మోజు మొదలాయె!
close
Updated : 30/07/2021 11:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మోజు మొదలాయె!

వ్యవసాయ క్షేత్రాల్లో గృహాలు
ఒత్తిడి నుంచి దూరమయ్యేందుకు
న్యూస్‌టుడే, కాజీపేట
చిల్పూర్‌ గుట్ట వద్ద ఫాం హౌస్‌

పరుగులు పెట్టే నగర జీవనం ఆహ్లాదం కనుమరుగై.. ఆనందం దూరమై..గడుపుతున్న కుటుంబాలు.. కాసింత ప్రశాంతంగా ఉండేందుకు వారాంతాల్లో విశ్రాంతిగా ఉండేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఇల్లు కట్టుకుని అక్కడ కొంత కాలం గడిపేందుకు నగర పౌరులు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదు తరహాలో ఫాంహౌస్‌ల నిర్మాణంపై మోజు పెంచుకుంటున్నారు. తక్కువ ధరలో భూములను కొనుగోలు చేసి పొదరిల్లు నిర్మించుకుంటున్నారు. వాటి చుట్టూ అభిరుచికి తగ్గట్లుగా పచ్చదనం పెంచుకుంటున్నారు. కేవలం ఆహ్లాదం కోసమే కాకుండా, భవిష్యత్తులో భూమి విలువ కూడా పెరుగుతుందనే దిశగా ఆలోచిస్తూ నగర శివారుల్లో భూములు కొనుగోలు చేస్తున్నారు.

భూముల కొనుగోలులో ఎక్కువ డబ్బు ఉన్న వారు, విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఇటువంటి ఫాంహౌస్‌ల మీద మోజు పడుతున్నారు. నగరంలో ఇరుకు ఇళ్లలో నివాసం ఉంటూ, ప్రతి రోజూ ధ్వని, వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతూ జీవనం సాగించడంతో విసుగు చెందుతున్న వారు నగరానికి దూరంగా ఒక రోజైనా గడపాలని భావిస్తున్నారు. మధ్యతరగతి పౌరులు ఏటూరునాగారం అభయారణ్యంలోకి వెళ్లి పర్యాటక శాఖ కాటేజీలలో బస చేస్తుంటే ధనికులు మాత్రం సొంతంగా ఫాంహౌస్‌లను నిర్మించుకుంటున్నారు. దీంతో వ్యవసాయ భూములకు గిరాకీ పెరిగింది.

నగరంలో కలిసిపోయి..

నగరంలో ఎప్పటి నుంచో ఈ ఫాంహౌస్‌ సంస్కృతి ఉంది. కొందరు బడా నేతలు నాడు నగరానికి సమీపంలో నిర్మించుకున్న ఇళ్లు ఇప్పుడు నగరంలో కలిసిపోయాయి. ఇప్పుడు అవే ఎక్కువ ధర పలుకుతున్నాయి. రాంపూర్‌ సమీపంలో 30 సంవత్సరాల క్రితం గ్రీన్‌సిటీ పేరుతో ఫాంహౌస్‌ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు అందులో మామిడి చెట్లు ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నగరంలోని ప్రముఖ వైద్యులు ఇందులో ఫాంహౌస్‌లు ఏర్పాటు చేసుకున్నారు. నెలలో ఒక్కసారైనా కుటుంబంతో ఇందులో గడుపుతున్నారు.

భద్రంగా ఉండాలంటే..

నగరానికి దూరంగా వ్యవసాయ క్షేత్రాల్లో ఇళ్లు నిర్మించుకోవాలంటే కొన్ని సూచనలు పాటించడం అవసరం. ముఖ్యంగా మిత్రులందరూ కలిసి భూమిని కొనుగోలు చేసి ఒకే చోట ఏర్పాటు చేసుకుంటే మంచిది. భద్రతాపరంగా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.క్షేత్రం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేసుకుంటే రక్షణ ఉంటుంది. కాపలాదారుడ్ని ఉమ్మడిగా పెట్టుకోవడం వల్ల ఖర్చు కలిసివస్తుంది. వారానికోసారైనా గృహాలను శుభ్రం చేస్తూ ఉండేలా చూడాలి. పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు, కూరగాయల తోటలు పెంచుతుంటే వాటికి ఉమ్మడిగా పరిరక్షించుకోవచ్ఛు

ప్రవాసులే ఎక్కువ..

ఎక్కువగా విదేశాల్లో ఉండేవారు ఈ సంస్కృతిపై మక్కువ చూపుతున్నారు. విదేశాల నుంచి వచ్చాక తల్లిదండ్రులతో ఇంట్లో కంటే ఇలాంటి గృహాలకు వెళ్లి గడుపుతున్నారు. నగర వాతావారణానికి కాస్త దూరంగా ఉండాలని ఇలా చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న పంటలు వీలైతే అమ్ముకుంటూ ఆదాయం పొందుతున్నారు.

ఇవి ఉండేలా నిర్మిస్తున్నారు..

* పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులు, ఉయ్యాల

* ఈత కొలనులు

* బ్యాడ్మింటన్‌ వంటి ఆటలకు కోర్టులు

* ఉదయపు, సాయంత్రపు నడకకు దారులు

అవసరాన్ని బట్టి సౌకర్యాలు -నారాయణరావు, ఫాంహౌస్‌ల వ్యాపారి

నగర పౌరుల్లో ఇప్పుడిప్పుడే వ్యవసాయ క్షేత్రాల్లో గృహాల ఏర్పాటుపై ఆసక్తి మొదలైంది. కొనుగోలు చేసేవారి ఆలోచనల మేరకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. మాదిరి ఫాంహౌస్‌లను నిర్మించి వాటి ప్రకారం అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నాం. నగరానికి మరీ దూరంగా కాకుండా 40 కిలోమీటర్ల పరిధిలో ఉండేలా ఇష్టపడుతున్నారు. ప్రకృతి దృశ్యాలైన కొండలు, పచ్చటి పొలాలు వంటివి ఉన్న చోట నిర్మిస్తే త్వరగా అమ్ముడవుతున్నాయి.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని