చేరువలో  ఖరీదైన వైద్యం 
close
Updated : 30/07/2021 05:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చేరువలో  ఖరీదైన వైద్యం 

జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మూడు ప్రత్యేక విభాగాలు

కార్పొరేట్‌కు దీటుగా రోగులకు చికిత్సలు

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అత్యంత ఖరీదైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సదుపాయాలతో అత్యవసర విభాగాలు ప్రారంభమయ్యాయి. సర్కారు దవాఖానాలో ఇన్నాళ్లు కలగా మిగిలిన కార్డియాక్‌, న్యూరాలజీ, యూరాలజీ ప్రత్యేక వైద్యసేవలు రోగులకు చేరువయ్యాయి. ఆయా విభాగాల్లో ఆధునిక వైద్య పరికరాలు సమకూరాయి. వైద్య నిపుణులు ఓపీ, ఐపీ సేవలను అందిస్తున్నారు. గత ఏడాదే ఇన్‌పేషంట్‌ సేవలు కూడా అందించాలని భావించినా కొవిడ్‌ కారణంగా ఆలస్యమైంది. ప్రస్తుతం వార్డులను కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దారు. ఫలితంగా ముఖ్యమైన విభాగాల్లో ప్రత్యేక సేవలకు ఖమ్మం ఆస్పత్రి కేంద్రంగా మారిందని చెప్పవచ్ఛు అవసరాలకు అనుగుణంగా సేవలు మరింతగా మెరుగుపడనున్నాయి. ఇప్పటివరకు రోగులకు సాధారణ చికిత్సలకే పరిమితమైన ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యసేవలు కూడా దరిచేరడం పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తోంది.

మూత్రకోశ వ్యాధులకు..

ఇప్పటివరకు మూత్రకోశ వ్యాధులకు సంబంధించి పూర్వ ఖమ్మం జిల్లా వాసులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీసేవారు. తాజాగా పెద్దాసుపత్రిలో ఐదు మంచాలతో ఐసీయూను ఏర్పాటు చేశారు. ఓపీ, ఐపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇక్కడే మెరుగైన వైద్యం లభించనుంది. డయాలసిస్‌ అవసరమున్న రోగులను గుర్తిస్తారు. అవసరమున్నవారికి ఆధునిక విధానంలో శస్త్రచికిత్సలు చేస్తారు. మూత్రపిండాల సమస్యలతో ప్రైవేటుకు వెళ్లి ఇల్లూఒళ్లు గుల్ల చేసుకుంటున్న రోగులకు ఊరట లభించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రాఘవేంద్ర కోరారు.


పది పడకలతో ‘న్యూరో’

 న్యూరాలజీ విభాగం అందుబాటులోకి రావడంతో రోగులకు ఎంతో విలువైన సేవలు ఉచితంగానే అందుతున్నాయి. ప్రమాద క్షతగాత్రులు, తలనొప్పి, తలలో గడ్డలు కట్టడం, బ్రెయిన్‌ స్ట్రోక్‌, పక్షవాతం, వెన్నుపూస సమస్యలు ఇలా నరాలకు సంబంధించిన ప్రతి రుగ్మతకు పరిష్కారం లభిస్తుంది. వ్యాధి నిర్ధారణకు సీటీ స్కాన్‌ అవసరముంటుంది. బయట ఈ పరీక్షలకు రూ. 1500 నుంచి రూ.5వేల వరకు ఖర్చు అవుతుంది. అవసరమైన రోగులకు సీటీ స్కాన్‌ పరీక్షలు ఇక్కడే నిర్వహించనున్నారు. సంబంధిత రోగులకు ఇన్‌పేషంట్‌ సేవలందించేందుకు పది పడకలతో ఐసీయూ వార్డును ఏర్పాటు చేశారు. ఈ విభాగంలో త్వరలో శస్త్రచికిత్సలు కూడా ప్రారంభిస్తామని న్యూరోసర్జన్‌ డాక్టర్‌ చైతన్య తెలిపారు.


పెద్దాసుపత్రికి ‘గుండె’కాయ

గుండె సంబంధిత సేవలు చేరువలోకి వచ్చాయి. ఓపీ, ఐపీ సేవలందించేందుకు సదుపాయాలు సమకూరాయి. ఇప్పటికే పది పడకలతో ఐసీయూ వార్డును సిద్ధం చేశారు. త్వరలో క్యాథ్‌లాబ్‌ను అందుబాటులోకి తేనున్నారు. దీనిద్వారా గుండె సమస్య ఏమిటో నిర్ధారిస్తారు. అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమున్న బాధితులకు యాంజియోప్లాస్టీ సేవలు కూడా అందనున్నాయి. గతంలో రోగులు హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ వంటి నగరాలు, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేవారు. అలాంటి వారికి ఇక్కడే చికిత్సలు లభిస్తాయి. నిరుపేద వర్గాలు గుండె జబ్బులకు చికిత్స పొందే సౌకర్యాలు మెరుగుపడ్డాయని కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సీతారాం తెలిపారు.


ప్రత్యేక వైద్యనిపుణులతో చికిత్సలు

జిల్లా కేంద్ర ఆస్పత్రి ప్రత్యేక విభాగాల్లో వైద్య నిపుణులను నియమించాం. ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కార్డియాలజీ, యూరాలజీ, న్యూరాలజీ సేవల కోసం రోగులు ఇబ్బందులు పడేవారు. ఇకపై వారికి ఇక్కడే చికిత్సలు అందిస్తాం. ఈ మూడు విభాగాల్లో రోజుకు 100 నుంచి 150 మంది రోగులు చికిత్స కోసం వస్తున్నారు.

-డాక్టర్‌ బి.వెంకటేశ్వర్లు, ఆస్పత్రి పర్యవేక్షకులు


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని