అభివృద్ధికి  దారి పడుతో౦ది
close
Published : 30/07/2021 06:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభివృద్ధికి  దారి పడుతో౦ది

వాడరేవు-పిడుగురాళ్ల మార్గం విస్తరణకు ప్రతిపాదనలు

రెండు జిల్లాల ప్రజలకు ఎంతో సౌలభ్యం

ఈనాడు-గుంటూరు, న్యూస్‌టుడే-చిలకలూరిపేట గ్రామీణ

చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద ప్రమాదకరంగా వాడరేవు-పిడుగురాళ్ల రహదారి

రెండు జిల్లాల పరిధిలో పలు పట్టణాలకు రాకపోకలు సాగించడంతో పాటు తెలంగాణ వైపు మార్గాలను అనుసంధానం చేయడంలో వాడరేవు-నరసరావుపేట-పిడుగురాళ్ల ఎంతో కీలకమైనది. అయితే ఈ రహదారి విస్తరణకు నోచుకోకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. మొత్తం 81 కిలోమీటర్ల రహదారిని విస్తరిస్తే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు అభివృద్ధికి ముందడుగు పడనుంది ఆర్‌అండ్‌బీ నుంచి 2015లో జాతీయ రహదారుల సంస్థ పరిధిలోకి తీసుకున్నప్పటికీ విస్తరణ ప్రతిపాదనలకే పరిమితమైంది. తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతుండటంతో వాహన చోదకులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఈ రహదారి ప్రాధాన్యం దృష్ట్యా విస్తరించాలని ఈప్రాంత ప్రజలు, ప్రజాప్రతినిధులు జాతీయ రహదారుల సంస్థకు విన్నవించడంతో ఎట్టకేలకు సర్వే, సవివర ప్రాజెక్టు నివేదిక తయారీకి టెండర్లు పిలిచారు. విస్తరణ పనులు పూర్తయితే కీలకమైన మార్గాలకు ఇది అనుసంధానం రహదారిగా ఉపయోగపడుతుంది.

వాహన చోదకులకు అవస్థలు

● నరసరావుపేటలో గడియార స్తంభం, మల్లమ్మ సెంటర్‌, శివుడిబొమ్మ సెంటర్‌లో నిత్యం ట్రాఫిక్‌ రద్దీ ఉంటోంది.

● చిలకలూరిపేటలో చౌత్రా సెంటర్‌, లక్ష్మినరసింహస్వామి ఆలయం మలుపు, పసుమర్రు వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉన్నాయి.

● నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వెళ్లే క్రమంలో కేశానుపల్లి, కనపర్రు బావి సెంటర్‌, అమీన్‌సాహెబ్‌పాలెం, గంగనపాలెం, కావూరు, లింగంగుంట్ల వంతెన వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

● చిలకలూరిపేట మండలం పసుమర్రు వద్ద నిత్యం వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఇక్కడ రోడ్డు ఇరుకుగా ఉండటం ప్రధాన కారణం.

● ప్రకాశం జిల్లాలో అన్నంబొట్లవారిపాలెం, తిమ్మరాజుపాలెం, పర్చూరు, కారంచేడు, చీరాలలో ఆక్రమణల వల్ల వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

కీలకమైన మార్గం

● వాడరేవు-నరసరావుపేట-పిడుగురాళ్ల రహదారిని నాలుగు వరుసల రహదారిగా విస్తరిస్తే తీర ప్రాంతంలోని ఒంగోలు-దిగమర్రు రహదారికి చీరాల వద్ద అనుసంధానమై అటు చెన్నై, ఇటు తెలంగాణ ప్రాంతాలకు వెళ్లేవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ● అద్దంకి-నార్కట్‌పల్లికి నకరికల్లు అడ్డరోడ్డు వద్ద అనుసంధానం కావడం వల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్లేవారికి ఉపయోగకరం. అదేవిధంగా హైదరాబాద్‌ నుంచి చీరాల వచ్చే వారికి ఈమార్గం అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ● చీరాల తీరంలో హార్బరును అభివృద్ధి చేయాలన్నా ప్రణాళికలు ఉన్నందున ఇక్కడి నుంచి తెలంగాణకు సరకు రవాణాకు వాడరేవు-పిడుగురాళ్ల మార్గం కీలకంగా మారనుంది. ● హైదరాబాద్‌ నుంచి దాచేపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట మీదుగా చిలకలూరిపేట వచ్చి 16వ నంబరు జాతీయరహదారిలోకి చేరుకుని గుంటూరు నగరంలోకి వెళ్లకుండా అమరావతి, విజయవాడ చేరుకోవచ్ఛు

సవివర ప్రాజెక్టు నివేదికకు టెండర్లు

వాడరేవు-నరసరావుపేట-పిడుగురాళ్ల మార్గాన్ని పట్టణాల పరిధిలో నాలుగు వరుసల రహదారి, మిగిలిన ప్రాంతాల్లో 10 మీటర్ల వెడల్పుతో విస్తరిస్తారు. ఈక్రమంలో ఎక్కడెక్కడ వంతెనలు నిర్మించాలి. రహదారి ఆకృతులు తయారుచేయడానికి జాతీయ రహదారుల సంస్థ సర్వే కోసం టెండర్లు పిలిచింది. టెండరు ఒప్పందం పూర్తయి ఏజెన్సీ సవివర నివేదిక తయారీకి ఏడాది గడువు ఇచ్చారు. ఇది అందుబాటులోకి వస్తే రోడ్డు విస్తరణకు మార్గం సుగమం అవుతుందని జాతీయ రహదారుల సంస్థ అధికారులు తెలిపారు.

ఆక్రమణ చెరలో రహదారి

ప్రకాశం జిల్లాలోని చీరాల, కారంచేడు, పర్చూరు, తిమ్మరాజుపాలెం, అన్నంబొట్లవారిపాలెం గ్రామాల పరిధిలో రహదారిపై ఆక్రమణలు ఉన్నాయి. రహదారిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేయడంతో రహదారి కుంచించుకుపోయింది. దీనిని గుర్తించిన జాతీయ రహదారుల సంస్థ అధికారులు పలుమార్లు ఒంగోలు ఆర్డీవో, సంబంధిత తహశీల్దార్లకు 2018 నుంచి లేఖలు రాస్తున్నారు. ఆక్రమణలు తొలగించి సర్వే చేసి రహదారి హద్దులు నిర్ణయించాలని కోరుతున్నారు. రెవెన్యూ యంత్రాంగం నుంచి సహకారం లేకపోవడంతో ఆక్రమణల తొలగింపు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

కుంచించుకుపోయిన మార్గం

వాడరేవు నుంచి పిడుగురాళ్ల వరకు 81 కిలోమీటర్లు ప్రయాణించే మార్గంలో వంతెనలు ఉన్నచోట 3.6 మీటర్లు, చాలాచోట్ల రహదారి వెడల్పు 5.5 నుంచి 6.7 మీటర్లు మాత్రమే ఉంది. మూడేళ్ల కిందట చేసిన సర్వేలో రోజుకు ఈమార్గంలో 9480 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారుల సర్వేలో గుర్తించారు. దీంతో ఈమార్గాన్ని విస్తరించాలని అప్పటి నుంచి ప్రతిపాదనలు పంపుతున్నారు. 2015లో అప్పటి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఈమార్గాన్ని 167ఏ జాతీయ రహదారిగా ఎంపిక చేయడంతోపాటు అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఏడాది కిందట రోడ్డు బలోపేతం చేసినా విస్తరణ చేపట్టలేదు. హైదరాబాద్‌ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పలు పట్టణాలతోపాటు శని, ఆదివారాల్లో చీరాల బీచ్‌కు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దీంతో వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో వాహనాల రాకపోకలు పెరగడం వల్ల విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది.

లింగంగుంట్ల వంతెన సమీపంలో బోల్తా పడిన లారీ (పాతచిత్రం)


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని