అక్రమాలకు సహకారం!
close
Published : 30/07/2021 03:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అక్రమాలకు సహకారం!

తీసుకోని రుణాలకూ నోటీసులు●

అమాయక రైతుల బలి●

గూడూరు పరపతి సంఘంలో ఇదీ సంగతి

గూడూరు వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం

గూడూరు, న్యూస్‌టుడే: గూడూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో కొందరు రైతులు అప్పులు తీసుకున్నారు. సంక్షేమ పథకాల పేరిట రుణాలను మంజురు చేస్తే ఇదే అదనుగా సంబంధిత పరపతి సంఘానికి చెందిన కొందరు పాడి పరిశ్రమ, డెయిరీ పేరుతో ఎల్‌టీ (లాంగ్‌ టర్మ్‌) లోన్ల మంజూరుకుగాను ఒక్కో రైతు నుంచి రూ.10 వేలకుపైగా వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు మండల పరిధిలోని మునగాల గ్రామానికి చెందిన కొందరు రైతులకు సంబంధించి బర్రెల రుణాల పేరుతో ఒకసారి మంజూరు చేసి రెండు మార్లు ఇచ్చినట్లు అధికారిక లెక్కలు చూపుతుండటం గమనార్హం.

ఖాళీ ఓచర్లపై సంతకాలు: ఒక్కో రైతుకు రూ.86,500 చొప్పున ఏడాదిలో రెండుసార్లు మంజూరు చేశామని.. ఒక్కొక్కరికి రూ.1.73 లక్షలు ఇచ్చినట్లు అధికారులు చూపుతున్నారు. తీరా చూస్తే రైతు చేతికి అందింది రూ.60 వేలు మాత్రమే కావడం గమనార్హం. అన్నదాతల నిరక్షరాస్యతను అవకాశంగా చేసుకుని కొందరు ఖాళీ ఓచర్లపై సంతకాలు చేసేసుకుని నిధులు మింగేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రసుత్తం రైతులు మాత్రం రూ.లక్షల్లో అప్పులు తీసుకున్నట్లు చూపుతున్నారు. గూడూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం పరిధిలో దాదాపు 2,500 మందికి సభ్యత్వం ఉంది. గత కొన్నేళ్లుగా వీరికి రూ.20 కోట్ల వరకు రుణాలిచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

పర్యవేక్షణ కరవు..: ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరవవడంతో అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. రైతులకు అందాల్సిన రుణాలు సక్రమంగా ఇవ్వకపోవగా.. కొందరు తీసుకోకపోయినా తీసుకున్నట్లు చూపారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు అప్పులకు సంబంధించి వడ్డీపై వడ్డీ వేసి వారు కోలుకోలేని విధంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణ చేయడం ద్వారా అవినీతి వెలుగుచూసే అవకాశముంది.

వారిపై చర్యలు తీసుకోవాలి

- ప్రసాదు, రైతు, మునగాల

ఎల్‌టీ లోన్ల కింద 2015లో నాకు ఒక్కసారే రూ.60 వేలను చేతికి అందించారు. ఖాళీ ఓచర్లపై సంతకాలు పెట్టించుకుని రెండుసార్లు రుణాలు ఇచ్చినట్లు రాసుకున్నారు. లోను రూ.86,500 అయితే మిగతా డబ్బులు ఎవరు తీసుకున్నట్లు.. రైతులను ఇంత మోసం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకు ఇచ్చింది రూ.60 వేలే కాగా ప్రసుత్తం రూ.3 లక్షల వరకు అప్పుగా చూపుతున్నారు. బోగస్‌ లోన్ల పేరుతో రూ.లక్షలు కాజేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి.

భారీగా బకాయిలు చూపుతున్నారు..

- హనుమన్న, రైతు

గూడూరు పరపతి సంఘం పరిధిలో రూ.60 వేలు ఇచ్చి నేడు రూ.లక్షల బకాయిలు చూపుతున్నారు. చదువురాని వాళ్లను ఆసరాగా తీసుకుని మోసం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. నిజంగా మాకు ఎంత లోను ఇచ్చారో వారికి తెలుసు. కానీ లెక్కల్లో రెండు సార్లు ఇచ్చినట్లు సంతకాలు చేయించుకున్నారు. ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల్లో తీసుకున్న సొమ్ము చెల్లించడమే కష్టం కాగా.. తీసుకోని రుణం ఎలా చెల్లించాలి.

తాఖీదులు ఇచ్చాం

- శివకుమార్‌రెడ్డి, గూడూరు పరపతి సంఘం కార్యదర్శి

ఎల్‌టీ లోన్ల కింద రైతులకు 2015లో రుణాలు అందించాం. నాటి నుంచి పెండింగులో ఉన్న రుణాలను చెల్లించాలని రైతులకు తాఖీదులు ఇచ్చాం. ఓఎస్డీ నుంచి వచ్చిన ఉత్తర్వులతోనే చేశాం. రైతులకు అందాల్సిన రుణాలు అందాయి. ప్రతిదీ అధికారిక దస్త్రాల్లో ఉంది. ఎలాంటి మోసాలు జరగలేదు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని