10 గంటలు.. ఉత్కంఠ
close
Updated : 30/07/2021 05:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

10 గంటలు.. ఉత్కంఠ

కారును వెలికితీసేందుకు ప్రయాస

శోకసంద్రంలో మృతుడి కుటుంబీకులు

ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌, నేరవార్తలు

న్యూస్‌టుడే- చిగురుమామిడి, తిమ్మాపూర్‌

క్రేన్‌ సహాయంతో కారు వెలికితీత

కారు బావిలో పడిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఉదయం 11.05 గంటలకు కారు నీట మునిగిపోగా.. వెలికితీసే వరకు రాత్రి 8.30 అయింది.. ఈ 10 గంటల పాటు తీవ్ర ఉత్కంఠ నెలకొంది.. ఏం జరిగిందోనని జనం పెద్దఎత్తున తరలివచ్చారు.. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నములుకనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం పెనువిషాదం నింపింది.

కారులో ఎంతమంది ఉన్నారనే విషయమై రోజంతా ఆందోళన నెలకొంది. పోలీసులతో పాటు సమీప గ్రామాల యువత, రైతులు, అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. బావిలో 60 అడుగుల లోతులో వాహనం అడుగుభాగానికి చేరడంతో వెలికితీత కష్టసాధ్యమైంది. గజ ఈతగాళ్లు పలుమార్లు లోపలికి వెళ్లి వాహనానికి కొక్కెం తగిలించేందుకు విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు రాత్రి 8 గంటల తర్వాత కారుని వెలుపలికి తీయగలిగారు.

పాపయ్యనాయక్‌ మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుమారుడు

కొట్టొచ్చిన పర్యవేక్షణ లేమి..

జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించినప్పటికీ సహాయక చర్యల్లో లోపాలు కనిపించాయి. కారులో ఎంతమంది ఉన్నారో తెలియక గుమిగూడిన వారిలో ఆందోళన కనిపించింది. ప్రమాద స్థలికి పోలీసు ఉన్నతాధికారి సహా పాలనాధికారి ఎవరూ రాకపోవడంతో సహాయ చర్యలు మందకొడిగా సాగాయి. జాలర్లు, ఈతగాళ్లు శక్తికి మించి ప్రయత్నాలు చేసినా.. సరైన సాంకేతిక తోడ్పాటు అందలేదు. దీంతో గంటల తరబడి సహాయక చర్యలు చేపట్టాల్సి వచ్చింది. బావిలో నీటిమట్టాన్ని కచ్చితంగా అంచనా వేయకపోవడంతోపాటు నీళ్లను తోడే చర్యలు చేపట్టలేదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామమాత్రపు ప్రయత్నాలే కనిపించాయి. ఇక్కడి వారంతా యంత్రాంగం వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కన్నీరు మున్నీరుగా..

కారు ప్రమాదంలో విశ్రాంత ఎస్సై పాపయ్యనాయక్‌(60) మృతిచెందడంతో విషయం తెలుసుకుని సంఘటనా స్థలికి వచ్చిన అతని భార్య భారతి, కొడుకు కిరణ్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. అక్కడే సహాయక చర్యల్లో ఉన్న అగ్నిమాపక అధికారి భూదయ్య నాయక్‌ మృతదేహాన్ని గుర్తించి బోరుమన్నాడు. అన్న మరణించిన విషయాన్ని అతని కుటుంబీకులకు ఫోన్‌లో తెలియజేశారు. దీంతో కన్నీటిపర్యంతమైన వాళ్లు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహం వద్ద రోదించారు. అక్కన్నపేట పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా పనిచేసిన పాపయ్యనాయక్‌ రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. ఈయనకు భార్యతోపాటు ఒక కొడుకు కిరణ్‌, కవిత, కల్పన అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కిరణ్‌కుమార్‌ తిమ్మాపూర్‌ మండలం నల్లగొండ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా కోడలు కరీంనగర్‌లో వైద్యురాలు.. ఇద్దరు కూతుళ్లలో పెద్దకూతురు వంగరలో ప్రధానోపాధ్యాయురాలు కాగా.. చిన్నకూతురు కల్పన హన్మకొండలోని డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన పాపయ్యనాయక్‌ తన పిల్లల్ని విద్యావంతులుగా మార్చేందుకు తోడ్పాటును అందించారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ నుంచి సివిల్‌ ఎస్సై హోదావరకు తన పనితీరుతో పాపయ్యనాయక్‌ గుర్తింపు అందుకున్నారు. కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌లో నివాసముంటున్న పాపయ్యనాయక్‌ తన సొంతూరు వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి సూర్యనాయక్‌ తండా వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.


కళ్లముందే ఘటన

- శ్రీధర్‌, ప్రత్యక్ష సాక్షి, రేగొండ

నేను చూస్తుండగానే కారు బావిలో బోల్తా పడింది. చిగురుమామిడికి నేను ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డుకు ఎడమవైపు ఆగి ఉన్నాను. ఇదేక్రమంలో వేగంగా చిన్నముల్కనూర్‌ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లడం కనిపించింది. వెంటనే వెళ్లి చూసేసరికే కారు మునుగుతోంది. గట్టిగా అరుస్తూ పలువురిని పిలిచాను. దారిపై వెళ్తున్నవారు ఆగి ప్రయత్నాలు చేసినా.. చూస్తుండగానే కారు లోపలికి వెళ్లిపోయింది.


ఆఖరుకు ఆస్కాలైట్‌తో...

ఓ వైపు చీకటి పడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది ఏర్పాటు చేసిన ఆస్కాలైట్‌ సేవలకు ఉపయుక్తంగా మారింది. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వెంకన్న నేతృత్వంలో సిబ్బంది రాత్రి వేళ స్ఫూర్తిదాయక సేవలు అందించారు. ఎల్‌ఎండీ నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు కఠోరంగా శ్రమించారు. రాత్రి వేళల్లోనే పగటిని తలపించేలా ఉన్న ఆస్కాలైట్‌ సాయంతో రెండు క్రేన్‌లను ఉపయోగిస్తూ.. ప్రణాళిక ప్రకారం నలువైపులా కొక్కేలను కారుకు తగిలేలా ప్రయత్నించారు. ఒక దశలో కొంచెం పైకి వచ్చిన కారుకు.. 20 అడుగుల లోతుకు వెళ్లిన ఈతగాళ్లు తాళ్లను కారు చక్రానికి అమర్చడంతో వాహనం బయటకు వచ్చింది. మానకొండూర్‌, కరీంనగర్‌కు చెందిన 12 మంది అగ్నిమాపక సిబ్బందితోపాటు 8 మంది గజ ఈతగాళ్లతో కూడిన కరీంనగర్‌కు చెందిన రెస్క్యూటీం సేవల్ని అందించారు. అగ్నిమాపక సిబ్బందిలో డ్రైవర్‌ రాంచందర్‌, సంతోష్‌ కూడా తోడ్పాటును అందించారు.

 


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని