకోవాలి

- డా.రవీందర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి

పట్టణ గురుకుల పాఠశాలను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. చదువులు మధ్యలో మానేసిన అన్ని వర్గాల పిల్లలను అందులో చేర్చుకుని వారికి చదువుతో పాటు భోజన వసతి ఉంటుంది. జిల్లాలోని స్వచ్ఛంద సంస్థలు, యువకులు, ఉపాధ్యాయులు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను ఇందులో చేర్పించి వారి చదువులను ప్రోత్సహించాలి.Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని